చట్టబద్ధమైన పన్నులు వసూలు చేయాల్సిందే..
* అనుచిత పన్నులతో దక్కేది చెడ్డ పేరే
* కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: చట్టబద్ధమైన పన్ను బకాయిలన్నింటినీ రెవెన్యూ శాఖ వసూలు చేయాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయితే, అనుచితంగా విధించిన పన్నులను రాబట్టడంపై దృష్టి పెడితే ప్రయోజనం లేదని, ఇది చెడ్డపేరు మాత్రమే తెచ్చిపెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. శని వారం పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ విషయాలు తెలిపారు. ‘సముచిత పన్ను బకాయిలను ఎలాగైనా రాబట్టుకోవాల్సిందే. కానీ, మనకి చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి చెల్లించనక్కర్లేని పన్నులు, అనుచితంగా విధించిన పన్నుల నుంచి అంతిమంగా ఎటువంటి రాబడి ఉండదని తె లుసుకోవాలి’ అని ఆయన చెప్పారు.
గత లావాదేవీలకూ పన్నులు వర్తించేలా (రెట్రాస్పెక్టివ్) యూపీఏ ప్రభుత్వం చేసిన సవరణలను ప్రస్తావిస్తూ.. వీటి ద్వారా ఇప్పటిదాకా ఎటువంటి ఆదాయమూ కనిపించలేదని జైట్లీ వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులను కోర్టులు కొట్టివేయడమో లేదా నిలుపుదల చేయడమో జరిగిందన్నారు. కానీ చివరికి మాత్రం ఇది చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని జైట్లీ పేర్కొన్నారు. ఫిన్లాండ్ సంస్థ నోకియాను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్ను వివాదం కారణంగా తమిళనాడులో ఒక టెలికం ప్లాంటు మూతపడటంతో అక్టోబర్‌లో దేశీయంగా టెలికమ్యూనికేషన్ పరికరాల ఉత్పత్తి 78 శాతం మేర క్షీణించిందని వ్యాఖ్యానించారు. తమకు అన్ని అధికారాలు ఉన్నప్పటికీ.. రెట్రో పన్నులు విధించబోమని ఇప్పటికే స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. మరోవైపు, గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన బకాయిల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్య లోటును 4.1 శాతానికి కట్టడి చేయడం పెనుసవాలుగా మారిందన్నారు. అటు వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ)పై రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని జైట్లీ చెప్పారు.
బీమా సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం..
రాజకీయంగా ఎటువంటి అవరోధాలు వచ్చినా బీమా రంగంలో సంస్కరణలు అమలు చేస్తామని జైట్లీ స్పష్టం చేశారు. బీమా సంస్కరణల బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బీమా బిల్లు ప్రస్తుతం రాజ్యసభ ముందు ఉంది. కానీ అక్కడ ఎన్‌డీఏకి మెజారిటీ లేకపోవడం, ఇతర రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం తెలిసిందే.