జీడీపీపై కచ్చిత అంచనాల్ని వెల్లడించడం సాధ్యం కాదు
మాజీ చీఫ్ స్టాటిస్టీసియన్ ప్రణబ్ సేన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17 ఏప్రిల్, మార్చి) సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను ముందస్తుగా సమగ్రంగా అంచనావేయడం సాధ్యంకాదని మాజీ చీఫ్ స్టాటిస్టీసియన్ ప్రణబ్ సేన్అభిప్రాయపడ్డారు. 2016–17 జీడీపీ అంచనాలను వచ్చేనెల 6న కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రణబ్ సేన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతియేడాది ఫిబ్రవరి 28న బడ్జెట్ సమర్పిస్తుండగా, ఈ ఏడాది ఇందుకు భిన్నంగా ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్‌ను కేంద్రం సమర్పించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మామూలు షెడ్యూల్ సమయానికన్నా దాదాపు నెలరోజుల ముందే కీలక అంచనాల వెల్లడికి గణాంకాల మంత్రిత్వశాఖ కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రణబ్ సేన్ చేసిన వ్యాఖ్యలు ...
► రబీ పంటకు సంబంధించి తగిన గణాంకాలు అందుబాటులో ఉండవు. అలాగే పెద్ద నోట్ల నిషేధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎంతస్థాయిలో ఉందన్న విషయమూ అప్పుడే చెప్పలేం.
► డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు కూడా జనవరి 6 నాటికి వెలువడవు.
► ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఏ అంచనా అయినా ఊహాజనితమే తప్ప, వాస్తవ ప్రాతిపదికలు ఏమీ ఉండవు.
► డీమోనిటైజేషన్ నేపథ్యంలో– జీడీపీ 2 శాతం వరకూ పడిపోవచ్చన్న పలువురి ఆర్థికవేత్తల అంచనాల నేపథ్యంలో ప్రణబ్‌సేన్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.