రెరాతో ఇన్వెంటరీ తగ్గింది  | Inventory sales are focusing more on | Sakshi
Sakshi News home page

రెరాతో ఇన్వెంటరీ తగ్గింది 

Published Sat, May 4 2019 12:31 AM | Last Updated on Sat, May 4 2019 12:31 AM

Inventory sales are focusing more on - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ)లకు రెక్కలొస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాచింగ్స్‌ కంటే ఇన్వెంటరీ అమ్మకాల మీదే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. ఎందుకంటే? ప్రాజెక్ట్‌ ప్రారంభిస్తే చాలు రెరాలో నమోదు, నాణ్యత, నిర్మాణ గడువు, నిర్వహణ ప్రతి అంశంలోనూ కఠినమైన నిబంధనలుండటంతో డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 2017–18 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో 8,90,719 గృహాల ఇన్వెంటరీ ఉంటే 2018–19 క్యూ4 నాటికి 8,00,438 గృహాలకు చేరాయి. అంటే ఏడాదిలో 10 శాతం తగ్గాయని ప్రాప్‌టైగర్‌.కామ్‌ ‘‘రియల్‌ ఎస్టేట్‌: 2018–19 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (క్యూ4)’’ నివేదిక తెలిపింది. 

అహ్మదాబాద్, చెన్నై మినహా.. 
అహ్మదాబాద్, చెన్నై మినహా అన్ని నగరాల్లో ఇన్వెంటరీ తగ్గింది. అహ్మదాబాద్‌లో 2018 క్యూ4లో 61,683 గృహాలుండగా.. 2019 క్యూ4 నాటికి 63,114 యూనిట్లకు, చెన్నైలో 37,728 నుంచి 38,226 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో 87,110 నుంచి 77,835 యూనిట్లకు, గుర్గావ్‌లో 47,793 నుంచి 44,046 గృహాలకు, కోల్‌కతాలో 48,629 నుంచి 44,689లకు, ముంబైలో 3,32,719 నుంచి 2,88,679లకు, నోయిడాలో 79,605 నుంచి 65,006లకు, పుణేలో 1,53,182 నుంచి 1,41,695లకు తగ్గాయి.

హైదరాబాద్‌ రియల్టీ టాప్‌గేర్‌ 
హైదరాబాద్‌ రియల్టీ రంగం టాప్‌గేర్‌లో పడింది. బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి ఇతర మెట్రో నగరాల్లోని గృహాల అమ్మకాల్లో కనిపించని వృద్ధి భాగ్యనగరంలోనే జరిగింది. 2018–19 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో నగరంలో 7,059 గృహాలు అమ్ముడయ్యాయి. 2017–18 క్యూ4తో పోలిస్తే 26 శాతం వృద్ధి. 2018 క్యూ4లో 5,618 గృహాలు విక్రయమయ్యాయి. ఇక, కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 6,285 యూనిట్లు ప్రారంభం కాగా.. 2019 క్యూ4లో 3 శాతం క్షీణించి 6,066లకు తగ్గాయి. ఇన్వెంటరీలను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 42,270 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. 2019 క్యూ4 నాటికి 35,148 యూనిట్లకు తగ్గాయి. అంటే ఏడాదిలో 17 శాతం తగ్గిందన్నమాట. అద్దెల విషయంలోనూ అంతే! హైదరాబాద్‌లో మినహా అన్ని నగరాల్లో ఏడాదిలో అద్దెలు 14 శాతం పెరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement