ప్రపంచంలో భారతదేశం బలీయమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అత్యధిక జీడీపీ కలిగిన దేశాలలో 10వ స్థానంలో ఉన్న భారత్ పదేళ్ళ వ్యవధిలో 5వ స్థానానికి చేరిందని కొనియాడారు. వచ్చే అయిదేళ్ళలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులు అన్న అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి
విజయసాయి రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు యావత్తు మందకొడిగా సాగుతున్న నేపధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకు పోతోందని అన్నారు. గత ఏడాది దేశ జీడీపీ భారీగా పెరిగి 7.2 శాతంగా నమోదైంది. ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్లో దేశ జీడీపీ 7.6 శాతం వృద్ధితో మార్కెట్ అంచనాలను మించిపోయిందని గుర్తు చేశారు.
పన్నుల వసూళ్ళలో గణనీయమైన వృద్ధి
పన్నుల వసూళ్ళలో నానాటికి సాధిస్తున్న గణనీయమైన వృద్ధి భారత్ ఆర్థిక పురోగతికి ఇంధనంలా మారింది. పదేళ్ళలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 160 శాతం పెరిగాయి. 2013-14 మధ్య 6.4 లక్షల కోట్ల రూపాయలు ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2022-23 నాటికి 16.6 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పన్నుల వసూళ్ళు 18 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ళు 13.3 లక్షల కోట్లు. అంటే సగటున 1.66 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్ళు జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. పన్నులు పెద్దగా పెంచకుండానే ఇంత భారీగా పన్నులు వసూళ్ళు జరగడం వెనుక ప్రభుత్వ సామర్ధ్యం, పనితీరు స్పష్టం అవుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.
డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు
డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రదేశాలను అధిగమించి భారత్ దూసుకుపోతోంది. 2022లో దేశంలో 89 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అనుసరిస్తున్న అన్ని దేశాలను కలుపుకున్నా భారత్‌లో జరిగినన్ని డిజిటల్ లావాదేవీలు జరగలేదు. అంటే ప్రపంచ దేశాలలో జరిగిన రియల్ టైం పేమెంట్లలో సగానికి పైగా భారత్‌లోనే జరిగాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
పడిపోతున్న రూపాయి మారకం విలువ
దేశ ఆర్థిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా అంతే వేగంగా పడిపోవడం పట్ల విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో ఆసియా కరెన్సీలోకెల్లా మారకం విలువలో తీవ్ర ఒడిదుకులకు లోనైన కరెన్సీ రూపాయి. మొదటిసారిగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 రూపాయలు దాటేసింది.
ప్రస్తుతం ఒక డాలర్‌కు రూపాయి విలువ 83 రూపాయల 40 పైసలకు చేరిందని అన్నారు. గడిచిన అయిదేళ్ళుగా రూపాయి మారకం విలువ ఇలా క్షీణిస్తూనే ఉంది. ముడి సరుకులు, ఆయిల్ దిగుమతులపై భారత్ భారీగా ఆధారపడినందున దీని ప్రభావం దేశంలోని ఉత్పాదక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. రూపాయి మారక విలువ క్షీణత ప్రభావంతో ఉత్పాదక రంగం తీవ్ర ఒడిదుకులను ఎదుర్కొంటోంది.
రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం రూపాయి మారక విలువ క్షీణతతో ద్రవ్యోల్బణం 15 బేసిస్ పాయింట్లు పెరిగి సామాన్యుడిపై మరింత భారం పడింది. విదేశి మదుపుదార్లు భారత మార్కెట్ల నుంచి 18 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యంలో భారత మార్కెట్ల నుంచి విదేశి మదుపుదార్లు వెనక్కి తీసున్న మొత్తం 12 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే రూపాయి మారక విలువ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం చూపగలదో ఇంతకంటే ఉదాహరణ లేదని ఆయన అన్నారు.
ఆదాయం, సంపద మధ్య పెరుగుతున్న అగాధం
దేశంలోని 60 శాతం సంపద దేశ జనాభాలో కేవలం 10 శాతం మంది చేతుల్లో ఉందన్నది కఠోర వాస్తవం. జనాభాలో 50 శాతం ప్రజల చేతుల్లో ఉన్న సంపద కేవలం 6 శాతం మాత్రమే. 2014 నుంచి తలసరి ఆదాయం రెట్టింపు అయి ఒక లక్షా 97 వేల రూపాయలకు చేరినప్పటికీ 197 దేశాల తలసరి ఆదాయంతో పోలిస్తే భారత్ 142వ స్థానంలో ఉండటం పట్ల విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశ వాణిజ్య లోటు గత అక్టోబర్‌లో రికార్డు స్థాయికి చేరింది.
చైనాతో వాణిజ్య లోటు నానాటికీ విస్తరిస్తూ ఆందోళకర స్థాయికి చేరుకుంది. 2022లో చైనాతో ఇండియా వాణిజ్య లోటు 83 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి అది 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని తగిన విధంగా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని వైఆర్‌సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment