
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్‌లో రూ.1,170 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.1,141 కోట్లు) తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దీంట్లో ట్యాక్స్ రిఫండ్ ప్రయోజనాల కారణంగా రూ.440 కోట్లు, అనుబంధ కంపెనీల లాభం రూ.489 కోట్ల మేర ఉండటం విశేషం. అయితే స్టాండ్‌అలోన్ పరంగా చూస్తే, నికర లాభం తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను కంపెనీ ఇవ్వనున్నది.
తగ్గిన స్టాండ్‌అలోన్ లాభం...
అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,020 కోట్లుగా ఉన్న నికర లాభం(స్టాండ్‌అలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 5 శాతం తగ్గి రూ.969 కోట్లకు చేరిందని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. స్టాండ్‌అలోన్ పరంగా నికర లాభం తగ్గినా, అనుబంధ కంపెనీల తోడ్పాటుతో ఈ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా పెరిగిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.33,760 కోట్ల నుంచి రూ.36,784 కోట్లకు పెరిగిందని వివరించారు. నికర వడ్డీ ఆదాయం రూ.6,022 కోట్ల నుంచి 27 శాతం ఎగసి రూ.7,620 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతం నుంచి 3.72 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఫీజు ఆదాయం 15 శాతం పెరగ్గా, రుణాలు 17 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. గత క్యూ4లో రూ.7,300 కోట్ల బకాయిలను రద్దు చేశామని, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 60 శాతం నుంచి 80 శాతానికి ఎగసిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 7.75 శాతం నుంచి 7.38 శాతానికి తగ్గాయి. ఇతర ఆదాయం రూ.5,679 కోట్ల నుంచి 36 శాతం క్షీణించి రూ.3,621 కోట్లకు చేరింది.
సగం తగ్గిన తాజా మొండి బకాయిలు..
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం భారీగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 40 శాతం తగ్గి రూ.3,363 కోట్లకు చేరింది. తాజా మొండి బకాయిలు దాదాపు సగం తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.28,730 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు గత ఆర్థి క సంవత్సరంలో రూ.11,039 కోట్లకు తగ్గాయి.
మెరుగుపడిన రుణ నాణ్యత...
బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి 31 నాటికి 8.84 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి 31 నాటికి 6.70 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 4.77 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయని వివరించింది. ఇది 13 క్వార్టర్ల కనిష్ట స్థాయి అని పేర్కొంది. గత క్యూ4లో తాజా మొండి బకాయిలు రూ.3,547 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు వార్షికంగా తగ్గగా, సీక్వెన్షియల్‌గా మాత్రం పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,626 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత క్యూ4లో రూ.5,451 కోట్లకు తగ్గాయి. గత క్యూ3లో కేటాయింపులు రూ.4,244 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్ ముగిసిన తర్వా:త ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్0.11 శాతం నష్టంతో రూ.401 వద్ద ముగిసింది.
అధ్వాన కాలం ముగిసింది
మొండి బకాయిలు భారీగా పెరగడం, అవినీతి ఆరోపణలపై సీఈఓ చందా కొచర్ వైదొలగడం వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న ఈ బ్యాంక్.... అధ్వాన కాలం ముగిసినట్లేనని పేర్కొంది. రుణ నాణ్యతకు సంబంధించిన సైకిల్‌లో చివరి దశలో ఉన్నామని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. రానున్న కాలంలో మొండి బకాయిలు పేరుకుపోవడం తగ్గగలదన్న అంచనాలున్నాయన్నారు. వడ్డీ వ్యయాలు 1–1.2 శాతం రేంజ్‌లో ఉండేవని, కానీ మొండి బకాయిలకు కేటాయింపుల కారణంగా ఈ వ్యయాలు 3.5 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడి సాధారణ స్థాయికి వస్తాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment