దశాబ్దాలుగా కదలిక లేకుండా పడివున్న ‘కార్మిక సంస్కరణలు’ సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగానే జవసత్వాలు తెచ్చుకున్నాయి. పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ఎన్డీయే సర్కారు ఫ్యాక్టరీల చట్టానికి, అప్రెంటిస్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు ప్రవేశపెట్టింది. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు పూర్తికాగానే ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంస్కరణలపై పూర్తిగా దృష్టిసారించి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే కార్యక్రమంకింద పలు కార్మిక సంస్కరణల పథకాలకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సంస్కరణల విషయంలో ప్రధాన రాజకీయపక్షాలమధ్య దాదాపు ఏకాభిప్రాయం వచ్చినందువల్లనే ఇవి చకచకా ముందుకు కదులుతున్నాయి. రాజస్థాన్‌లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఫ్యాక్టరీల చట్టానికి, అప్రెంటిస్ చట్టానికి, కాంట్రాక్టు లేబర్ (క్రమబద్ధీకరణ, రద్దు) చట్టానికి, పారిశ్రామిక వివాదాల చట్టానికి సవరణలు తీసుకొచ్చి ఆ విషయంలో అందరికీ మార్గదర్శిగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆ బాటలోనే వెళ్లదల్చుకున్నట్టు ప్రకటించింది. హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కార్మిక సంస్కరణలవైపు ఉత్సాహంగా అడుగులేసింది. అసెంబ్లీ ఎన్నికలు లేనట్టయితే ఈపాటికే అవి పూర్తయివుండేవి. దేశంలో కార్మిక రంగ సంస్కరణల కోసం అటు పరిశ్రమల వర్గాలు, ఇటు కార్మిక సంఘాలు ఎన్నాళ్లనుంచో డిమాండు చేస్తున్నాయి.
అంతేకాదు... ప్రపంచబ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌లోని కార్మిక చట్టాలు పారిశ్రామికాభివృద్ధికీ, ఉపాధి కల్పనకూ అవరోధంగా పరిణమించాయని హెచ్చరిస్తూ వచ్చాయి. ఇతర దేశాలతో పోలిస్తే తయారీ రంగం విషయంలో భారత్‌ది ఎప్పుడూ వెనక బెంచీయేనని ఆ సంస్థలు చెబుతున్నాయి. నిజమే... స్థూల దేశీయోత్పత్తిలో మన తయారీ రంగం వాటా 15 శాతం మించదు. మన పొరుగునున్న చైనాలో అది 34 శాతం! యూపీఏ సర్కారుకు ఈ సంస్కరణల విషయంలో ఎంత ఉత్సాహం ఉన్నా రెండో దఫా పాలనలో దాన్ని ఆవరించిన నిస్సత్తువ కారణంగా ముందుకు అడుగేయలేకపోయింది.
మన చట్టాల పుణ్యమా అని ఇక్కడ కర్మాగారాలు ప్రారంభించాలన్నా, వాటిని కొనసాగించాలన్నా ఎంతో కష్టమవుతున్నదని పారిశ్రామికవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. కార్మిక వ్యవహారాలు ఉమ్మడి జాబితాలోనివి కనుక వీటికి సంబంధించి కేంద్ర చట్టాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు కూడా ఉంటాయి. ఇవన్నీ తడిసిమోపెడయి ఇబ్బందికరంగా పరిణమించాయని వ్యాపార వేత్తలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్తయినా దాదాపు 60 కేంద్ర చట్టాలకూ, రాష్ట్ర స్థాయిలో ఉండే 150కిపైగా చట్టాలకూ అనుగుణంగా ఎన్నెన్నో పత్రాలను సమర్పించాల్సివుంటుంది. అసలు ‘కార్మికుడు’ అనే పదాన్ని నిర్వచించడంలోనే అయోమయం ఉన్నది. ఈ పదానికి వేర్వేరు చట్టాల్లో 27 రకాల నిర్వచనాలున్నాయి. ఈ చట్టాల కీకారణ్యంలో దారితోచక గందరగోళపడుతున్నా మని... వాటిల్లోని జటిలమైన నిబంధనలు అడుగడుగునా ప్రతిబంధకంగా మారా యని వ్యాపారవేత్తలు గగ్గోలుపెడుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలకింద పెట్టే కేసులు సంవత్సరాల తరబడి నడుస్తున్నాయన్నది వారి ఫిర్యాదు. వ్యాపారవృద్ధిపై దృష్టిపెట్టడానికి బదులు ఈ కేసుల పైనే సమయం వెచ్చించవలసి వస్తున్నదని వారి ఆరోపణ. వాహనాల తయారీనుంచి వ్యవసాయం వరకూ...ఉపగ్రహాలనుంచి జలాంతర్గాములవరకూ సమస్తం ఇక్కడే ఉత్పత్తి కావాలని ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్నిచ్చిన మోదీ...దాన్ని విజయవంతం చేయాలంటే ఈ చట్టాల మరమ్మతు తప్పనిసరని సంకల్పించారు. కనుకనే ఆ నినాదం ఇవ్వడానికన్నా ముందు ఆ చట్టాలపై దృష్టిసారించారు. కార్మికసంఘాలు కూడా ఈ చట్టాలను సంస్కరించాలని కోరుతున్నాయిగానీ వాటి దృష్టి కోణం వేరు. ఆ చట్టాలు ఏర్పడిననాటికి ఊహకైనా రాని ఎన్నో రకాలు పరిశ్రమల్లో వచ్చిచేరాయని, వాటిల్లో నిర్దిష్టమైన పనిగంటలు, ఇతర నిబంధనలు ఉండటంలేదని అవి ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుత సంస్కరణల్లో వ్యాపారవేత్తలకు ఇబ్బంది కలిగిస్తున్న ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’ను పూర్తిగా తొలగించడం ఒకటి. తనిఖీల పేరుతో వచ్చి కేసులు పెట్టే ప్రస్తుత విధానం స్థానంలో కంప్యూటర్ ఆధారిత డ్రా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఏ ఫ్యాక్టరీని తనిఖీ చేయాలో అదే నిర్దేశిస్తుంది. తనిఖీ అనంతరం ఇన్‌స్పెక్టర్ తన నివేదికను 72 గంటల్లో ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారం ప్రారంభించదల్చుకునేవారు ఇప్పుడున్న 16 రకాల దరఖాస్తుల స్థానంలో ఒకే ఒక దరఖాస్తును...అదికూడా ఆన్‌లైన్‌లోనే పంపేవీలుకలుగుతుంది. అయితే, ఇప్పటికీ వ్యాపారవేత్తలు 44 కేంద్ర చట్టాలనూ, దాదాపు 150 రాష్ట్ర స్థాయి చట్టాలనూ అనుసరించాల్సిన స్థితే ఉన్నది. ఈ చట్టాలన్నిటినీ కనిష్ట సంఖ్యకు కుదించడమన్నది ఎప్పుడో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. ఇక పీఎఫ్ ఖాతాల నిర్వహణ, వాటి బదిలీవంటివి సులభతరం చేయడంద్వారా ఉద్యోగులకు మేలు కలగజేయడానికి సర్కారు ప్రయత్నించింది. అయితే, పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగులకుండే ప్రత్యామ్నాయాల విషయంలో మరింత సరళత అవసరమని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక కార్మికులను పనిలోకి తీసుకోవ డానికి, తొలగించడానికి సంబంధించిన నిబంధనలు నిక్షిప్తమై ఉండే పారిశ్రామిక వివాదాల చట్టం జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లదల్చుకున్నట్టు లేదు. ఆ బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. ఈ చట్టం విషయంలో కేంద్రమే చొరవ తీసుకుని దేశమంతా వర్తించే విధంగా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. మొత్తానికి అటు పారిశ్రామికవేత్తలకూ, ఇటు కార్మిక వర్గానికీ ప్రయోజనం చేకూర్చేలా సంస్కరణలు తీసుకురావడం కత్తి మీది సామే. దాన్ని ఎన్డీయే సర్కారు ఎంత చాకచక్యంగా పూర్తి చేయగలుగుతుందో చూడాలి.
జూలు విదిల్చిన సంస్కరణలు!
Published Fri, Oct 17 2014 11:19 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement