సాక్షి, అమరావతి : ప్రజల క్షేమం, ప్రజా సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనేలా పారిశ్రామికాభివృద్ధి మారిందని పేర్కొన్నారు. శనివారం "బియాండ్ ది లాక్‌డౌన్" (లాక్‌డౌన్ మరో కోణం) పేరుతో అసోచామ్ నిర్వహించిన ఆన్ లైన్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. వినూత్న సమ్మేళనానికి శ్రీకారం చుట్టిన అసోచామ్‌కు మంత్రి మేకపాటి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నమ్మకమే జీవితమని, ముందుగా కార్మిక శక్తికి విశ్వాసాన్ని కలిగిస్తామని చెప్పారు.
సౌకర్యాలతో కార్మికులకు రక్షణ, కరోనాను ఎదుర్కొంటూ ముందుకెళ్లేలా శిక్షణ ఇస్తామన్నారు. అన్ని వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తామని తెలిపారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని విషయాలపై అవగాహన కలిగిస్తామని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఆత్మస్థైర్యం కలిగించగలిగామని అన్నారు. కరోనా నేపథ్యంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ ఎమ్ఎస్ఎమ్ఈల ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎమ్ఎస్ఎమ్ఈలకు ఇప్పటికే రూ.905 కోట్ల ప్రోత్సాహక బకాయిలను చెల్లించాం. 14 రోజుల కిందటే ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి 3 నెలల కాలంలో పవర్ డిమాండ్ చార్జీలు రూ.188 కోట్లు మాఫీ చేశాం. సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమల ఆర్థిక పరిపుష్ఠి కోసం బ్యాంకుల గ్యారంటీ ద్వారా సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని రూ.200కోట్లు అందించే ఏర్పాటు చేశాం. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక పరిపుష్ఠిని పెంచాం. 2 నెలల కరోనా కాలంలోనూ ఆదర్శనీయ కార్యక్రమాలు చేపట్టాం. అమ్మఒడి, రైతు భరోసాలతో ప్రజల్లో భరోసా కలిగించాం. అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ( అపోహలకు చెక్ పెట్టిన ఏపీ సర్కార్ )
వైరస్ ఇన్ఫెక్షన్ రేటును తగ్గించగలిగాం. రెడ్ జోన్‌లో ఉన్న ప్రాంతాలను ప్రణాళికలతో గ్రీన్ జోన్‌లుగా మారుస్తున్నాం. వలసకార్మికులకు ఏ లోటు లేకుండా సొంత మనుషుల్లా చూసుకుంటున్నాం. మైళ్ల కొద్దీ నడుస్తున్న వలసకార్మికుల ఆకలితీర్చి గమ్యాలకు చేరుస్తున్నాం. అందివచ్చిన అన్ని అవకాశాలను ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంటుంది. ఐ.టీ, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజల ఇబ్బందులు తొలగిస్తాం. ఐ.టీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం, యువత భాగస్వామ్యంతో ఉరకలెత్తిస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సహించని ముఖ్యమంత్రే మా బలం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment