ఇన్ఫోసిస్ బంపర్ బోణీ..! | India lives in my heart, says Infosys CEO Vishal Sikka | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ బంపర్ బోణీ..!

Published Sat, Jan 10 2015 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

ఇన్ఫోసిస్ బంపర్ బోణీ..!

ఇన్ఫోసిస్ బంపర్ బోణీ..!

అంచనాలు మించిన క్యూ3 ఫలితాలు
కన్సాలిడేటెడ్ నికర లాభం 3,250 కోట్లు
త్రైమాసిక ప్రాతిపదికన 5% వృద్ధి; వార్షికంగా 13 శాతం పెరుగుదల
మొత్తం ఆదాయం 13,796 కోట్లు
ఆదాయ గెడైన్స్ యథాతథంగానే
ఉద్యోగులకు 100 శాతం బోనస్
5 శాతం పైగా దూసుకెళ్లిన షేరు ధర


దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలను మించిన పనితీరుతో అదరగొట్టింది. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అటు ఇన్వెస్టర్లు ఇటు కంపెనీ ఉద్యోగుల్లోనూ కొత్త ఉత్తేజం నింపింది. కంపెనీ నికర లాభం, ఆదాయాలు ఆకర్షణీయంగా వృద్ధి చెందడమే కాకుండా... పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి అంచనాలను(గెడైన్స్) కూడా మార్చలేదు. దీంతో కంపెనీ షేరు ధర 5%  పైగా రివ్వున ఎగసింది.
 
బెంగళూరు: సాఫ్ట్‌వేర్ అగ్రగామి ఇన్ఫోసిస్.. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్‌లో(2014-15, క్యూ3) రూ.3,250 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,875 కోట్లతో పోలిస్తే.. లాభం వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా రూ.13,026 కోట్ల నుంచి రూ.13,796 కోట్లకు ఎగబాకింది. 5.9 శాతం పెరుగుదల నమోదైంది.

వాస్తవానికి బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు సగటున రూ.3,157 కోట్ల లాభం, రూ.13,783 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. ఇన్ఫీ దీనికంటే మెరుగ్గానే ఫలితాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. క్యూ3లో రూపాయి మారకం విలువ 2.5 శాతం మేర క్షీణించడం కూడా కంపెనీ మెరుగైన రాబడులకు ఒక కారణమని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, ఇన్ఫోసిస్‌కు తొలి ప్రమోటరేతర సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టడం(ఆగస్టు1న) ఒకెత్తయితే.. ఆయన హయాంలో తొలి పూర్తిస్థాయి త్రైమాసిక ఫలితాలు ఇవే.
 
సీక్వెన్షియల్‌గానూ జోష్..
ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదు చేసిన రూ.3,096 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా)... క్యూ3లో లాభం దాదాపు 5 శాతం ఎగబాకడం విశేషం. మొత్తం ఆదాయం క్యూ2లో రూ.13,342 కోట్ల నుంచి 3.4 శాతం వృద్ధి చెందింది. ఇక డాలర్లలో చూస్తే... కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన(స్థిర కరెన్సీ విలువ ప్రకారం) 2.6 శాతం వృద్ధితో 2.218 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

నికర లాభం 2.15 శాతం వృద్ధి చెంది 522 మిలియన్ డాలర్లకు చేరింది. కాగా, డాలరుతో యూరో, పౌండ్ ఇతరత్రా ప్రధాన కరెన్సీల విలువలు భారీగా క్షీణించడంతో క్యూ3లో డాలరు ఆదాయాల వృద్ధిలో 1.8 శాతం మేర ప్రతికూల ప్రభావం పడిందని ఇన్ఫీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) రాజీవ్ బన్సల్ పేర్కొన్నారు.
 
గెడైన్స్ యథాతథం...: ప్రస్తుత 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరానికి డాలరు ఆదాయాల్లో వృద్ధి అంచనా(గెడైన్స్)ను ఇన్ఫోసిస్ యథాతథంగా కొనసాగించింది. గతంలో ప్రకటించిన 7-9 శాతం గెడైన్స్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. కరెన్సీ హెచ్చుతగ్గులు ఇతరత్రా అంశాల నేపథ్యంలో గెడైన్స్‌ను తగ్గించే అవకాశం ఉందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ.. ఇన్ఫోసిస్ వారి అంచనాలను తలదన్నడం గమనార్హం.
 
మూడో త్రైమాసికం ఫలితాల్లో అనేక అంశాల్లో మంచి పురోగతిని సాధించాం. ప్రధానంగా మేం అనుసరిస్తున్న ‘రెన్యూ అండ్ న్యూ(పాత ప్రణాళికల పునరుద్ధరణ, కొత్త విభాగాలపై దృష్టి సారించడం)’ వ్యూహాన్ని క్లయింట్లు స్వాగతిస్తున్నారు. కొత్త ఆవిష్కరణల కోసం ఉద్దేశించిన ఇన్నోవేషన్ ఫండ్‌ను ఇప్పుడున్న 100 మిలియన్ డాలర్ల నుంచి 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నాం. ప్రధానంగా అంతర్జాతీయంగా మా వ్యూహాత్మక భాగస్వాములకు మరింత మెరుగైన సేవల కల్పనే దీని లక్ష్యం.
 - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ
 
షేరు రయ్ రయ్...
ఆకర్షణీయమైన ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ధర శుక్రవారం దూసుకుపోయింది. ఒకానొక దశలో బీఎస్‌ఈలో 7 శాతం మేర ఎగబాకి రూ.2,108 గరిష్టాన్ని తాకింది. చివరకు 5.1%  పెరిగి రూ.2,074 వద్ద ముగిసింది. ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభానికి ముందే ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్న ఇన్ఫీ తొలిసారి మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించడం విశేషం.
 
ఉద్యోగులకు బోనస్ బొనాంజా..
ఉద్యోగుల వలసల(అట్రిషన్) జోరు నేపథ్యంలో దీనికి అడ్డుకట్టవేయడంపై ఇన్ఫీ దృష్టిపెట్టింది. డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ సిబ్బందికి 100 శాతం బోనస్(వేరియబుల్... పనితీరు ఆధారంగా) చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల వలసల రేటు డిసెంబర్ క్వార్టర్‌లో 20.4 శాతానికి ఎగబాకింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో ఈ రేటు 20.1 శాతంగా ఉంది.

క్యూ3లో స్థూలంగా కంపెనీ 13,154 మందిని.. నికరంగా 4,227 మంది సిబ్బందిని జతచేసుకుంది. డిసెంబర్ చివరికి కంపెనీ(అనుబంధ సంస్థలతో కలిపి) మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,69,638కి చేరింది. కాగా, సిక్కా బాధ్యతలు స్వీకరించాక క్యూ2 ఫలితాల సందర్భంగా ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకి మరో షేరు బోనస్(1:1)గా ప్రకటించగా.. క్యూ3 ఫలితాల్లో ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement