న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్‌లో 29 శాతం ఎగసి రూ.107 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో ఈ కంపెనీకి రూ.83 కోట్ల నికర లాభం వచ్చింది. నష్టాలను ప్రకటించగలదన్న విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ కంపెనీ లాభాన్ని ప్రకటించడం విశేషం. భారత మొబైల్ సర్వీసుల వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఆఫ్రికా వ్యాపారం పుంజుకోవడం, అసాధారణ ఆదాయ లాభాల కారణంగా ఈ స్థాయి నికర లాభాన్ని ఈ కంపెనీ సాధించింది. చాలా క్వార్టర్ల తర్వాత నికర లాభంలో పెరుగుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 24 శాతం ఎగసింది. ఇక ఆదాయం 6 శాతం ఎగసి రూ.20,602 కోట్లకు పెరిగింది. గత క్యూ4లో రూ.2,022 కోట్ల మేర అసాధారణ ఆదాయ లాభాలు (నెట్‌వర్క్ రీ–ఫార్మింగ్, అప్‌గ్రెడేషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన చార్జీలు, లెవీల పున:మదింపుకు సంబంధించిన మొత్తం) వచ్చాయని కంపెనీ పేర్కొంది. రూ.25,000 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రస్తుతం నడుస్తోంది. ఈ నెల 17న ఈ రైట్స్ ఇష్యూ ముగియనున్నది.
రెట్టింపైన ‘భారత’ నష్టాలు...
ఈ కంపెనీ భారత వ్యాపారంలో అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో రూ.482 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఈ నష్టాలు దాదాపు రెట్టింపై రూ.1,378 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో ఆఫ్రికా మొబైల్ సర్వీసుల్లో లాభం రూ.1,129 కోట్ల నుంచి 1,317 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,099 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు సగం తగ్గి రూ.410 కోట్లకు పడిపోయింది. ఆదాయం కూడా రూ.82,639 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.80,780 కోట్లకు తగ్గింది.
ముకేష్ అంబానీ రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకోవడానికి టెలికం కంపెనీలు టారిఫ్‌లను భారీగా తగ్గించాయి. ఫలితంగా ఆ కంపెనీల లాభదాయకతపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. వాయిస్, డేటా వినియోగం రికార్డ్ స్థాయిల్లో ఉన్నా, టెలికం కంపెనీలకు పెద్దగా లాభాలు రావడం లేదని మరోసారి ఎయిర్‌టెల్ ఫలితాలు రుజువు చేశాయని నిపుణులంటున్నారు.
మార్కెట్ ముగిసిన తర్వాత ఎయిర్‌టెల్
ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల
నేపథ్యంలో బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ షేర్
0.6 శాతం లాభంతో రూ.333 వద్ద ముగిసింది.
ఎయిర్‌టెల్ లాభం 29 శాతం అప్
Published Tue, May 7 2019 12:27 AM | Last Updated on Tue, May 7 2019 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment