groth rate
-
Global Wealth Report 2023: భారత్ తప్ప పలు అగ్రదేశాల్లో సంపద కరిగిపోతోంది
అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో సంపద పెరుగుతోంది. భారత్‌లో తప్ప ► అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, డాలర్‌తో పోల్చి చూస్తే వివిధ దేశాల కరెన్సీలు పడిపోవడం, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు వంటివెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సంపద క్షీణించడం ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నట్టుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) రూపొందించిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023లో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యధికంగా సంపదని కోల్పోతే ఆ తర్వాత స్థానంలో జపాన్ ఉంది. 2021లో ప్రపంచ దేశాల సంపద 466.2 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి 2.4% తగ్గి 454.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంపద తగ్గిపోవడంలో అమెరికా ముందుంది. ఏడాదిలో 5.9 ట్రిలియన్ డాలర్ల సంపదను అగ్రరాజ్యం కోల్పోయింది. ఆ తర్వాత స్థానంలో జపాన్ నిలిచింది. 2021తో పోల్చి చూస్తే ఆ దేశం 2.5 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ప్రాంతాల వారీగా ఇలా.. ► అత్యంత సంపన్న దేశాలున్న ఉత్తర అమెరికా, యూరప్‌లు భారీగా నష్టపోయాయి. 2022లో ఈ దేశాల్లో 10.9 ట్రిలి యన్ డాలర్ల నష్టం జరిగింది. ► ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► లాటిన్ అమెరికాలో 2.4 ట్రిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ► 2022లో భారీగా సంపద హరించుకుపోయిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఆ్రస్టేలియా ఉన్నాయి. ► సంపద భారీగా పెరిగిన దేశాల్లో భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా నిలిచాయి. ► తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో పెరుగుతున్న సంపద ► ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం సంపద పెరుగుతోంది. 2021తో పోల్చి చూస్తే మన దేశ సంపద 675 బిలియన్ డాలర్లు అంటే 4.6% పెరిగింది. 2022 నాటికి 15.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా వంటి దేశాల్లో కూడా సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం పెరగడం విశేషం. దేశంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అపర కుబేరులుగా మారారు. 2000 నుంచి 2022 వరకు ఏడాదికి 15% మిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నప్పటికీ రష్యా సంపద కూడా పెరగడం గమనార్హం. స్థిరంగా సంపద పెరుగుదల.. ► భారత్‌లో సంపద పెరుగుదల 20 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సంపద ఏడాదికి 5.9% చొప్పున పెరుగుతోంది. ఒకప్పుడు చైనాలో మధ్యతరగతి సంపద అధికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించింది. మిలియనీర్లు మన దేశంలో ఏకంగా 15% పెరుగుతూ వస్తున్నారు. మొత్తమ్మీద మిలియనీర్లు అమెరికాలోనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన వారు 5.9 కోట్ల మంది ఉంటే వారిలో 2.3 కోట్ల మంది అంటే 40% అమెరికాలోనే ఉన్నారు. 2027 నాటికి భారత్, చైనా, బ్రెజిల్, యూకే, దక్షిణ కొరియాలో కూడా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అంచనా. 2022–27 మధ్య చైనాలో కోటీశ్వరులు 26%,భారత్‌లో 11% పెరుగుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక
India Economy Likely to Grow 9% Next Fiscal: భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఢోకా ఉండబోదని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– క్రెడిట్ సూసీ అంచనావేసింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటు 10.5 శాతం వరకూ ఉండే వీలుందని పేర్కొంది. వృద్ధి అంచనా 8.4–9.5 శాతం శ్రేణిలో ఉంటుందన్న వివిధ అభిప్రాయాలు, అంచనాలకు భిన్నంగా క్రెడిట్ సూసీ విశ్లేషణ ఉండడం గమనార్హం. 2021–22లో 9.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనాకాగా, అంతర్జాతీయ రే టింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ విషయంలో ఈ అంచనా 8.4 శాతంగా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా నమోదవుతుందని స్విస్ బ్రో కరేజ్ దిగ్గజ సంస్థ పేర్కొంది. క్రెడిట్ సూసీలో ఆసియా పసిఫిక్, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ నీల కంత్ మిశ్రా విశ్లేషణల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... * ఆర్థిక వ్యవస్థ సానుకూలతలోనే కొనసాగుతుంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో దిగువ ఆదాయ ఉద్యోగాల్లో సైతం రికవరీ కొనసాగే అవకాశం ఉంది. * ఇంధన, ముడి పదార్థాల ధరలు భారత్ ఎకానమీకి ప్రస్తుతం ఉన్న ప్రధాన సవాలు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్, బొగ్గు, ఎరువులు, పామ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ పోతే వృద్ధి వేగం మందగించే అవకాశం ఉంటుంది. * విద్య, రవాణా, నిర్మాణ రంగం, ఆటో వంటి కొన్ని రంగాల్లో ఉపాధి కల్పన ఇంకా తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. ఆయా రంగాలు ఇంకా కోవిడ్ ముందస్తు స్థితికి చేరుకోలేదు. అయితే ఎకానమీ పూర్తిగా తెరుచుకునే క్రమంలో ఈ రంగాలూ పురోగమించే వీలుంది. * మహమ్మారి సమయంలో మూలధన కల్పనా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వినియోగదారు వ్యయాలు పెరగడం, పటిష్ట స్థాయిలో ఈక్విటీ ఫండ్ పెరుగుదల ఈ సవాళ్ల పరిష్కారానికి దోహదపడతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ రంగం), నిర్మాణ రంగాల్లో డిమాండ్ క్రమంగా మెరుగుపడుతుండడం సానుకూలాంశాలు. * ఇక మార్కెట్ల విషయానికి వస్తే, గ్లోబల్ ఈక్విటీల కంటే దేశంలో ప్రైస్–టూ–ఎర్నింగ్స్ (పీఈ) రేషియో ప్రీమియం 21 శాతంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చితే 72 శాతం ఇప్పటికే అధికంగా ఉంది. ఆయా అంశాలు పరిశీలిస్తే, ఈక్విటీ మార్కెట్లలో మరింత అప్‌ట్రెండ్ మరింత ఉండకపోవచ్చు. అయితే మహమ్మారి నేపథ్యంలో తీవ్రంగా పడిపోయిన మార్కెట్లకు ‘2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో సానుకూల అంచనాలు’ తిరిగి బలాన్ని ఇచ్చాయి. 2023–24లో కూడా ఇదే అంచనాల వల్ల మార్కెట్లు భారీగా పడిపోయే అవకాశాలు తక్కువే. * దేశ స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే వృద్ధికి సానుకూలంగానే ఉన్నాయి. ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉంది. ప్రభుత్వ ఆదాయాలు మెరుగ్గా ఉండడం ఎకానమీకి కలిసి వచ్చే అంశం. విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనగలుగుతుంది. * కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ లేదా డెల్టా వేరియంట్ యొక్క అవశేష ప్రభావం భారతదేశం కంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ ప్రకటన.. సర్దుబాటుకే మొగ్గు! -
వచ్చే ఏడాది వృద్ధి రేటు 7 శాతానికి
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది దేశ ఆర్థికాభివృద్ధిరేటు 7 శాతానికి చేరుతుందని అసోచామ్ అంచనా వేసింది. 2019 ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల దృష్టితో విధానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (ఈ ఏడాది జూలై–సెప్టెంబర్)లో 6.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి, 2018 సెప్టెంబర్ నాటికి కీలకమైన 7 శాతం మార్కును చేరుకుంటుంది. ద్రవ్యోల్బణం 4–5.5 శాతం మధ్య వచ్చే ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఉండొచ్చు’’ అని అసోచామ్ రానున్న సంవత్సరంపై తన అంచనాలను నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రభుత్వ పాలసీల్లో స్థిరత్వం, మంచి వర్షాలు, పారిశ్రామిక రంగం కార్యకలాపాలు పుంజుకోవడం, స్థిరమైన విదేశీ మారకం రేట్లు తదితర అంచనాల ఆధారంగా చేసుకుని జీడీపీ 7 శాతంగా ఉంటుందని పేర్కొంటున్నట్టు తెలిపింది. రానున్న బడ్జెట్ ప్రధానంగా రైతులు, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక రంగాలను ముందుకు తీసుకెళ్లేదిగా ఉంటుందని అంచనా వేసింది. గ్రామీణ ఆర్థిక రంగంలో సంస్కరణలు లేకపోవడమే వ్యవసాయ రంగం ఒత్తిళ్లలో ఉండటానికి కారణంగా పేర్కొంది. ‘‘రాజకీయపరమైన హామీలిచ్చినప్పటికీ వ్యయసాయ ఉత్పాదక మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని ఇంత వరకు సంస్కరించలేదు. దీంతో రైతులు తమ ఉత్పత్తులను దళారులు చెప్పిన రేటుకే అమ్ముకునేలా నియంత్రిస్తోంది. వ్యవసాయ ఉత్పాదనలకు సంబంధించి రైతులు సరైన ధరలు పొందేలా దిగుమతి, ఎగుమతి విధానాలను మరోసారి సమీక్షించాలి’’ అని అసోచామ్ సూచించింది. స్టాక్ మార్కెట్లలో ఉన్న బుల్లిష్ సెంటిమెంట్ 2018లోనూ కొనసాగుతుందన్న అంచనాను ప్రకటించింది. 7.5 శాతానికి చేరుతుంది: నోమురా భారత ఆర్థిక రంగం జనవరి–మార్చి క్వార్టర్లో వేగంగా కోలుకుంటుందని, 2018 సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.5%గా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. వృద్ధి పరంగా ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్లో స్థిరీకరణ చోటు చేసుకోవచ్చని, ఆ తర్వాత జనవరి–మార్చి త్రైమాసికంలో వేగంగా పుంజుకుంటుందని తెలిపింది. రీమోనిటైజేషన్ (వ్యవస్థలో నగదు విడుదల), అంతర్జాతీయ డిమాండ్ మెరుగుపడటం ఇందుకు చోదకాలుగా నోమురా తెలిపింది. -
పరుగులు తీస్తున్న మన వృద్ధి రేటు
- కొండా వెంకట రంగారెడ్డి జయంతి వేడుకల్లో కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం 12 శాతం వృద్ధిరేటుతో పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో జరిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి 125వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ‘రాష్ట్రం సాధించకముందు ఇదే వేదికపై అనేక సార్లు మాట్లాడాను. రాష్ర్టం గురించి మనం నిన్నా, మొన్నా ఆలోచించిన విషయాలు వెంకటరంగారెడ్డిగారు యాభై ఏళ్ల క్రితమే పుస్తక రూపంలో అందించారు. అవి చదివే మేం ఉద్యమానికి సిద్ధమయ్యాం. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కన్న కల నెరవేరింది. ఇక మిగిలింది రాష్ట్ర అభివృద్ధి. ఆ కల కూడా నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేవు. తెలంగాణ రాష్ట్రం నూటికి నూరుపాళ్లు అభివృద్ధి ఫలాలు సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే రెండేళ్లలో... ‘ఏ ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడాలన్నా ఒక ఆర్థిక సంవత్సరం కొలమానంగా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుని ఈ ఏడాది మార్చి నుంచి రాష్ట్రంలో అభివృద్ధిని చూస్తే ఆశించిన స్థాయిని మించి ఉంది. ఇప్పటికే కరెంటు కోతలను పూర్తిగా నివారించగలిగాం. 2018 నాటికి 25 వేల మెగావాట్ల మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తయారు చేస్తాం. దీనికోసం ఇప్పటికే 91 వేల కోట్ల పెట్టుబడులను సమకూర్చుకున్నాం. పల్లెల్లో ప్రతిఇంటికీ నల్లా కనెక్షన్‌తో మంచినీరు ఇచ్చేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ మధ్యే బిహార్ గవర్నర్ వారి రాష్ట్ర ప్రగతి పథకాలను వివరిస్తూ మన రాష్ట్రం గురించి ప్రస్తావించారు. ఇక ప్రాజెక్టుల విషయానికొస్తే... పేరుకే గానీ మన రాష్ట్రంలోని పొలాలకు నీరు అందకుండా వాటిని డిజైన్ చేశారు. వాటిల్లో లోపాల్ని సవరించేందుకు నేనే దగ్గరుండి ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన జలవిధానాన్ని తయారు చేసే పనిలో ఉన్నాం. రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పంట పొలాలకు నీరందేలా ప్లాన్ చేస్తున్నాం. పరిశ్రమల నిర్మాణంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఏడాదికి 34 వేల కోట్ల రూపాయలతో అన్ని వర్గాల పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోంది’ అని కేసీఆర్ వివరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్‌రెడ్డి, శాసనమండలి చెర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.