
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం 18 శాతం పెరిగి రూ. 10,342 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ3లో కే. 8,758 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,523 కోట్ల నుంచి రూ. 40,652 కోట్లకు బలపడింది. వడ్డీయేతర ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 8,184 కోట్లను తాకింది. ఇక నికర వడ్డీ ఆదాయం 13 శాతం ఎగసి రూ. 18,443 కోట్లను దాటింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ. 10,591 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 39,839 కోట్ల నుంచి రూ. 43,365 కోట్లకు పురోగమించింది.
డిపాజిట్లు జూమ్
క్యూ3లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.81 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 0.09 శాతం నుంచి 0.4 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,414 కోట్ల నుంచి రూ. 2,994 కోట్లకు తగ్గాయి. డిపాజిట్లు దాదాపు 14 శాతం ఎగసి రూ. 14,45,918 కోట్లకు చేరగా.. అడ్వాన్సులు(రుణాలు) 16.5 శాతం వృద్ధితో 12,60,863 కోట్లను తాకాయి. గత 12 నెలల్లో 294 బ్రాంచీలతోపాటు 16,852 మంది ఉద్యోగులను జత చేసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు 15 శాతం అధికమై 9,851 కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment