
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగింపు పలికాయి. అంతర్జాతీయ సంకేతాలు కలసి రావడంతో సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 38,673 వద్ద క్లోజయింది. నిప్టీ–50 54 పాయింట్లు పెరిగి 11,630 వద్ద స్థిరపడింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ నికరంగా 5,704 పాయింట్లు (17.30 శాతం) పెరగ్గా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ 1,510 పాయింట్లు (15 శాతం) వరకు లాభపడింది. విదేశీ పెట్టుబడుల రాక బలంగా ఉండడానికి తోడు అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలు ఫలప్రదం అవుతాయన్న అంచనాలు, బలమైన రూపాయి కారణంగా ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ మార్కెట్ లాభాలకు కారణంగా విశ్లేషకుల అభిప్రాయం. సెన్సెక్స్ 38,675 పాయింట్ల వద్ద సానుకూలంగా ఆరంభం కాగా, ఇంట్రాడేలో 38,748 పాయింట్ల వరకు పెరిగింది. చివరికి 127 పాయింట్ల లాభంతో 38,673 వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 508 పాయింట్లు (1.33 శాతం) నికరంగా పెరగ్గా, నిఫ్టీ 167 పాయింట్లు (1.45%) లాభపడింది. కాగాసెన్సెక్స్‌లో వేదాంత అత్యధికంగా 3.20 శాతం ర్యాలీ చేసింది. నష్టాలు
మిగిల్చిన స్మాల్‌క్యాప్
కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను మిగిల్చాయి. ప్రధాన సూచీ బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆర్థిక సంవత్సరం 17 శాతం (5,704 పాయింట్లు) లాభపడగా, స్మాల్‌క్యాప్ సూచీ 11.57 శాతం (1,967 పాయింట్లు), మిడ్‌క్యాప్ సూచీ 3 శాతం మేర (483 పాయింట్లు) నష్టపోయాయి. మరో ప్రధాన సూచీ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వార్షికంగా చూస్తే 2018–19లో 15 శాతం లాభాలను ఇచ్చిందని... బ్యాంకులు, ఎనర్జీ, ఐటీ మంచి లాభాలను ఇవ్వగా, ఆ తర్వాత ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా ఈ వరుసలో ఉన్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం ఆందోళనలు, చమురు ధరల పెరుగుదల, వాణిజ్య యుద్ధం వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు.