రేట్ల కోత కష్టమే..!
ముంబై: వడ్డీరేట్లు తగ్గించాలంటూ ఎవరెన్నిరకాలుగా డిమాండ్‌లు, విజ్ఞప్తులు చేసినా... ఈ సారి కూడా నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రానున్న పాలసీ సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రేట్లను తగ్గించకపోవచ్చని.. యథాతథంగా కొనసాగించేందుకే మొగ్గుచూపొచ్చని విశ్లేషకులు, రేటింగ్ ఏజెన్సీలు, బ్రోకరేజి సంస్థలు పేర్కొంటున్నాయి. డిసెంబర్ 2న ఆర్‌బీఐ ఐదో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. రేట్ల తగ్గింపు అనేది ఇక వచ్చే ఏడాదే ఉంటుందనేది మెజారిటీ నిపుణుల అభిప్రాయం. ఈ పాలసీ సమీక్షలో కీలక రేట్లు తగ్గే అవకాశాలు అంతంతమాత్రమేనని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం లక్ష్యం విషయంలో ఆర్‌బీఐ ఎలాంటి వ్యాఖ్యలు, సంకేతాలు ఇస్తుందనేది చాలా కీలకమైన అంశమని వెల్లడించింది.
తొలి రేట్ల కోత ఫిబ్రవరిలోనే...!
‘ద్రవ్యోల్బణం దిగొస్తున్నా... ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పాలసీ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులూ చేయకపోచ్చు. అయితే, వడ్డీరేట్ల తగ్గింపువల్ల సెంటిమెంటు మెరుగయ్యేందుకు దోహదం చేస్తుంది’ అని కేర్ రేటింగ్స్ తెలిపింది. వరుసగా ఐదు నెలుగా ద్రవ్యోల్బణం తగ్గుదలను చూస్తే రేట్ల కోత డిమాండ్ తగినదేనని.. కానీ, ధరలు దిగిరావడంలో బేస్ ఎఫెక్ట్ కూడా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటోంది. ‘ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ దిగుబడులు తగ్గొచ్చన్న అంచనాలు రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు.
దీంతోపాటు డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత అంశాన్ని కూడా ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది’ అని కేర్ రేటింగ్స్ తెలిపింది. కాగా, సుదీర్ఘ విరామం తర్వాత తొలి వడ్డీరేట్ల(రెపో) కోత వచ్చే ఏడాది ఫిబ్రవరి సమీక్షలో ఉండొచ్చని లేదంటే కనీసం ఏప్రిల్‌లోనైనా నిర్ణయం వెలువడొచ్చని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. వచ్చే ఏడాది మొత్తంలో అర శాతం తగ్గింపును అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం రేట్లు ఇలా...
గతేడాది సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్.. 15 నెలల కాలంలో మూడు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచారు. ఇందుకు ధరల కట్టడే ప్రధాన లక్ష్యమని కూడా స్పష్టం చేశారు. గడచిన నాలుగు పాలసీ సమీక్షల్లో(దాదాపు 10 నెలలుగా) పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే, రెండుసార్లు మాత్రం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని తగ్గించి వ్యవస్థలోకి ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) పెంచే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతం, ఎస్‌ఎల్‌ఆర్ 22 శాతం వద్ద కొనసాగుతున్నాయి.
భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం...
ఆర్‌బీఐ ఇటీవల కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని(సీపీఐ) తన పాలసీ సమీక్షకు ప్రధాన కొలమానంగా తీసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. 2015 జనవరినాటికి ఆర్‌బీఐ సీపీఐ లక్ష్యం 8 శాతంకాగా, 2016 జనవరికి 6 శాతంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 5.52 శాతానికి దిగొచ్చింది. మరోపక్క, టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కూడా అక్టోబర్‌లో ఐదేళ్ల కనిష్టానికి(1.77%) తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ కచ్చితంగా వడ్డీరేట్లను తగ్గించి మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయూతనివ్వాలని పారిశ్రామిక రంగం గగ్గోలు పెడుతోంది. ఆర్థిక మంత్రి జైట్లీ కూడా దీనికి మద్దతుగానే గొంతు కలిపారు.
1న జైట్లీతో రాజన్ భేటీ
పాలసీ సమీక్ష నేపథ్యంలో వచ్చే నెల 1న ఆర్‌బీఐ గవర్నర్ రాజన్... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వడ్డీరేట్ల తగ్గింపు అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ద్రవ్యోల్బణం తగ్గుముఖం, రెండో త్రైమాసికం(క్యూ2)లో వృద్ధి రేటు తగ్గొచ్చన్న అంచనాల నేపథ్యంలో రేట్ల కోత ఆవశ్యకతను జైట్లీ వివరించవచ్చని భావిస్తున్నారు.