central Finance Minister Arun Jaitley
-
వహ్వా జైట్లీ!
న్యూఢిల్లీ: ఉర్దూ కవిత్వంలోని కమ్మని వాక్యాలు, మత గ్రంథాల్లోని సందర్భోచిత శ్లోకాలు, గత యూపీఏ సర్కారుపై పదునైన విమర్శలతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. లేత నీలి రంగు చొక్కా, ముదురు నీలం రంగు నెహ్రూ జాకెట్, నల్ల రంగు ప్యాంటు ధరించిన 62 ఏళ్ల జైట్లీ శనివారం లోక్సభలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఆయన సోదరి మధు భార్గవ, కోడలు పునీత వీక్షింస్తుండగా వంద నిమిషాల పాటు బడ్జెట్ ప్రసం గం చేశారు. మొదట నుంచుని ప్రసంగించిన జైట్లీ, కొద్ది నెలలుగా ఆరోగ్యం బాలేని కారణంగా 22 నిమిషాల తర్వాత స్పీకర్ అనుమతితో కూర్చుని మిగతా ప్రసంగాన్ని పూర్తి చేశారు. మంత్రి నితిన్ గడ్కారీ తన స్థానాన్ని ఖాళీ చేసి జైట్లీ కిచ్చారు. ప్రధాని మోదీ తన వద్దనున్న నీళ్ల గ్లాసును జైట్లీ వద్ద పెట్టాల్సిందిగా లోక్సభ సిబ్బందికి సూచించారు. పార్లమెంట్ సిబ్బంది జ్యూస్ కూడా అందించారు. యూపీఏపై విసుర్లు: యూపీఏ సర్కారు తీరుపై జైట్లీ విమర్శలు సంధించారు. ‘మేం కొన్ని పూలను వికసింపజేశాం. మరిన్నిం టిని పెంచాల్సి ఉంది. కానీ గత వారసత్వం తాలూకు బరువు వల్లే మేం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం’ అని యూపీఏను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వృద్ధి రేటును పెంచడం, ఆర్థిక స్థిరత్వానికి ప్రణాళికలు వంటి అంశాలను జైట్లీ ప్రస్తావించిన సమయంలో మోదీ సహా అధికార బెంచీల్లోని సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు ప్రకటించారు. యోగా అంశాన్ని దాతృత్వ కార్యక్రమాల కిందికి తేవాలని ప్రతిపాదించినప్పుడు కూడా మోదీ ఉత్సాహంగా బల్ల చరుస్తూ కనిపించారు. కుంభకోణాలు, అవినీతికి చరమగీతం పాడిన ప్రజలు.. సత్వర మార్పు, వేగవంతమైన వృద్ధి, పూర్తి పారదర్శకతకు ఓటు వేశారన్నారు. మరోవైపు పలువురు విపక్ష సభ్యులు కునుకుతీస్తూ కెమెరాలకు చిక్కారు. ప్రతిపక్షం వైపు పలు సీట్లు ఖాళీగా కనిపిం చాయి. జాతి, కుల, మత బేధాలు లేకుండా సమానత్వమే ప్రాతిపదికగా అందరికీ న్యాయం చేకూర్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు. దీన్ని సూచిం చేలా ‘సర్వే భవంతు సుఖినః..’ అంటూ ఉపనిషద్ శ్లోకంతో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. మేం పేదలు, పరిశ్రమల పక్షం! తమ ప్రభుత్వం పేదలు, పరిశ్రమల పక్షపాతిగా నిలుస్తుందని బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్సభ టీవీతో జైట్లీ పేర్కొన్నారు. మౌలిక వసతులు, సంక్షేమంపై వ్యయాలను సమతూకం చేయాల్సిన అవసరముందన్నారు. వృద్ధి రేటును సాధిస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, పరిశ్రమల నుంచి ఆదాయం వస్తేనే పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయొచ్చన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఇరువురి పక్షానా ఉంటుందన్నారు. త్రివర్ణంలో బడ్జెట్: సాధారణంగా సాదా నీలి రంగులో ఉండే బడ్జెట్ పేపర్లు ఈసారి జాతీయ జెండా రంగుల్లో మెరిసిపోయాయి. వాటిపై పార్లమెంట్ భవనం ఫొటోను కూడా చిత్రీకరించారు. -
చట్టబద్ధమైన పన్నులు వసూలు చేయాల్సిందే..
* అనుచిత పన్నులతో దక్కేది చెడ్డ పేరే * కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: చట్టబద్ధమైన పన్ను బకాయిలన్నింటినీ రెవెన్యూ శాఖ వసూలు చేయాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయితే, అనుచితంగా విధించిన పన్నులను రాబట్టడంపై దృష్టి పెడితే ప్రయోజనం లేదని, ఇది చెడ్డపేరు మాత్రమే తెచ్చిపెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. శని వారం పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ విషయాలు తెలిపారు. ‘సముచిత పన్ను బకాయిలను ఎలాగైనా రాబట్టుకోవాల్సిందే. కానీ, మనకి చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి చెల్లించనక్కర్లేని పన్నులు, అనుచితంగా విధించిన పన్నుల నుంచి అంతిమంగా ఎటువంటి రాబడి ఉండదని తె లుసుకోవాలి’ అని ఆయన చెప్పారు. గత లావాదేవీలకూ పన్నులు వర్తించేలా (రెట్రాస్పెక్టివ్) యూపీఏ ప్రభుత్వం చేసిన సవరణలను ప్రస్తావిస్తూ.. వీటి ద్వారా ఇప్పటిదాకా ఎటువంటి ఆదాయమూ కనిపించలేదని జైట్లీ వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులను కోర్టులు కొట్టివేయడమో లేదా నిలుపుదల చేయడమో జరిగిందన్నారు. కానీ చివరికి మాత్రం ఇది చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని జైట్లీ పేర్కొన్నారు. ఫిన్లాండ్ సంస్థ నోకియాను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్ను వివాదం కారణంగా తమిళనాడులో ఒక టెలికం ప్లాంటు మూతపడటంతో అక్టోబర్లో దేశీయంగా టెలికమ్యూనికేషన్ పరికరాల ఉత్పత్తి 78 శాతం మేర క్షీణించిందని వ్యాఖ్యానించారు. తమకు అన్ని అధికారాలు ఉన్నప్పటికీ.. రెట్రో పన్నులు విధించబోమని ఇప్పటికే స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. మరోవైపు, గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన బకాయిల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్య లోటును 4.1 శాతానికి కట్టడి చేయడం పెనుసవాలుగా మారిందన్నారు. అటు వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)పై రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని జైట్లీ చెప్పారు. బీమా సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం.. రాజకీయంగా ఎటువంటి అవరోధాలు వచ్చినా బీమా రంగంలో సంస్కరణలు అమలు చేస్తామని జైట్లీ స్పష్టం చేశారు. బీమా సంస్కరణల బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బీమా బిల్లు ప్రస్తుతం రాజ్యసభ ముందు ఉంది. కానీ అక్కడ ఎన్డీఏకి మెజారిటీ లేకపోవడం, ఇతర రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం తెలిసిందే. -
అర్హులకే సబ్సిడీ ప్రయోజనం: జైట్లీ
సబ్సిడీలను హేతుబద్ధం చేసేందుకు త్వరలో కమిషన్ ఏర్పాటు న్యూఢిల్లీ: సబ్సిడీలను హేతుబద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులకే సబ్సిడీ ప్రయోజనాలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకొనబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రైతులకు సబ్సిడీ అంశంపై శుక్రవారం లోక్సభలో ఒక అనుబంధ ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.1 శాతానికి ద్రవ్యలోటును నియత్రించడం చాలా కష్టసాధ్యమని, అందుకోసం సబ్సిడీల ఖర్చను తగ్గించుకోవాలన్నారు. సబ్సిడీలను హేతుబద్ధం చేసేందు కు మరికొన్ని రోజుల్లో వ్యయ నిర్వహణా కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, సబ్సిడీల భారం పెరగకుండా చూడడమే వ్యయ నిర్వహణా కమిషన్ ప్రధాన బాధ్యతల్లో ఒకటని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి కమిషన్ తన నివేదిక సమర్పించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. భారతీయ ఉత్పత్తులు మార్కెట్లో పోటీ పడాలంటే పన్నుల విధానాన్ని హేతుబద్ధం చేయాలన్నారు. ఖనిజవాయువు ధర పెరిగిన తర్వాత పెరగబోయే యూరియా ధర భారా న్ని వినియోగదారులకు బదిలీ చేయబోతున్నారా? అన్న ప్రశ్న ఊహాజనితమని అన్నా రు. విద్యుత్ రాష్ట్రాలకు సంబంధించిన అంశంకాబట్టి, తగిన స్థోమత ఉన్న రాష్ట్రాలు వ్యవసా యానికి సబ్సిడీ ఇవ్వవచ్చన్నారు. మరోవైపు ఆహార భద్రత కోసం సంవత్సరానికి రూ.1,31,086కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. మరోపక్క వ్యవసాయ రంగానికి సంబంధించి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని లోక్సభలో ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. పంటలకు కనీస మద్దతుధర నిర్ధారణ ప్రక్రియను సమీక్షించి, మార్పులు చేయాలని ఎంపీలు కోరారు.