న్యూఢిల్లీ: వచ్చే ఏడాది దేశ ఆర్థికాభివృద్ధిరేటు 7 శాతానికి చేరుతుందని అసోచామ్ అంచనా వేసింది. 2019 ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల దృష్టితో విధానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (ఈ ఏడాది జూలై–సెప్టెంబర్)లో 6.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి, 2018 సెప్టెంబర్ నాటికి కీలకమైన 7 శాతం మార్కును చేరుకుంటుంది.
ద్రవ్యోల్బణం 4–5.5 శాతం మధ్య వచ్చే ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఉండొచ్చు’’ అని అసోచామ్ రానున్న సంవత్సరంపై తన అంచనాలను నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రభుత్వ పాలసీల్లో స్థిరత్వం, మంచి వర్షాలు, పారిశ్రామిక రంగం కార్యకలాపాలు పుంజుకోవడం, స్థిరమైన విదేశీ మారకం రేట్లు తదితర అంచనాల ఆధారంగా చేసుకుని జీడీపీ 7 శాతంగా ఉంటుందని పేర్కొంటున్నట్టు తెలిపింది. రానున్న బడ్జెట్ ప్రధానంగా రైతులు, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక రంగాలను ముందుకు తీసుకెళ్లేదిగా ఉంటుందని అంచనా వేసింది. గ్రామీణ ఆర్థిక రంగంలో సంస్కరణలు లేకపోవడమే వ్యవసాయ రంగం ఒత్తిళ్లలో ఉండటానికి కారణంగా పేర్కొంది.
‘‘రాజకీయపరమైన హామీలిచ్చినప్పటికీ వ్యయసాయ ఉత్పాదక మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని ఇంత వరకు సంస్కరించలేదు. దీంతో రైతులు తమ ఉత్పత్తులను దళారులు చెప్పిన రేటుకే అమ్ముకునేలా నియంత్రిస్తోంది. వ్యవసాయ ఉత్పాదనలకు సంబంధించి రైతులు సరైన ధరలు పొందేలా దిగుమతి, ఎగుమతి విధానాలను మరోసారి సమీక్షించాలి’’ అని అసోచామ్ సూచించింది. స్టాక్ మార్కెట్లలో ఉన్న బుల్లిష్ సెంటిమెంట్ 2018లోనూ కొనసాగుతుందన్న అంచనాను ప్రకటించింది.
7.5 శాతానికి చేరుతుంది: నోమురా
భారత ఆర్థిక రంగం జనవరి–మార్చి క్వార్టర్లో వేగంగా కోలుకుంటుందని, 2018 సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.5%గా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నోమురా తెలిపింది. వృద్ధి పరంగా ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్‌లో స్థిరీకరణ చోటు చేసుకోవచ్చని, ఆ తర్వాత జనవరి–మార్చి త్రైమాసికంలో వేగంగా పుంజుకుంటుందని తెలిపింది. రీమోనిటైజేషన్ (వ్యవస్థలో నగదు విడుదల), అంతర్జాతీయ డిమాండ్ మెరుగుపడటం ఇందుకు చోదకాలుగా నోమురా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment