India Economy Likely to Grow 9% Next Fiscal: భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఢోకా ఉండబోదని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– క్రెడిట్ సూసీ అంచనావేసింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటు 10.5 శాతం వరకూ ఉండే వీలుందని పేర్కొంది. వృద్ధి అంచనా 8.4–9.5 శాతం శ్రేణిలో ఉంటుందన్న వివిధ అభిప్రాయాలు, అంచనాలకు భిన్నంగా క్రెడిట్ సూసీ విశ్లేషణ ఉండడం గమనార్హం. 2021–22లో 9.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనాకాగా, అంతర్జాతీయ రే టింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ విషయంలో ఈ అంచనా 8.4 శాతంగా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా నమోదవుతుందని స్విస్ బ్రో కరేజ్ దిగ్గజ సంస్థ పేర్కొంది. క్రెడిట్ సూసీలో ఆసియా పసిఫిక్, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ నీల కంత్ మిశ్రా విశ్లేషణల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
* ఆర్థిక వ్యవస్థ సానుకూలతలోనే కొనసాగుతుంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో దిగువ ఆదాయ ఉద్యోగాల్లో సైతం రికవరీ కొనసాగే అవకాశం ఉంది.
* ఇంధన, ముడి పదార్థాల ధరలు భారత్ ఎకానమీకి ప్రస్తుతం ఉన్న ప్రధాన సవాలు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్, బొగ్గు, ఎరువులు, పామ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ పోతే వృద్ధి వేగం మందగించే అవకాశం ఉంటుంది.
* విద్య, రవాణా, నిర్మాణ రంగం, ఆటో వంటి కొన్ని రంగాల్లో ఉపాధి కల్పన ఇంకా తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. ఆయా రంగాలు ఇంకా కోవిడ్ ముందస్తు స్థితికి చేరుకోలేదు. అయితే ఎకానమీ పూర్తిగా తెరుచుకునే క్రమంలో ఈ రంగాలూ పురోగమించే వీలుంది.
* మహమ్మారి సమయంలో మూలధన కల్పనా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వినియోగదారు వ్యయాలు పెరగడం, పటిష్ట స్థాయిలో ఈక్విటీ ఫండ్ పెరుగుదల ఈ సవాళ్ల పరిష్కారానికి దోహదపడతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ రంగం), నిర్మాణ రంగాల్లో డిమాండ్ క్రమంగా మెరుగుపడుతుండడం సానుకూలాంశాలు.
* ఇక మార్కెట్ల విషయానికి వస్తే, గ్లోబల్ ఈక్విటీల కంటే దేశంలో ప్రైస్–టూ–ఎర్నింగ్స్ (పీఈ) రేషియో ప్రీమియం 21 శాతంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చితే 72 శాతం ఇప్పటికే అధికంగా ఉంది. ఆయా అంశాలు పరిశీలిస్తే, ఈక్విటీ మార్కెట్లలో మరింత అప్‌ట్రెండ్ మరింత ఉండకపోవచ్చు. అయితే మహమ్మారి నేపథ్యంలో తీవ్రంగా పడిపోయిన మార్కెట్లకు ‘2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో సానుకూల అంచనాలు’ తిరిగి బలాన్ని ఇచ్చాయి. 2023–24లో కూడా ఇదే అంచనాల వల్ల మార్కెట్లు భారీగా పడిపోయే అవకాశాలు తక్కువే.
* దేశ స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే వృద్ధికి సానుకూలంగానే ఉన్నాయి. ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉంది. ప్రభుత్వ ఆదాయాలు మెరుగ్గా ఉండడం ఎకానమీకి కలిసి వచ్చే అంశం. విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనగలుగుతుంది.
* కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ లేదా డెల్టా వేరియంట్ యొక్క అవశేష ప్రభావం భారతదేశం కంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక
Published Fri, Dec 10 2021 3:07 PM | Last Updated on Fri, Dec 10 2021 3:29 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment