దేశంలో అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’ విధించాలంటే మీరేమంటారు..‘మంచిదేకదా డబ్బు ఉన్నవారి నుంచే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సరైందే’నని మద్దతు ఇస్తారా..? త్వరలో ఈ అంశంపై స్పష్టత రానుంది. వచ్చే నెలలో జీ20 కూటమి దేశాల ఆర్థిక మంత్రులు సమావేశం కానున్నారు. అందులో కోటీశ్వరుల ఆదాయంపై విధించే ‘సంపద పన్ను’పై చర్చించడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీ20 సభ్యదేశాల్లోని 68 శాతం మంది సంపద పన్ను ప్రతిపాదనకు మద్దతిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. భారత్‌లో ఏకంగా 74 శాతం మంది దీనిపై సానుకూలంగా స్పందించారు.
ఎర్త్4ఆల్, గ్లోబల్ కామన్స్ అలయన్స్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. జీ20 సభ్యదేశాల్లోని దాదాపు 22,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. అత్యంత సంపన్నులపై విధించే ఈ పన్నుకు సంబంధించిన ప్రతిపాదన 2013 నుంచి చర్చలో ఉంది. ప్రస్తుతం జీ20 కూటమికి బ్రెజిల్ అధ్యక్షత వహిస్తోంది. ఈ కూటమి సంపద పన్నుపై ఏకాభిప్రాయానికి కృషి చేస్తోంది. జులైలో జరిగే ఆర్థిక మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడేలా ప్రయత్నిస్తోంది.
సర్వేలోని వివరాల ప్రకారం..భారతీయుల్లో చాలామంది వాతావరణ మార్పులు, ప్రకృతి సంరక్షణకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంపన్నులపై విధించే పన్నును అందుకోసం ఉపయోగించాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ సమస్యల్లో కర్బన ఉద్గారాల నివారణకు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు ఈ పన్నును వినియోగించాలని 74 శాతం మంది చెప్పారు. మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ఉపయోగించాలని 76 శాతం మంది తెలిపారు. విద్యుదుత్పత్తి, రవాణా, నిర్మాణం, పరిశ్రమలు, ఆహారం ఇలా అన్నిరంగాల్లో మార్పులు చేసేలా సంపద పన్నును వెచ్చించాలని 68 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
ఈ ప్రతిపాదనలో కీలకపాత్ర పోషిస్తున్న ఫ్రెంచ్ ఆర్థికవేత్త గాబ్రియేల్ జుక్మాన్ మాట్లాడుతూ..‘సాధారణ ప్రజలతో పోలిస్తే సంపన్నులు చాలా తక్కువ పన్ను చెల్లిస్తారు. సంపద పన్ను వల్ల అంతర్జాతీయంగా ఓ ప్రమాణం ఏర్పడుతుంది. ప్రతి దేశంలోని బిలియనీర్లు తమ సంపదలో కనీసం 2 శాతం వార్షికంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆకలి, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు వంటి సమస్యల పరిష్కారానికి సందప పన్ను సరైంది’ అని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment