
ముగింపులో కొత్త రికార్డు
ఈ రుతుపవనాల సీజన్లో తొలి నెల వర్షపాతం సగటుకంటే ఎక్కువగా నమోదయ్యిందన్న వార్తలు...
♦ సెన్సెక్స్ 124 పాయింట్లు,
♦ నిఫ్టీ 37 పాయింట్లు అప్
♦ కార్పొరేట్ లాభాలపై సానుకూల అంచనాలు
ముంబై: ఈ రుతుపవనాల సీజన్లో తొలి నెల వర్షపాతం సగటుకంటే ఎక్కువగా నమోదయ్యిందన్న వార్తలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్పొరేట్ లాభాలు బావుంటాయన్న అంచనాలతో గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ కొత్త రికార్డుస్థాయిలో ముగిసింది. ట్రేడింగ్ తొలిదశలో 31,460 పాయింట్ల గరిష్ట స్థాయివరకూ పెరిగిన సెన్సెక్స్ చివరకు 124 పాయింట్లు లాభపడి 31,369 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ స్థాయిలో సూచీ ముగియడం ఇదే ప్రథమం. జూన్ 22న 31,523 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి తాకినపుడు కూడా సెన్సెక్స్ ఈ స్థాయిలో ముగియలేదు.
ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలుత 9,700 పాయింట్ల స్థాయిని దాటిన తర్వాత...చివరకు 37 పాయింట్ల పెరుగుదలతో 9,674.55 పాయింట్ల వద్ద ముగిసింది. జూన్ 5న ఈ సూచీ రికార్డు ముగింపు 9,675.10 పాయింట్లు. జూన్ 22న ఆల్‌టైమ్ గరిష్టస్థాయి 9,709 పాయింట్లను తాకింది. రుతుపవనాలు బావుండటం, క్వార్టర్లీ ఫలితాలు ప్రోత్సాహకరంగా వుంటాయన్న అంచనాల ఫలితంగా మార్కెట్ కన్సాలిడేషన్ దశ నుంచి బయటపడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు...: తాజా ర్యాలీకి బ్యాంకింగ్ షేర్లు నేతృత్వం వహించాయి. బ్యాంక్ నిఫ్టీ 0.5 శాతం ర్యాలీ జరిపి 23,466 పాయింట్ల వద్ద ముగిసింది. తాజా కొనుగోలు మద్దతుతో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యస్ బ్యాక్, కొటక్ మహింద్రా బ్యాంక్ షేర్లు 4.5 శాతం వరకూ పెరిగాయి. బ్యాంకింగ్ మినహా ఇతర సెన్సెక్స్–30 షేర్లలో ఐటీసీ, కోల్ ఇండియా, భారతి ఎయిర్‌టెల్, మారుతి సుజుకి, టాటా మోటార్స్ షేర్లు 1–2 శాతం మధ్య ఎగిసాయి.