జపాన్ దేశ ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆర్థికవ్యవస్థలో మలుపుల కారణంగా అక్కడి నగరాల్లో మూడొంతుల జనాభా నివసిస్తోంది. దాంతో ఆ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. దానికి సమీపంలోని మరో ఆధునిక ఆర్థికవ్యవస్థ దక్షిణ కొరియాలో జనాభా పెరుగుదల రేటు రోజురోజుకు తగ్గిపోతుండడంతో అక్కడ సంతాన సాఫల్య రేటును పెంచడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
‘మినిస్ట్రీ ఆఫ్ లో బర్త్ రేట్ కౌంటర్ ప్లానింగ్’ అనే పేరుతో దేశంలో జనాభా పెంచడానికి మార్గాలు ఆలోచించి, వాటిని అమలు చేసే శాఖను ఏర్పాటు చేయడానికి పార్లమెంటు అనుమతి కోరనున్నట్టు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెవల్ గురువారం ఓ టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు. గత 65 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాలుగా ఎదిగిన జపాన్, దక్షిణ కొరియాను ఒకేరకమైన ప్రత్యేక సమస్యలు పీడిస్తున్నాయి. జపాన్ నేడు 5 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉంది. 20 అగ్రస్థాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దక్షిణ కొరియా 14వ స్థానంలో, ఆసియాలో నాలుగో ర్యాంకులో ఉంది. ఆశించిన స్థాయిలో జనాభా పెరుగుదలకు కీలకమైన సంతాన సాఫల్య రేటు (ఫెర్టిలిటీ రేటు) బాగా తగ్గిపోవడం ఈ రెండు దేశాలను సంక్షోభాల వైపునకు నడిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెప్పుకోదగ్గ ఆర్థికాభివృద్ధి సాధించిన జపాన్, దక్షిణ కొరియాలతోపాటు ఆర్థికవ్యవస్థలో వేగంగా దూసుకుపోతున్న చైనాలో కూడా సంతాన సాఫల్య రేటు ఘననీయంగా తగ్గిపోవడం అక్కడ పాలకులను ఆందోళన కలిగిస్తోంది.
ఈ ప్రమాదం ఇండియాకు ఉందా..?
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా ఈ ఏడాది కొత్త రికార్డును సొంతం చేసుకుంది. భారత్‌లోనూ భవిష్యత్తులో సంతాన సాఫల్య రేటు కాస్త ఆందోళన కలిగించే స్థాయికి చేరే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ దేశంలోనైనా పనిచేసే వయసు కలిగిన ప్రజలు (వర్కింగ్ ఏజ్ పీపుల్) సరిపడా ఉండి, దానికి ఇతర కారణాలుతోడైతే ఆ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోంది. ఇతర కారణాలు బాగున్నా వర్కింగ్ ఏజ్ ప్రజలు సరిపడా లేకపోతే సమస్యలు తప్పవు. పారిశ్రామికాభివృద్ధి సాధించిన అనేక యూరప్ దేశాలకు ఇదే ప్రధాన సమస్య. యువ జనాభా బాగా తగ్గిపోవడం పాశ్చాత్య దేశాలకు చాలా ఏళ్ల కిందటి నుంచే పెద్ద ఇబ్బందిగా మారింది. కానీ, ఇతర దేశాలకు చెందిన నిపుణులు అక్కడకు వలస వెళ్లి స్థిరపడేలా వీలు కల్పించే విధానాలున్నాయి. దాంతో అమెరికా వంటి దేశాలకు ఇది అసలు ఆలోచించాల్సిన అంశమే కాదు.
కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కూడా సంతాన సాఫల్య రేటు ఆందోళన కలిగించేలా ఉన్నా వలస వచ్చి స్థిరపడుతున్న ప్రజలవల్ల ఈ సమస్యకు కొంత ఉపశమనం కలుగుతోంది. ఇలాంటి విధానాలు లేని జపాన్, దక్షిణ కొరియాకు ఇబ్బందులు తప్పడంలేదు. విదేశీ వర్కర్లు, ఉద్యోగుల వలసలను కఠినతరం చేసే పాలసీలు ఈ రెండు రాజ్యాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాగైనా వర్కింగ్ ఏజ్ జనాభా సరిపడా ఉండేలా ప్రభుత్వాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తు బంగారు బాట అవుతుంది.
- విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment