62 శాతం తగ్గిన ఇండస్‌ఇండ్‌ లాభం | IndusInd's Q4 profit falls on higher provisions | Sakshi
Sakshi News home page

62 శాతం తగ్గిన ఇండస్‌ఇండ్‌ లాభం

Published Thu, May 23 2019 12:11 AM | Last Updated on Thu, May 23 2019 12:11 AM

IndusInd's Q4 profit falls on higher provisions - Sakshi

న్యూఢిల్లీ: ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 62 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.953 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.360 కోట్లకు తగ్గిందని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు కేటాయింపులు పెంచడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి చెప్పారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు రూ.3,004 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఈ మొత్తం రుణాలను గత క్యూ4లో మొండి బకాయిలుగా గుర్తించామని, వీటికి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,800 కోట్ల మేర కేటాయింపులు జరిపామని తెలియజేశారు. కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటే, నికర లాభం 25 శాతం ఎగసి ఉండేదని అంచనా. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.5,859 కోట్ల నుంచి రూ.7,550 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,008 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.2,232 కోట్లకు, ఫీజు ఆదాయం 27 శాతం పెరుగుదలతో రూ.1,419 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం రూ.1,769 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.2,068 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.97 శాతం నుంచి 3.59 శాతానికి తగ్గిందని తెలిపారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు సోబ్తి తెలిపారు.  

8 శాతం తగ్గిన ఏడాది లాభం... 
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.3,606 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8% తగ్గి రూ.3,301 కోట్లకు పరిమితమయింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.22,031 కోట్ల నుంచి రూ.27,908 కోట్లకు ఎగసింది. గత ఏడాది మార్చి నాటికి 1.17%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 2.10%కి, అలాగే నికర మొండి బకాయిలు 0.51% నుంచి 1.21%కి పెరిగాయి. విలువ పరంగా చూస్తే, గత ఏడాది మార్చి నాటికి రూ.1,705 కోట్లుగా ఉన్న  స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,947 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.746 కోట్ల నుంచి రూ.2,248 కోట్లకు పెరిగాయి.  రుణాలు 29% వృద్ధితో రూ.1,86,394 కోట్లకు, డిపాజిట్లు 29% వృద్ధితో రూ.1,94,868 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 25%గా ఉండొచ్చని సోబ్తి చెప్పారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు మూడో వంతుకుపైగా కేటాయింపులు జరపడం, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు కూడా జత కావడం షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. బీఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 5% లాభంతో రూ.1,517 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement