ఆర్థిక మానవతావాది!
నవంబర్ 3న ఆమర్త్య సేన్ జన్మదినం
సత్వం: ఆర్థికశాస్త్రవేత్త పేదరికం గురించి మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు... అయితే పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా అని ఆయన అంటారు.
సాధారణంగా అంకెలు అంకెల్లానే వ్యవహరిస్తాయి. వాటికి ఆత్మాభిమానం, అణచివేత, క్షోభ, సామాజిక వ్యత్యాసం లాంటివేమీ తెలియదు. వృద్ధిరేటు ఎంత శాతం ఉంది? స్థూల జాతీయోత్పత్తి ఏ మేరకు పెరిగింది? ఇవి అవసరమే. కానీ వీటిని మాత్రమే ఆమర్త్య సేన్ లెక్కలోకి తీసుకోరు. ఆ అంకెలు ఉపరితలం నుంచి వచ్చినవా? అట్టడుగు వర్గాలను కూడా కలుపుకొన్నవా? అందుకే ఆయన మాటతీరు ఆర్థిక శాస్త్రవేత్తకన్నా మానవ హక్కుల న్యాయవాదిని తలపిస్తుంది. ‘ఆర్థికశాస్త్రానికి నైతిక కొలతను పునఃస్థాపించినవాడిగా’ ఆయనకు 1998లో నోబెల్ పురస్కారం దక్కింది ఈ కారణంగానే!
1933లో శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ టాగూర్ చేత నామకరణం చేయించుకున్న ఆమర్త్య కుమార్ సేన్... గాంధీజీ ‘విశ్వాసపు బాట’కన్నా, రవీంద్రుడి ‘హేతువు తోవ’కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చరఖా కన్నా పలక మిన్న అన్న గురుదేవుడి స్ఫూర్తిని జీర్ణించుకున్న ఆయన... పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్‌తో కలిసి ‘మానవాభివృద్ధి సూచిక’ను రూపొందించారు. ఆయా దేశాల్లోని జీవన ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ఈ సూచిక ఆధారంగానే లెక్కిస్తోంది. దీనిప్రకారం భారత్‌ది 135వ స్థానం.
ప్రస్తుతం బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గానూ, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక, తత్వశాస్త్రాల బోధకుడిగానూ పనిచేస్తున్న ఆమర్త్య సేన్... తలసరి ఆదాయం మాత్రమే దేశాభివృద్ధికి సూచిక కాదంటారు. ‘మానవ సామర్థ్య’ పెరుగుదల మరింత ప్రాధాన్యమైన అంశం అంటారు. నిరక్షరాస్యత, కనీస ఆరోగ్య సౌకర్యాల లేమి, లైంగిక అసమానత్వం గురించి నొక్కి చెబుతారు. భిన్నవర్గాలకు గొంతుక ఇవ్వడంలో ఏ మేరకు సఫలీకృతమైందన్న దాన్ని బట్టే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటారు. అయితే, ప్రజాస్వామ్యం దేనికీ గ్యారంటీ ఇవ్వదు. హక్కుల కోసం పోరాడాల్సివుంటుంది. కానీ ప్రాథమిక విద్యలాంటిదాన్ని ఉద్యమరూపంలోకి మలచడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. నిరంతర సంవాదం ద్వారా మౌలికావసరాల్ని సామూహిక స్పృహలోకి తేవాల్సి ఉందంటారు.
రెండు రకాల ఆర్థిక విధానాల గురించిన చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్లే స్థూలజాతీయోత్పత్తిని పెంచుతారు, దానిలో భాగంగా పేదవాళ్లు కూడా దాని ఫలాలు అందుకుని పైకి ఎగబాకుతారనే ‘జీడీపీ వృద్ధి’ విధానం ఒకటీ; విద్య, ఆరోగ్యం లాంటివాటికి తొలి ప్రాధాన్యమిచ్చే ‘మానవ సామర్థ్య వృద్ధి’ విధానం మరొకటీ. చిత్రంగా మొదటిదానికే మన ప్రభుత్వాలు మరింత ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. దీన్ని ఆమర్త్యసేన్ వ్యతిరేకిస్తారు. ఏ దేశమూ కూడా మానవ సామర్థ్యాన్ని పెంపొందించకుండా అద్భుతమైన పెరుగుదలను సాధించలేదంటారు. జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, థాయ్‌లాండ్, యూరప్, అమెరికా, బ్రెజిల్... ఇవేవీ ట్రాక్ 1లో అభివృద్ధి చెందలేదంటారు.
‘సామ్యవాద ఆర్థికవ్యవస్థల్ని అణచివేత సహా ఎన్నో రాజకీయ, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టివున్నాయి. యాభై ఏళ్లక్రితం ఏ లక్ష్యాలైతే జనాన్ని సామ్యవాదంవైపు ఆకర్షించాయో, ఆ లక్ష్యాలు ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినవే!’ మహిళలు ఎదుర్కొనే అణచివేత గురించి ఆయన 1960ల్లోనే రాశారు. విద్య, పోషణ విషయంలో ఒక కుటుంబంలో ఉండే పంపకాల్లోని అసమానతల గురించి చర్చించారు. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఇవన్నీ మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు. ‘పేదరికం నాకు ఆసక్తి. బాలికల నిష్పత్తి నాకు ఆసక్తి. బాలల సంక్షేమం నాకు ఆసక్తి. శిశు మరణాలు నాకు ఆసక్తి’... ‘పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా!’ అంటారు.
భిన్న సంస్కృతులు స్నేహపూర్వకంగా మనగలిగే సమాజాన్ని ఆయన కాంక్షిస్తారు. ప్రజాస్వామ్యం కేవలం అత్యధికుల పాలనావిధానం కాదనీ, అది సహనానికి సంబంధించినదనీ, అల్పసంఖ్యాకుల అభిప్రాయాల్నీ, విమర్శలనీ సహించడంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగుందనీ చెబుతారు. కొందరి ప్రయోజనాలకు భంగం కలిగినా, కొందరు మార్కెట్ వెలుపలే ఉండిపోయినా కూడా కొందరైనా వ్యక్తిగతంగా లాభపడేలా చేస్తుంది కాబట్టి, మార్కెట్ ఎకానమీయే విజయం సాధిస్తుందంటారు. అయితే, నీకు చదువు లేకుండా, వ్యక్తిగత రుణం పొందే అవకాశం లేకుండా అందులో ఎప్పటికి పాల్గొనాలి?
పెట్టుబడీదారి విధానం సూత్రప్రాయంగా బలమైన వ్యక్తివాదాన్ని ప్రోత్సహించేదే అయినప్పటికీ, ఆచరణలో సమైక్యతకే దారితీసిందనీ, మన జీవితాల్ని మరింత పరస్పరాధారితంగా మార్చిందనీ చెబుతారు. ప్రపంచీకరణను ప్రతికూల దృష్టితో చూడనవసరం లేదంటారు. ‘అది ప్రపంచాన్ని సాంస్కృతికంగా, శాస్త్రీయంగా బలోపేతం చేసింది. ఎంతోమంది ఆర్థికంగా కూడా బలపడ్డారు’. ప్రతిదీ అందరికీ అందే దృష్టిలో దాన్ని స్వాగతిస్తారు. అలాగే దాన్ని మరింత మానవీయమైనదిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ, అలా చేయడం కోసం జరిగే పోరాటాల్నీ సమర్థిస్తారు.