వహ్వా జైట్లీ!
న్యూఢిల్లీ: ఉర్దూ కవిత్వంలోని కమ్మని వాక్యాలు, మత గ్రంథాల్లోని సందర్భోచిత శ్లోకాలు, గత యూపీఏ సర్కారుపై పదునైన విమర్శలతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. లేత నీలి రంగు చొక్కా, ముదురు నీలం రంగు నెహ్రూ జాకెట్, నల్ల రంగు ప్యాంటు ధరించిన 62 ఏళ్ల జైట్లీ శనివారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
సందర్శకుల గ్యాలరీ నుంచి ఆయన సోదరి మధు భార్గవ, కోడలు పునీత వీక్షింస్తుండగా వంద నిమిషాల పాటు బడ్జెట్ ప్రసం గం చేశారు. మొదట నుంచుని ప్రసంగించిన జైట్లీ, కొద్ది నెలలుగా ఆరోగ్యం బాలేని కారణంగా 22 నిమిషాల తర్వాత స్పీకర్ అనుమతితో కూర్చుని మిగతా ప్రసంగాన్ని పూర్తి చేశారు. మంత్రి నితిన్ గడ్కారీ తన స్థానాన్ని ఖాళీ చేసి జైట్లీ కిచ్చారు. ప్రధాని మోదీ తన వద్దనున్న నీళ్ల గ్లాసును జైట్లీ వద్ద పెట్టాల్సిందిగా లోక్‌సభ సిబ్బందికి సూచించారు. పార్లమెంట్ సిబ్బంది జ్యూస్ కూడా అందించారు.
యూపీఏపై విసుర్లు: యూపీఏ సర్కారు తీరుపై జైట్లీ విమర్శలు సంధించారు. ‘మేం కొన్ని పూలను వికసింపజేశాం. మరిన్నిం టిని పెంచాల్సి ఉంది. కానీ గత వారసత్వం తాలూకు బరువు వల్లే మేం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం’ అని యూపీఏను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వృద్ధి రేటును పెంచడం, ఆర్థిక స్థిరత్వానికి ప్రణాళికలు వంటి అంశాలను జైట్లీ ప్రస్తావించిన సమయంలో మోదీ సహా అధికార బెంచీల్లోని సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు ప్రకటించారు. యోగా అంశాన్ని దాతృత్వ కార్యక్రమాల కిందికి తేవాలని ప్రతిపాదించినప్పుడు కూడా మోదీ ఉత్సాహంగా బల్ల చరుస్తూ కనిపించారు.
కుంభకోణాలు, అవినీతికి చరమగీతం పాడిన ప్రజలు.. సత్వర మార్పు, వేగవంతమైన వృద్ధి, పూర్తి పారదర్శకతకు ఓటు వేశారన్నారు. మరోవైపు పలువురు విపక్ష సభ్యులు కునుకుతీస్తూ కెమెరాలకు చిక్కారు. ప్రతిపక్షం వైపు పలు సీట్లు ఖాళీగా కనిపిం చాయి. జాతి, కుల, మత బేధాలు లేకుండా సమానత్వమే ప్రాతిపదికగా అందరికీ న్యాయం చేకూర్చడానికి కట్టుబడి ఉన్నామన్నారు. దీన్ని సూచిం చేలా ‘సర్వే భవంతు సుఖినః..’ అంటూ ఉపనిషద్ శ్లోకంతో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
మేం పేదలు, పరిశ్రమల పక్షం!
తమ ప్రభుత్వం పేదలు, పరిశ్రమల పక్షపాతిగా నిలుస్తుందని బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్‌సభ టీవీతో జైట్లీ పేర్కొన్నారు. మౌలిక వసతులు, సంక్షేమంపై వ్యయాలను సమతూకం చేయాల్సిన అవసరముందన్నారు. వృద్ధి రేటును సాధిస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, పరిశ్రమల నుంచి ఆదాయం వస్తేనే పేదల అభ్యున్నతి కోసం ఖర్చు చేయొచ్చన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఇరువురి పక్షానా ఉంటుందన్నారు.
త్రివర్ణంలో బడ్జెట్:
సాధారణంగా సాదా నీలి రంగులో ఉండే బడ్జెట్ పేపర్లు ఈసారి జాతీయ జెండా రంగుల్లో మెరిసిపోయాయి. వాటిపై పార్లమెంట్ భవనం ఫొటోను కూడా చిత్రీకరించారు.