న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక సారథ్యానికి ప్రజలు మరోసారి రికార్డు మెజారిటీతో పట్టం కట్టారని భారతీయ పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, విదేశీ పెట్టుబడుల రాకకు ఊతం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఎకానమీని అధిక వృద్ధి బాట పట్టించేందుకు ఎన్‌డీయే 2.0 మరిన్ని సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టాలని ఆనంద్ మహీంద్రా, ఆది గోద్రెజ్, అనిల్ అగర్వాల్, సునీల్ మిట్టల్ తదితర దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. ఈ దిశగా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అత్యధిక కార్పొరేట్ ట్యాక్స్ భారత్‌లోనే ఉంది. దీన్ని తగ్గించాల్సి ఉంది. దీన్ని 25 శాతానికి తగ్గిస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. చిన్న కంపెనీలకు తగ్గించినా .. పెద్ద కంపెనీలకు ఇంకా తగ్గించలేదు. దీంతో పాటు వృద్ధికి ఊతమిచ్చేలా మరిన్ని చర్యలు ఉంటాయని ఆశిస్తున్నా‘ అని ఆయన తెలిపారు. వృద్ధి, ఉద్యోగ కల్పనకి ఊతమిచ్చే చర్యలతో పాటు అంతర్జాతీయంగా వాణిజ్యంలో భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేయడం, పన్ను చట్టాలను సరళతరం చేయడం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాత్మక సారథ్యం, దార్శనికతపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలు నిదర్శనమని భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ఆర్థిక వృద్ధి ఫలాలు పేదలకు కూడా చేరవేసే ఆర్థిక ఎజెండాను అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇవి మరింతగా ఊతమివ్వగలవని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలోనే శక్తిమంతమైన నేతగా మోదీ
ప్రజాస్వామికంగా ఎన్నికైన అత్యంత శక్తిమంతమైన నేతగా మోదీ నిలవనున్నారని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారు. ‘దేశ పరిమాణం (జనాభా+స్థలం) గీ ఎకానమీ పరిమాణం గీ ఎన్నికల ఫలితాల పరిమాణం = నాయకుడి శక్తికి కొలమానం. ఈ ఫార్ములా ప్రకారం చూస్తే నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకుడిగా నిలుస్తారు‘ అని మహీంద్రా ట్వీట్ చేశారు. మరోవైపు, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ‘సాహసోపేతమైన సంస్కరణలు తీసుకోవడానికి, దేశానికి కొత్త రూపునిచ్చేందుకు ఇదే సరైన సమయం. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదే సమయంలో అధిక ఉత్పాదకత ఉండే ఉద్యోగాల కల్పన బాధ్యతను వ్యాపారవేత్తలు తీసుకోవాలి‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేశారు. ‘వచ్చే అయిదేళ్లలో ఎన్‌డీయే 2.0 ఆర్థిక వృద్ధి ఫలాలు అందరికీ అందేలా సాహసోపేతమైన విధానాలు ప్రవేశపెట్టాలి‘ అని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్–షా చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి రాగలవని స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్‌ఈ సభ్యుడు రమేష్ దమాని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి మరింత తోడ్పడగలదని హౌస్ ఆఫ్ హీరనందానీ వ్యవస్థాపకుడు సురేంద్ర హీరనందానీ తెలిపారు.
పటిష్ట వృద్ధి కొనసాగింపునకు సంకేతాలు..
పటిష్టమైన వృద్ధికి ఊతమిచ్చేలా వచ్చే అయిదేళ్ల పాటు స్థూల ఆర్థిక విధానాలు యథాప్రకారం కొనసాగుతాయనడానికి ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆర్థికవేత్తలు, బ్రోకరేజీలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఆర్థిక సంస్కరణలను కొనసాగించడం పెద్ద సవాలుగా మారవచ్చని పేర్కొన్నాయి. రాజ్యసభలో ఇంకా పూర్తి మెజారిటీ లేనందున.. బీజేపీ సంస్కరణల చట్టాల అమలు ఎజెండాకు అడ్డంకులు ఎదురవొచ్చని అంచనా.
ఆర్థిక వృద్ధికి ఊతం
Published Fri, May 24 2019 12:27 AM | Last Updated on Fri, May 24 2019 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment