పరుగులు తీస్తున్న మన వృద్ధి రేటు
- కొండా వెంకట రంగారెడ్డి జయంతి వేడుకల్లో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం 12 శాతం వృద్ధిరేటుతో పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో జరిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి 125వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ‘రాష్ట్రం సాధించకముందు ఇదే వేదికపై అనేక సార్లు మాట్లాడాను. రాష్ర్టం గురించి మనం నిన్నా, మొన్నా ఆలోచించిన విషయాలు వెంకటరంగారెడ్డిగారు యాభై ఏళ్ల క్రితమే పుస్తక రూపంలో అందించారు. అవి చదివే మేం ఉద్యమానికి సిద్ధమయ్యాం. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కన్న కల నెరవేరింది. ఇక మిగిలింది రాష్ట్ర అభివృద్ధి. ఆ కల కూడా నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేవు. తెలంగాణ రాష్ట్రం నూటికి నూరుపాళ్లు అభివృద్ధి ఫలాలు సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని ముఖ్యమంత్రి అన్నారు.
రాబోయే రెండేళ్లలో...
‘ఏ ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడాలన్నా ఒక ఆర్థిక సంవత్సరం కొలమానంగా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుని ఈ ఏడాది మార్చి నుంచి రాష్ట్రంలో అభివృద్ధిని చూస్తే ఆశించిన స్థాయిని మించి ఉంది. ఇప్పటికే కరెంటు కోతలను పూర్తిగా నివారించగలిగాం. 2018 నాటికి 25 వేల మెగావాట్ల మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తయారు చేస్తాం. దీనికోసం ఇప్పటికే 91 వేల కోట్ల పెట్టుబడులను సమకూర్చుకున్నాం. పల్లెల్లో ప్రతిఇంటికీ నల్లా కనెక్షన్‌తో మంచినీరు ఇచ్చేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ మధ్యే బిహార్ గవర్నర్ వారి రాష్ట్ర ప్రగతి పథకాలను వివరిస్తూ మన రాష్ట్రం గురించి ప్రస్తావించారు.
ఇక ప్రాజెక్టుల విషయానికొస్తే... పేరుకే గానీ మన రాష్ట్రంలోని పొలాలకు నీరు అందకుండా వాటిని డిజైన్ చేశారు. వాటిల్లో లోపాల్ని సవరించేందుకు నేనే దగ్గరుండి ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన జలవిధానాన్ని తయారు చేసే పనిలో ఉన్నాం. రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పంట పొలాలకు నీరందేలా ప్లాన్ చేస్తున్నాం. పరిశ్రమల నిర్మాణంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఏడాదికి 34 వేల కోట్ల రూపాయలతో అన్ని వర్గాల పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోంది’ అని కేసీఆర్ వివరించారు.
కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్‌రెడ్డి, శాసనమండలి చెర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.