సెన్స్‌క్స్‌ డౌట్‌! | Lok Sabha Election 2024: Foreign equity investors turn to hedging on India election jitters | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: సెన్స్‌క్స్‌ డౌట్‌!

Published Thu, May 16 2024 4:26 AM | Last Updated on Thu, May 16 2024 7:41 AM

Lok Sabha Election 2024: Foreign equity investors turn to hedging on India election jitters

ఓటింగ్‌ తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లలో అలజడి 

బీజేపీకి ఈసారి సీట్లు భారీగా తగ్గొచ్చనే అంచనాలు 

సొంతంగా మేజిక్‌ ఫిగర్‌ను సాధిస్తుందా అన్న ఆందోళన 

విదేశీ ఇన్వెస్టర్ల రివర్స్‌ గేర్, నెలలో రూ.30 వేల కోట్లు వెనక్కి 

ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ 3 శాతం మేర డౌన్‌ 

ఫలితాల వరకూ ఒడిదుడుకులు ఉండొచ్చంటున్న విశ్లేషకులు

మళ్లీ వచ్చేది మోదీయే... ఈసారి ఎన్డీయే కూటమికి 400 పై చిలుకు సీట్లు పక్కా... బీజేపీకి కనీసం 370 సీట్లు ఖాయం... కమలనాథుల అంచనాలివి! తీరా ఎన్నికలు మొదలై ఒక్కో విడత పోలింగ్‌ ముగుస్తున్నకొద్దీ ఈ ఉత్సాహం మెల్లమెల్లగా నీరుగారుతోంది. నాలుగు విడతల్లోనూ పోలింగ్‌ గత ఎన్నికలతో పోలిస్తే తగ్గడంతో అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. 

ఇదే మూడ్‌ స్టాక్‌ మార్కెట్లోనూ ప్రతిబింబిస్తోంది. ఓటింగ్‌ తగ్గడంతో బీజేపీ సొంతంగా మేజిక్‌ ఫిగర్‌ను అందుకుంటుందో లేదోనన్న అనుమానాలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం దెబ్బతింది. 

రోజుకో కొత్త రికార్డులతో రంకెలేసిన బుల్‌ ఒక్కసారిగా రివర్స్‌ గేర్‌ వేసింది. ఎన్నికల ‘వేడి’కి తికమకపడుతోంది. నిన్నమొన్నటిదాకా పెట్టుబడుల వరద పారించిన విదేశీ ఇన్వెస్టర్లు పొలోమంటూ అమ్మకాలకు తెగబడుతున్నారు. అయి తే ఫలితాలపై అనిశ్చితి వల్లే సెంటిమెంట్‌పై ప్రభావం పడుతోందని, బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇన్వెస్టర్లు తరలివస్తారని నిపుణులు పేర్కొంటున్నారు... 
 

స్టాక్‌ మార్కెట్లో ఈసారి ఎన్నికల ముందస్తు ర్యాలీతో రికార్డుల మోత మోగింది. మోదీ 3.0పై నమ్మకానికి తోడు ఎన్డీయే సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే, ఎన్నికల ‘వేడి’ జోరందుకుని, పోలింగ్‌ మొదలయ్యాక ఇన్వెస్టర్లలో నెమ్మదిగా నమ్మకం సడలుతూ వస్తోంది. ఇప్పటిదాకా పోలింగ్‌ పూర్తయిన నాలుగు విడతల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతం తగ్గడం దీనికి ఆజ్యం పోసింది.

 మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటి కారణాలు ఎన్నున్నా ... ఓటింగ్‌ పడిపోవడంతో ఫలితాల్లో బీజేపీ బంపర్‌ విక్టరీపై అనుమానాలు ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవలే సెన్సెక్స్‌ (75,111 పాయింట్లు), నిఫ్టీ (22,795 పాయింట్లు) కొత్త ఆల్‌టైం గరిష్టాలను తాకిన తర్వాత భారీగానే క్షీణించాయి. గడచిన నెల రోజుల్లో సూచీలు దాదాపు 3 శాతం పైగానే పడటం దీనికి అద్దం పడుతోంది. 

గత ఎన్నికల్లో తొలి విడతల్లో పోలింగ్‌ తగ్గినా, క్రమంగా పుంజుకుంది. దాంతో మొత్తమ్మీద రికార్డు స్థాయిలో 67.4 శాతం ఓటింగ్‌ జరిగింది. బీజేపీ సొంత బలం కూడా 282 నుంచి 303 లోక్‌సభ స్థానాలకు ఎగబాకింది. ఈసారి మాత్రం తొలి విడత నుంచే ఓటింగ్‌ క్రమంగా తగ్గముఖం పడుతూ వస్తోంది. మిగతా 3 విడతల్లోనూ ఇలాగే మందకొడిగా జరిగితే మొత్తం ఓటింగ్‌ గతం కంటే 2 నుంచి 3 శాతం            తగ్గేలా కని్పస్తోంది.

విదేశీ ఇన్వెస్టర్లు పీఛే ముడ్‌... 
ఓటింగ్‌ శాతం తగ్గుతుండటం, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)లో కూడా ఆందోళన మొదలైంది. మన ఈక్విటీ మార్కెట్లలో గత నెలన్నరలో రూ.30 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మేయడం దీనికి నిదర్శనం. మార్కెట్లు భారీగా పడటానికి ఎఫ్‌పీఐల విక్రయాలే కీలకంగా నిలుస్తున్నాయి. 

2023లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఏకంగా రూ.1.77 లక్షల కోట్లను దేశీ మార్కెట్లో కుమ్మరించి రికార్డులు బద్దలుకొట్టారు. అంతేకాదు, ఇందులో దాదాపు మూడో వంతు (రూ.58 వేల కోట్లు) ఒక్క డిసెంబర్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం విశేషం. దీనికి తోడు దేశీ ఇన్వెస్టర్లు, ఫండ్స్‌ జోరుతో బుల్‌ రంకెలేసింది. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీ 20 శాతం రాబడులు అందించాయి. 

కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పుంజుకోవడం, ప్రభుత్వ పెట్టుబడుల జోరు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం, వృద్ధి రేటు పుంజుకోవడం, సుస్థిర ప్రభుత్వం, స్థిరమైన పాలసీలు తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌ ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే, 2014లో ఎన్నికలు జరిగిన ఏప్రిల్‌–మే నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.23,607 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. 

2019 ఇదే కాలంలో రూ.29,113 కోట్లు దేశీ మార్కెట్లో కుమ్మరించారు. దీంతో 2019లో నాలుగో దశ పోలింగ్‌ ముగిసే నాటికి నెల రోజుల్లో సెన్సెక్స్‌ 3.7 శాతం, నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగబాకాయి. ఈసారి మాత్రం ట్రెండ్‌ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తిరోగమన బాట పట్టగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది.

విదేశీ మార్కెట్లు రయ్‌ రయ్‌ 
ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతల వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావం కంటే, ఎన్నికల ప్రభావమే మన మార్కెట్లో ప్రధానంగా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లు గత నెల రోజుల్లో భారీగా పెరిగినప్పటికీ.. మన సూచీలు ఆ స్థాయిలో పెరగకపోగా, 3 శాతం మేర పడిపోవడం దీనికి నిదర్శనం. గత నెల రోజుల వ్యవధిలో హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ ఏకంగా 15.2 శాతం జంప్‌ చేసింది.

 బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ సూచీ 6 శాతం, యూఎస్‌ డోజోన్స్‌ 4.7 శాతం, జర్మనీ డాక్స్‌ సూచీ 4.1 శాతం, చైనా షాంఘై ఇండెక్స్‌ 3 శాతం చొప్పున ఎగబాకాయి. ‘‘ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. ఓటింగ్‌ శాతం భారీగా తగ్గితే, బీజేపీ అంచనాలు తారుమారు కావచ్చు. ఆ పార్టీ సాధించే సీట్లు గణనీయంగా తగ్గే అవకాశముంది. మిగతా విడతల ఓటింగ్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. తదనుగుణంగానే మార్కెట్ల గమనం ఉంటుంది’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.

    ఎందుకీ ఆందోళన...
బీజేపీకి గనుక సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏ పక్షాలపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల డిమాండ్‌లకు తలొగ్గడం, బుజ్జగింపులు తదితరాలతో విధాన నిర్ణయాలపై ప్రభావం పడుతుందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇప్పుడున్న స్వేచ్ఛ లేకపోవడం కూడా అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు మార్కెట్లకు ప్రతికూలాంశం. 

చివరి మూడు విడతల్లో భారీగా ఓటర్లు పోటెత్తితే తప్ప ప్రస్తుత ఓటింగ్‌ శాతం ప్రకారం చూస్తే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏ కూటమికి 400 పై చిలుకు సీట్ల లక్ష్యం నెరవేరే అవకాశాలు లేనట్టే. అంతేగాక గతంలో మాదిరిగానైనా రాకుండా బీజేపీ ఏ 260 సీట్ల దగ్గరో ఆగిపోతే మళ్లీ సంకీర్ణ లుకలుకలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇవన్నీ మార్కెట్లకు రుచించని విషయాలే. విదేశీ ఇన్వెస్టర్లలో ఇలాంటి భయాలే నెలకొన్నాయిప్పుడు! అందుకే ప్రస్తుతానికి కొన్ని పొజిషన్లను తగ్గించుకుని, ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి మళ్లీ ఇన్వెస్ట్‌ చేయొచ్చనే భావన వారిలో కనబడుతోందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు.

 సూచీల తాజా పతనంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సైతం స్పందించారంటే, ఇన్వెస్టర్లలో ఆందోళన అధికార పక్షాన్ని కూడా బాగానే కలవరపెడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ‘గతంలో కూడా మార్కెట్లు గట్టిగా పడిన సందర్భాలున్నాయి. కాబట్టి స్టాక్‌ మార్కెట్‌ కదలికలను నేరుగా ఎన్నికలకు ముడిపెట్టకూడదు. తాజా ఒడిదుడుకులకు ‘కొన్ని వదంతులు’ ఆజ్యం పోసి ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం జూన్‌ 4కు ముందే షేర్లు కొనుక్కోండి. ఫలితాల తర్వాత మార్కెట్‌ దూసుకెళ్తుంది’ అని             అమిత్‌ షా తాజాగా వ్యాఖ్యానించారు.

2004లో 20% క్రాష్‌
ఎన్నికల ముందస్తు పరిస్థితులతో సంబంధం లేకుండా గత నాలుగు ఎన్నికల్లోనూ ఫలితాల తర్వాత సెస్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలనే అందించాయి. అయితే 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి సర్కారు అనూహ్య ఓటమి చవిచూడటం, హంగ్‌ కారణంగా ఫలితాల తర్వాత 20 శాతం మార్కెట్‌ క్రాష్‌ అయింది! కానీ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వం కొలువుదీరాక మార్కెట్‌ విశ్వాసం పుంజుకుంది.

 మిగతా ఏడాది కాలంలో రాబడులు దండిగానే వచ్చాయి. 2009 ఫలితాల తర్వాత మే 18 నుంచి డిసెంబర్‌ వరకు 31 వరకు సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 40 శాతం దూసుకెళ్లడం విశేషం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు జోరుకు తోడు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వరద, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాలో సహాయక ప్యాకేజీలు కూడా దోహదం చేశాయి. 2019 ఎన్నికల తర్వాత మాత్రం మార్కెట్లు ఏమంత పెద్దగా పెరగలేదు. ప్రపంచ మార్కెట్లలో అనిశి్చతి, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, బలహీన వృద్ధి రేటు వంటి ప్రభావాలతో 4 నుంచి 5 శాతం మాత్రమే        రాబడులొచ్చాయి.  

అధికార పక్షం గెలుపు అంచనాలు తప్పొచ్చనే ఆందోళనల వల్లే దేశీ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీట్లు భారీగా తగ్గినా, సొంతంగా మెజారిటీ రాకపోయినా, ఫలితాల రోజున మార్కెట్‌ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉండొచ్చు. ఫలితా లొచ్చేదాకా∙ఇదే అలజడి ఉంటుంది
– మాధవీ అరోరా, ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ముఖ్య ఆర్థికవేత్త

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement