నా క్లాక్ మారలేదు...వాక్ మారలేదు..! | My clock has changed ... Walk unchanged ..! | Sakshi
Sakshi News home page

నా క్లాక్ మారలేదు...వాక్ మారలేదు..!

Published Sun, Feb 1 2015 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

నా క్లాక్ మారలేదు...వాక్ మారలేదు..!

నా క్లాక్ మారలేదు...వాక్ మారలేదు..!

అవిశ్రాంతం
అరవై తర్వాత

‘బాల నటుడిగా సినిమా తెర మీద నటించిన దానికంటే ఎక్కువగా జీవితంలో నటించాను’ - ఇంత నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన వ్యక్తి మోహన్‌కందా. 1968 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఎస్ అధికారికి ఇప్పుడు 69 ఏళ్లు. సమైక్యాంధ్రప్రదేశ్‌కి చీఫ్ సెక్రటరీ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ‘ఉద్యోగ విరమణ’ తర్వాత జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం, దినచర్య వివరాలు ఆయన మాటల్లోనే...
 
ఉద్యోగంలో ఉన్నప్పుడు- విరమణ తర్వాత, దేశంలో ఉన్నప్పుడు - విదేశాల్లో ఉన్నప్పుడు, శీతాకాలం- ఎండాకాలం అనే తేడాలేవీ నా వ్యక్తిగత దైనందిన జీవితంలో కనిపించవు. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవడం, వ్యాయామం, స్నానం, పూజ, బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే సమయాల వరకు ఎటువంటి మార్పు లేదు. అప్పట్లోలా ఆలస్యం అవుతుందేమోననే ఆందోళన లేకపోయినప్పటికీ సమయం మునుపటికంటే మించడం లేదు. నా క్లాక్ అలా సెట్ అయిపోయినట్లుంది. ఈ రోజంతా ఖాళీ అనే పరిస్థితి ఇంతవరకు  నేను రానివ్వలేదు.

ఇప్పుడు కూడా నాకిష్టమైన పనులతో రోజంతా తీరికలేకుండా గడుపుతున్నాను. ఉద్యోగంలో ఉన్నప్పటిలాగానే దేహాన్ని, మెదడుని ఖాళీగా ఉంచడం లేదు. ప్రయాణానికి రెలైక్కేటప్పుడే గమ్యం చేరాక రైలు దిగాలని మనకు తెలుసు. ఉద్యోగ విరమణ కూడా అలాంటిదే. రైలు దిగిన తర్వాత మనం నిర్దేశించుకున్న పనులు చక్కబెట్టుకున్నట్లే ఉద్యోగ విరమణ తరువాత చేయాలనుకున్న పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి.
 
ఇప్పటి పని నా నిర్ణయమే...
ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలో నా ప్రమేయం లేకుండానే నిర్ణయమై ఉంటాయి. వాటిని అమలు చేయడం, ఆచరణలో నేర్పరితనంతో నాకంటూ ఒక తరహా పనితీరును వ్యక్తం చేయడమే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం నేను రోజుకు ఒక గంట బ్రిడ్జి గేమ్ మీద పుస్తకాలతో గడుపుతాను. నాకిష్టమైన కాస్మాలజీ అధ్యయనంలో మునిగిపోతాను.

అలాగే నాకు ఇష్టమైనవి, ఉద్యోగంలో ఉన్నప్పుడు చదవడానికి సమయం చాలక పక్కన పెట్టిన ఐన్‌స్టీ పరిశోధన ... ‘గాడ్స్ ఓన్ ఈక్వేషన్’ నంబర్ థియరీలో అద్భుతమైన సమీకరణం మీద రాసిన... ఫెర్మాస్ లాస్ట్ థీరమ్’ వంటి పాతిక పుస్తకాలు చదివాను. అలాగే నాకు తెలుసుకోవాలని ఉన్న ప్రతి అంశాన్నీ విస్తృతంగా తెలుసుకుంటూ, ఆ విజ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నాను. గతంలో నేను ‘ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్’ అంశం మీద సివిల్స్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాణ్ణి. ప్రతి క్లాసుకీ తగినంత విషయసేకరణకు చాలా శ్రమించి క్రోడీకరించాను.

ఆ తర్వాత దానిని ఓ పుస్తకంగా తెస్తే చాలా మందికి అందుబాటులోకి వస్తుందని పుస్తకం రాశాను. సహకార వ్యవస్థ మీద ఓ పుస్తకం రాశాను. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మీద రాస్తున్నాను. ప్రస్తుతం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కార్యాలయానికి, వ్యవసాయరంగంలోనూ, పాలనలోనూ, విపత్తుల నిర్వహణలోనూ,  అవసరమైన కార్యాచరణ మీద కొత్త ఆలోచనలను పంపిస్తున్నాను. నా జీవితంలోని కీలకమైన సంఘటనలను, ఉద్యోగ జీవితాన్ని ‘మోహన మకరందం’ పేరుతో రాశాను. రిటైరయిన తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలో ఐదేళ్లపాటు సభ్యుడిగా చేశాను.
 
ప్రతిదీ సాధ్యమే!
మనిషి జీవితంలో ఫలానా పని అసాధ్యం అని ఏదీ ఉండదు. తప్పనిసరి అంటే చేసి తీరుతారెవరైనా. చేయకపోయినా ఫరవాలేదనుకుంటే చేయరు. నా మట్టుకు ఇంత వరకు అసాధ్యం అని వదిలేసిన పని ఒక్కటీ లేదు. ఎవరికైనా సరే ‘ఏమి’ చేయాలనే విషయంలో స్పష్టత వస్తే ‘ఎలా’ చేయాలనే ప్రణాళిక దానంతట అదే వస్తుంది. ఏం చేయాలన్నది తెలియకే చాలా మంది అయోమయంలో ఉంటారు. ముఖ్యంగా పదవీవిరమణ తర్వాత జీవితాన్ని ఎలా గడపాలంటూ ఆందోళన పడుతుంటారు. పైగా ప్రసారమాధ్యమాల్లో కూడా ‘విశ్రాంత’ అనే పదం వాడుతుంటారు. ఆ పదంతోనే చాలా మంది ఇక చేయాల్సిందేమీ లేదనే భావనలోకి వచ్చేస్తున్నారు.

ఇది విశ్రాంత జీవనం కాదు, ఉద్యోగ విరమణ తర్వాత జీవితం. ఉద్యోగానికి ముందు ఆనందంగా జీవించలేదా? ఉద్యోగ విరమణ తర్వాత కూడా అంతే! తేడా అంతా ఉద్యోగానికి ముందు జీవితం నేర్చుకోవడానికి వినియోగిస్తాం, ఉద్యోగ విరమణ తర్వాత నేర్చుకున్న అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని మేళవించి చక్కటి వ్యాపకాలను నిర్దేశించుకుంటాం. నేనదే చేస్తున్నాను.
 ప్రణాళిక ఉండాలి!
 
పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా ప్రతి దానికీ ఓ ప్రణాళిక పెట్టుకుంటాం. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికీ ఓ ప్రణాళిక ఉండాల్సిందే. జీవితంలో మన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో దేనిని ఎంచుకోవాలనే పరిణతి ఈ వయసుకి వచ్చి తీరాలి. ఇన్నేళ్ల అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, శక్తిని కలిపి మనం ఏం చేయగలమో దానిని ఎంచుకునే అవకాశం ఎప్పుడూ మన ముందు ఉంటుంది. దానినే పట్టుకుని ముందుకు పోవాలి తప్ప... దారీ తెన్నూ లేకుండా పోకూడదు.
 
ఒక్కో సి.ఎం. ఒక్కో తీరు...
నా సర్వీస్‌లో ఎందరో సీఎంల దగ్గర పనిచేశాను. నా పని తీరుతో వారికి ఇబ్బంది కలగనివ్వలేదు. నా చుట్టుపక్కల అందరినీ సౌకర్యంగా ఉండేటట్లు చూడడంలో సఫలమయ్యాను. అలాగే ఇంట్లో కూడా. నా భార్య ఉషకు, కానీ పిల్లలకు కానీ నా మీద పెద్ద కంప్లయింట్లు ఉండవు. నేను నిద్రపోయేటప్పుడు నా కోసం వచ్చిన ఫోన్‌కాల్స్‌కు జవాబు చెప్పాల్సి రావడాన్ని మాత్రం మా ఆవిడ దెప్పుతూ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి నుంచి తెల్లవారు జామున కాల్స్ వచ్చేవి, ఒక ముఖ్యమంత్రి నుంచి అర్ధరాత్రి వరకు కాల్స్ వస్తూ ఉండేవి. నన్ను నిద్రలేపకుండా వాటిని బదులు చెప్పడం కోసం తన నిద్ర పాడయ్యేదని ఉష ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది.  
 
ఉద్యోగ జీవితంలో నన్ను ఆదేశించే పై అధికారులు, అమాత్యులను నొప్పించకుండా నేను నొచ్చుకోకుండా మెలిగాను. వృత్తిపరమైన ఆదేశాలను ఎంత నిబద్ధతతో అమలు చేశానో, వ్యక్తిగత ఆదేశాలను అంతే సున్నితంగా తోసివేస్తూ వెన్ను వంచకుండా నా వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నాను.  ‘నేను’ అంటే మోహన్ కందా అని మర్చిపోకుండా జీవించాను, జీవిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement