అర్హులకే సబ్సిడీ ప్రయోజనం: జైట్లీ
సబ్సిడీలను హేతుబద్ధం చేసేందుకు త్వరలో కమిషన్ ఏర్పాటు
న్యూఢిల్లీ: సబ్సిడీలను హేతుబద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులకే సబ్సిడీ ప్రయోజనాలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకొనబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రైతులకు సబ్సిడీ అంశంపై శుక్రవారం లోక్‌సభలో ఒక అనుబంధ ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.1 శాతానికి ద్రవ్యలోటును నియత్రించడం చాలా కష్టసాధ్యమని, అందుకోసం సబ్సిడీల ఖర్చను తగ్గించుకోవాలన్నారు. సబ్సిడీలను హేతుబద్ధం చేసేందు కు మరికొన్ని రోజుల్లో వ్యయ నిర్వహణా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, సబ్సిడీల భారం పెరగకుండా చూడడమే వ్యయ నిర్వహణా కమిషన్ ప్రధాన బాధ్యతల్లో ఒకటని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి కమిషన్ తన నివేదిక సమర్పించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. భారతీయ ఉత్పత్తులు మార్కెట్‌లో పోటీ పడాలంటే పన్నుల విధానాన్ని హేతుబద్ధం చేయాలన్నారు.
ఖనిజవాయువు ధర పెరిగిన తర్వాత పెరగబోయే యూరియా ధర భారా న్ని వినియోగదారులకు బదిలీ చేయబోతున్నారా? అన్న ప్రశ్న ఊహాజనితమని అన్నా రు. విద్యుత్ రాష్ట్రాలకు సంబంధించిన అంశంకాబట్టి, తగిన స్థోమత ఉన్న రాష్ట్రాలు వ్యవసా యానికి సబ్సిడీ ఇవ్వవచ్చన్నారు. మరోవైపు ఆహార భద్రత కోసం సంవత్సరానికి రూ.1,31,086కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. మరోపక్క వ్యవసాయ రంగానికి సంబంధించి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని లోక్‌సభలో ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పంటలకు కనీస మద్దతుధర నిర్ధారణ ప్రక్రియను సమీక్షించి, మార్పులు చేయాలని ఎంపీలు కోరారు.