న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, అదనపు సంస్కరణలు, మెరుగైన సాంకేతికతను అవలంభించడం వంటి చర్యలకు కేంద్రం సంపూర్ణ మద్దతును అందిస్తుందని భారత్ కార్పొరేట్ విశ్వసిస్తోంది. ఈ దన్నుతో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. డెలాయిట్ టచ్ తోహ్‌మత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీ నిర్వహించిన సీఎక్స్‌వో సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
►వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలమైన ఆర్థిక వృద్ధిని భారత్ నమోదు చేస్తుందని వ్యాపార ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంకన్నా ఎక్కువగా వృద్ధి రేటు నమోదవుతుందని 50 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఎకానమీపై పూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
►అధిక రేటును అంచనా వేస్తున్న పారిశ్రామిక రంగాలలో ఆటోమోటివ్ (50 శాతం), వినియోగం, రిటైల్ (66 శాతం), సాంకేతికత, మీడియా, టెలికమ్యూనికేషన్ (47 శాతం) శక్తి, సంబంధిత వనరులు (44 శాతం) ఉన్నాయి.
►ప్రభుత్వ కార్యక్రమాలు, పెరిగిన వాణిజ్య భాగస్వామ్యాలు, లాజిస్టిక్స్ వ్యయాల తగ్గింపు, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచే విధానాలు (తయారీలో తెలివైన ఆటోమేషన్, స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాల వైపు పెట్టుబడిని పెంచడం వంటివి) వృద్ధి ఊపును మరింత పెంచుతాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మారడం, బలమైన డిమాండ్, పట్టణీకరణ వృద్ధికి దోహదపడే ఇతర అంశాలు.
►ఆవిష్కరణలు, పరిశోధనలకు గ్లోబల్ హబ్‌గా భారతదేశం తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఉత్పాదక రంగం, సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సెమీకండక్టర్ పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని అంచనా వేస్తున్నందున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం నుండి సమగ్రమైన, దీర్ఘకాలిక పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి.
►స్థానిక కంపెనీలకు పరిశోధనా, అభివృద్ధి రంగాల్లో మద్దతు అవసరమని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. 57 శాతం మంది పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి సమర్థవంతమైన మేధో సంపత్తి హక్కుల ఫ్రేమ్‌వర్క్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇటువంటి వ్యూహాత్మక చర్యలు భారతదేశానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. హై–టెక్నాలజీ తయారీ రంగాలలో పోటీతత్వాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు.
►ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధునిక వ్యాపారానికి ఆధారం అయ్యిందని, వృద్ధికి అసాధారణ అవకాశాలను అందిస్తోందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. దాదాపు 99 శాతం మంది ఏఐ మరింత పురోగతిని ఆకాంక్షిస్తున్నారు. కాగా, 70 శాతం వినియోగ, రిటైల్ వ్యాపారాలు ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. డేటా అంశాల్లో నైతిక విధానాలను ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెబుతున్నారు.
►4.0 సాంకేతికతలను (ఏఐ, ఎంఎల్, ఎన్‌ఎల్‌పీ, కంప్యూటర్ విజన్) అమలు చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పరిశ్రమ పెద్దలు అంచనా వేస్తున్నారు, దానితో పాటు మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో నిరంతర ప్రయత్నాలతో పాటు, ముఖ్యంగా టైర్–2, 3 నగరాల్లో మానవ, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం అవసరమని అభిప్రాయపడుతున్నారు.
►భారతదేశ వృద్ధిని ప్రోత్సహించడానికి, స్థిరమైన వ్యాపార విస్తరణకు, దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పన్ను ఖచ్చితత్వం అవసరమని 80 శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు.
►భౌగోళిక ఉద్రిక్తతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో భాగంగా, జీ 20 దేశాలు సమన్వయంతో పనిచేయాలని, సరఫరాల చైన్‌ను క్రమబద్దీకరించాలని పారిశ్రామికవేత్తలు ఉద్ఘాటించారు.
►పునరుత్పాదక శక్తి ప్రాముఖ్యతను 100 శాతం మంది ఉద్ఘాటించారు. సాంకేతిక ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, పర్యావరణ– సామాజిక–కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్‌జీ)వ్యూహాలు, కార్యక్రమాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కార్పొరేట్ భావిస్తోంది.
డిజిటలైజేషన్
సాధికారతకు ప్రాధాన్యత
సవాళ్లు, అవకాశాలకు సంబంధించి సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలను మేము పరిశీలించినప్పుడు, దేశం డిజిటలైజన్ సాధికారతను సాధించాల్సిన అవశ్యత ఎంతో ఉందన్న విషయం స్పష్టమైంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించే బాటలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, తద్వారా ప్రపంచ వేదికపై భారత్ చెరగని ముద్ర వేయడానికి సంయుక్తగా, వ్యూహాత్మకంగా, సాంకేతికంగా తగిన చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాము.
– సంజయ్ కుమార్,
డెలాయిట్ ఇండియా
ప్రస్తుతం ఐదవ స్థానంలో..
1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురో గతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment