Net profit Investors
-
ర్యాలీ కొనసాగేనా!
ముంబై: దేశీ కార్పొరేట్ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే స్థాయి నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారాంతాన ప్రకటించిన నేపథ్యంలో సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్లు పెరిగాయి. కార్పొరేట్ రంగాన్ని సంభ్రమాశ్చర్యంలో పడేస్తూ శుక్రవారం ఆర్థిక మంత్రి భారీ పన్ను కోతను ప్రకటించారు. దేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి ఒక్కసారిగా 22 శాతానికి తగ్గించారు. సెస్సులతో కలుపుకుని 35 శాతం వరకు ఉన్న పన్ను రేటు ఏకంగా 25.17 శాతానికి దిగొస్తుందన్న వార్తలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే శుక్రవారం దేశీ ప్రధాన స్టాక్ సూచీలు తారా జువ్వలా దూసుకుపోయాయి. పన్ను భారం తగ్గినందున లాభాలు పెరుగుతాయని భావించిన ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగారు. దీనికి షార్ట్ కవరింగ్ జత అయి లాభాలు మరింత పెరిగిపోయాయి. సూచీలు బలమైన ర్యాలీని నమోదుచేసినందున ఇదే ఉత్సాహం ఈ వారంలో కూడా కొనసాగేందుకు అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్సాహభరిత అంశాలు నెమ్మదించిన దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ భారత్ వైపు చూసే అవకాశం ఉందని విశ్లేషించారు. 11,500 పాయింట్లకు నిఫ్టీ..! ఆటో, రియల్టీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకుని ఈ వారంలో నిఫ్టీ 11,500 పాయింట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కాపిటల్ఎయిమ్ రీసెర్చ్ హెడ్ రోమేష్ తివారీ అంచనావేశారు. సోమవారం నూతన లాంగ్స్ పెరిగి, షార్ట్ కవరింగ్ కొనసాగి నిఫ్టీ ఈ స్థాయికి చేరుకుంటుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. పన్ను రేటు తగ్గినందున కంపెనీల జూన్–సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ విశ్లేషించారు. లాభాల్లో కనీసం 10–15 శాతం పెరుగుదల ఉంటుందన్నారు. శుక్రవారం మార్కెట్ భారీ ర్యాలీని నమోదుచేసినందున ఈ స్థాయిల వద్ద నిలబడుతుందా లేదా అనే అంశానికి ఎఫ్‌పీఐ పెట్టుబడులు కీలకంగా మారాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ విశ్లేషించారు. మరోవైపు శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ హోటల్ ట్యారిఫ్‌లపై పన్ను రేట్లను తగ్గించడంతో ఈ రంగ షేర్లలో కొనుగోలుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ (ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు ఈ వారంలోనే ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు, అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు వెల్లడి మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌లో రూ.4,193 కోట్లు ఉపసంహరణ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సెప్టెంబర్ 3–20 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,578 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్లో వీరు రూ. 1,384 కోట్లను పెట్టుబడి పెట్టారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.4,193 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్ పన్ను రేట్లు భారీగా తగ్గడంతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. తాజా పరిణామాలతో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్ విశ్లేషించారు. -
62 శాతం తగ్గిన ఇండస్ఇండ్ లాభం
న్యూఢిల్లీ: ఇండస్ ఇండ్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 62 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.953 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.360 కోట్లకు తగ్గిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు కేటాయింపులు పెంచడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలకు రూ.3,004 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఈ మొత్తం రుణాలను గత క్యూ4లో మొండి బకాయిలుగా గుర్తించామని, వీటికి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,800 కోట్ల మేర కేటాయింపులు జరిపామని తెలియజేశారు. కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటే, నికర లాభం 25 శాతం ఎగసి ఉండేదని అంచనా. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.5,859 కోట్ల నుంచి రూ.7,550 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,008 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.2,232 కోట్లకు, ఫీజు ఆదాయం 27 శాతం పెరుగుదలతో రూ.1,419 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం రూ.1,769 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.2,068 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3.97 శాతం నుంచి 3.59 శాతానికి తగ్గిందని తెలిపారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు సోబ్తి తెలిపారు. 8 శాతం తగ్గిన ఏడాది లాభం... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.3,606 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8% తగ్గి రూ.3,301 కోట్లకు పరిమితమయింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.22,031 కోట్ల నుంచి రూ.27,908 కోట్లకు ఎగసింది. గత ఏడాది మార్చి నాటికి 1.17%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 2.10%కి, అలాగే నికర మొండి బకాయిలు 0.51% నుంచి 1.21%కి పెరిగాయి. విలువ పరంగా చూస్తే, గత ఏడాది మార్చి నాటికి రూ.1,705 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,947 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.746 కోట్ల నుంచి రూ.2,248 కోట్లకు పెరిగాయి. రుణాలు 29% వృద్ధితో రూ.1,86,394 కోట్లకు, డిపాజిట్లు 29% వృద్ధితో రూ.1,94,868 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 25%గా ఉండొచ్చని సోబ్తి చెప్పారు. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు మూడో వంతుకుపైగా కేటాయింపులు జరపడం, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు కూడా జత కావడం షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. బీఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 5% లాభంతో రూ.1,517 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే కావడం గమనార్హం. -
ఇన్ఫోసిస్ బంపర్ బోణీ..!
అంచనాలు మించిన క్యూ3 ఫలితాలు కన్సాలిడేటెడ్ నికర లాభం 3,250 కోట్లు ⇒ త్రైమాసిక ప్రాతిపదికన 5% వృద్ధి; వార్షికంగా 13 శాతం పెరుగుదల ⇒ మొత్తం ఆదాయం 13,796 కోట్లు ⇒ ఆదాయ గెడైన్స్ యథాతథంగానే ⇒ ఉద్యోగులకు 100 శాతం బోనస్ ⇒ 5 శాతం పైగా దూసుకెళ్లిన షేరు ధర దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలను మించిన పనితీరుతో అదరగొట్టింది. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అటు ఇన్వెస్టర్లు ఇటు కంపెనీ ఉద్యోగుల్లోనూ కొత్త ఉత్తేజం నింపింది. కంపెనీ నికర లాభం, ఆదాయాలు ఆకర్షణీయంగా వృద్ధి చెందడమే కాకుండా... పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి అంచనాలను(గెడైన్స్) కూడా మార్చలేదు. దీంతో కంపెనీ షేరు ధర 5% పైగా రివ్వున ఎగసింది. బెంగళూరు: సాఫ్ట్వేర్ అగ్రగామి ఇన్ఫోసిస్.. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్లో(2014-15, క్యూ3) రూ.3,250 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,875 కోట్లతో పోలిస్తే.. లాభం వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా రూ.13,026 కోట్ల నుంచి రూ.13,796 కోట్లకు ఎగబాకింది. 5.9 శాతం పెరుగుదల నమోదైంది. వాస్తవానికి బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు సగటున రూ.3,157 కోట్ల లాభం, రూ.13,783 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. ఇన్ఫీ దీనికంటే మెరుగ్గానే ఫలితాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. క్యూ3లో రూపాయి మారకం విలువ 2.5 శాతం మేర క్షీణించడం కూడా కంపెనీ మెరుగైన రాబడులకు ఒక కారణమని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఇన్ఫోసిస్‌కు తొలి ప్రమోటరేతర సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టడం(ఆగస్టు1న) ఒకెత్తయితే.. ఆయన హయాంలో తొలి పూర్తిస్థాయి త్రైమాసిక ఫలితాలు ఇవే. సీక్వెన్షియల్‌గానూ జోష్.. ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదు చేసిన రూ.3,096 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా)... క్యూ3లో లాభం దాదాపు 5 శాతం ఎగబాకడం విశేషం. మొత్తం ఆదాయం క్యూ2లో రూ.13,342 కోట్ల నుంచి 3.4 శాతం వృద్ధి చెందింది. ఇక డాలర్లలో చూస్తే... కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన(స్థిర కరెన్సీ విలువ ప్రకారం) 2.6 శాతం వృద్ధితో 2.218 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నికర లాభం 2.15 శాతం వృద్ధి చెంది 522 మిలియన్ డాలర్లకు చేరింది. కాగా, డాలరుతో యూరో, పౌండ్ ఇతరత్రా ప్రధాన కరెన్సీల విలువలు భారీగా క్షీణించడంతో క్యూ3లో డాలరు ఆదాయాల వృద్ధిలో 1.8 శాతం మేర ప్రతికూల ప్రభావం పడిందని ఇన్ఫీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) రాజీవ్ బన్సల్ పేర్కొన్నారు. గెడైన్స్ యథాతథం...: ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలరు ఆదాయాల్లో వృద్ధి అంచనా(గెడైన్స్)ను ఇన్ఫోసిస్ యథాతథంగా కొనసాగించింది. గతంలో ప్రకటించిన 7-9 శాతం గెడైన్స్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. కరెన్సీ హెచ్చుతగ్గులు ఇతరత్రా అంశాల నేపథ్యంలో గెడైన్స్‌ను తగ్గించే అవకాశం ఉందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ.. ఇన్ఫోసిస్ వారి అంచనాలను తలదన్నడం గమనార్హం. మూడో త్రైమాసికం ఫలితాల్లో అనేక అంశాల్లో మంచి పురోగతిని సాధించాం. ప్రధానంగా మేం అనుసరిస్తున్న ‘రెన్యూ అండ్ న్యూ(పాత ప్రణాళికల పునరుద్ధరణ, కొత్త విభాగాలపై దృష్టి సారించడం)’ వ్యూహాన్ని క్లయింట్లు స్వాగతిస్తున్నారు. కొత్త ఆవిష్కరణల కోసం ఉద్దేశించిన ఇన్నోవేషన్ ఫండ్‌ను ఇప్పుడున్న 100 మిలియన్ డాలర్ల నుంచి 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నాం. ప్రధానంగా అంతర్జాతీయంగా మా వ్యూహాత్మక భాగస్వాములకు మరింత మెరుగైన సేవల కల్పనే దీని లక్ష్యం. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ షేరు రయ్ రయ్... ఆకర్షణీయమైన ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ధర శుక్రవారం దూసుకుపోయింది. ఒకానొక దశలో బీఎస్ఈలో 7 శాతం మేర ఎగబాకి రూ.2,108 గరిష్టాన్ని తాకింది. చివరకు 5.1% పెరిగి రూ.2,074 వద్ద ముగిసింది. ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్న ఇన్ఫీ తొలిసారి మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించడం విశేషం. ఉద్యోగులకు బోనస్ బొనాంజా.. ఉద్యోగుల వలసల(అట్రిషన్) జోరు నేపథ్యంలో దీనికి అడ్డుకట్టవేయడంపై ఇన్ఫీ దృష్టిపెట్టింది. డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ సిబ్బందికి 100 శాతం బోనస్(వేరియబుల్... పనితీరు ఆధారంగా) చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల వలసల రేటు డిసెంబర్ క్వార్టర్లో 20.4 శాతానికి ఎగబాకింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఈ రేటు 20.1 శాతంగా ఉంది. క్యూ3లో స్థూలంగా కంపెనీ 13,154 మందిని.. నికరంగా 4,227 మంది సిబ్బందిని జతచేసుకుంది. డిసెంబర్ చివరికి కంపెనీ(అనుబంధ సంస్థలతో కలిపి) మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,69,638కి చేరింది. కాగా, సిక్కా బాధ్యతలు స్వీకరించాక క్యూ2 ఫలితాల సందర్భంగా ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకి మరో షేరు బోనస్(1:1)గా ప్రకటించగా.. క్యూ3 ఫలితాల్లో ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం గమనార్హం.