వృద్ధి వేగంలో భారత్‌ టాప్‌ | India GDP Expands 5. 4percent in Third Quarter, Estimated to Rise 8. 9percent in FY22 | Sakshi
Sakshi News home page

వృద్ధి వేగంలో భారత్‌ టాప్‌

Published Tue, Mar 1 2022 4:28 AM | Last Updated on Tue, Mar 1 2022 4:28 AM

India GDP Expands 5. 4percent in Third Quarter, Estimated to Rise 8. 9percent in FY22 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌) 5.4 శాతం పురోగమించింది. వృద్ధి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ, డిసెంబర్‌ త్రైమాసికంలో ఈ స్థాయి ఎకానమీ పురోగతి ఏ దేశం సాధించలేదు. దీనితో ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో  ఆసియా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచింది. భారత్‌ తర్వాత చైనా మూడవ త్రైమాసికంలో 4 శాతం ఎకానమీ వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఇక ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, వ్యవసాయం, నిర్మాణ, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవా రంగాల వేగం తాజా గణాంకాల ప్రకారం ఇంకా తక్కువగానే ఉండడం గమనార్హం.  జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఈ మేరకు తాజా గణాంకాలను ఆవిష్కరించింది. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

మూడు త్రైమాసికాలు ఇలా...
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ వృద్ధి రేటు 20.3 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) 8.5 శాతంగా ఉంది. ప్రస్తుత సమీక్ష క్వార్టర్‌లో 5.4 శాతం పురోగతి ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికాల్లో ఎకానమీ పరిస్థితి చూస్తే, కరోనా సవాళ్ల నేపథ్యంలో వృద్ధిలేకపోగా  ఏప్రిల్‌–జూన్, జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికాల్లో వరుసగా 23.8%, 6.6% క్షీణతలు నమోదయ్యాయి. అయితే అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో స్వల్పంగా 0.7% పురోగతి చోటుచేసుకుంది.  

వృద్ధి అంచనాలకు ‘మూడవ వేవ్‌’ కోత!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 9.2 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని జనవరిలో వేసిన తొలి అంచనాలను ఎన్‌ఎస్‌ఓ తాజాగా (సెకండ్‌ అడ్వాన్స్‌ ఎస్టిమేట్స్‌లో) 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. 2021–22 ఎకానమీ వృద్ధి అంచనాలను 8.9 శాతానికి కుదించింది. భారత్‌లో మూడవవేవ్‌ సవాళ్లు దీనికి ప్రధాన కారణం.  తాజా అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్ల నుంచి రూ.147.72 లక్షల కోట్లకు పెరుగుతుంది.

2020–21లో క్షీణత 6.6 శాతమే!
ఇక కరోనా సవాళ్లతో 2020–21 ఆర్థిక సంవత్సరం ఎకానమీ 7.3 శాతం క్షీణించిందని తొలి అంచనా గణాంకాలు పేర్కొనగా, ఈ క్షీణ రేటను 6.6 శాతానికి తగ్గిస్తూ తాజా లెక్కలను ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసింది.  అయితే 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ ‘6.6 శాతం క్షీణ బాట’ నుంచి ‘8.9 శాతం వృద్ధి’ బాటకు మారుతుందన్నమాట.  

5.4 శాతం వృద్ధి ఎలా?
2011–12 ధరలను బేస్‌గా తీసుకుంటూ, ద్రవ్యోల్బణం ప్రాతిపదికన పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఎకానమీ విలువ రూ.36,22,220 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) ఈ విలువ రూ. 38,22,159 కోట్లకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మూడవ క్వార్టర్‌లో 5.4 శాతమన్నమాట.  

వివిధ రంగాల తీరిది..
► తయారీ: గణాంకాల ప్రకారం, ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ) విలువల వృద్ధి రేటు తయారీ రంగానికి సంబంధించి మూడవ త్రైమాసికంలో కేవలం 0.2 శాతంగా ఉంది.
2020–21 ఇదే కాలంలో ఈ వృద్ధి 8.4 శాతం.  
► వ్యవసాయం: వ్యవసాయ రంగం వృద్ధి రేటు కూడా 4.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది.  
► నిర్మాణం: ఈ రంగంలో 6.6 శాతం వృద్ధి బాట నుంచి 2.8 శాతం క్షీణతకు మారింది.  
► మైనింగ్‌: ఈ రంగం చక్కటి పురోగతి సాధించింది. 5.3 శాతం క్షీణ రేటు 8.8 శాతం వృద్ధికి మారింది.  
► ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: 1.5 శాతం క్షీణత 3.7 శాతం వృద్ధి బాటకు మారింది.  
► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధిత సేవలు: 10.1 శాతం క్షీణ రేటు 6.1 శాతం వృద్ధికి మెరుగుపడింది.  
► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్‌ సేవలు: 10.3 శాతం వృద్ధి రేటు 4.6 శాతానికి తగ్గింది.  
► పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: 2.9 శాతం క్షీణ రేటు భారీగా మెరుగుపడి 16.8 శాతం వృద్ధి బాటకు పురోగమించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement