Mohan Kanda
-
ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్ ఫార్మింగ్)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్(పైపులరోడ్డు)లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్ ఫార్మింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
గ్రామీణ విద్యార్థుల సామాజిక ‘వారధి’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ విద్యార్థుల సామాజిక వికాసమే లక్ష్యంగా తాము ‘వారధి ఫౌండేషన్’ నెలకొల్పినట్లు ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందా అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా వారధి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతో న్న ప్రతిభావంతులైన గ్రామీణ, గిరిజన విద్యార్థుల్లో సామాజిక స్పృహ, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ, ఏపీలోని 12 జిల్లాల్లో 41 కేంద్రాల ద్వారా వ్యాసరచన, ప్రసంగ పోటీలు నిర్వహిం చి విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతున్నామని పేర్కొన్నారు. విజేతలకు సెప్టెంబర్ 30న రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, సంయుక్త కార్యదర్శి భుజంగరావు పాల్గొన్నారు. ఆసక్తిగల వారు 9676099933, 9849588555 లను సంప్రదించవచ్చని సూచించారు. -
కందాతో ఒరేయ్ అని పిలిపించుకోవడం ఇష్టం
► గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య ► కందా రాసిన ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబెల్స్’ పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా నిజమైన కర్మయోగి అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. సివిల్ సర్వెంట్‌గా తన జీవితంలో ఎదురైన అనుభవాలతో కందా రాసిన ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబ్బెల్స్’ పుస్తకాన్ని మంగళవారమిక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)లో గవర్నర్ ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోహన్ కందా, తాను సివిల్ సర్వీసెస్‌లో(1968) ఒకే బ్యాచ్‌కు చెందిన వారమని చెప్పారు. మోహన్ కందా సబ్ కలెక్టర్‌గా, తాను ఎస్పీగా ఒంగోలు జిల్లాలో కలిసి పనిచేసి ఎన్నో సమస్యలను సమన్వయంగా పరిష్కరించామన్నారు. జ్ఞానీ జైల్‌సింగ్ నుంచి అబ్దుల్ కలాం వరకు విభిన్నమైన వ్యక్తిత్వం, లక్షణాలు కలిగిన పలువురు నాయకుల వద్ద పనిచేసిన మోహన్ కందా వారందరి మన్ననలు పొందారన్నారు. ‘‘మోహన్ తో గౌరవనీయ గవర్నర్ అని కాకుండా.. అప్పటిలాగే ఒరేయ్ వినరా.. ఒరేయ్ ఉండరా.. అని పిలిపించుకోవడమే నాకు సంతోషంగా ఉంటుంది. మోహన్ వ్యవసాయంపైనా విశేషమైన పట్టు సాధించారు. ఏదైనా విషయాన్ని ఇతరులకు వివరించేటపుడు ఒక కథతో మొదలెట్టడం మోహన్ లో అందరికీ బాగా నచ్చే విషయం. మా ఇద్దరికీ పొగడ్తలంటే ఇష్టం ఉండదు. పుస్తకావిష్కరణలో ఏమని పొగడాలో చెప్పమని అడిగితే.. ‘పొగిడేందుకు ఏమీ లేదు’ అని మోహన్ చెప్పారు’’ అని గవర్నర్ అన్నారు. కనీస అవసరాలపై దృష్టి ఏదీ: కందా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న నేతలందరూ తనకంటే చిన్నవారేనని, నేతలంతా పెద్ద ఆలోచనలు చేస్తేనే గొప్ప పనులు సాధ్యమవుతాయని మోహన్ కందా అన్నారు. పెద్దపెద్ద ప్రాజెక్ట్‌లు, రాజధాని నగరాలను నిర్మిస్తామని చెబుతున్న నాయకులు.. ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఏర్పాటై రెండున్నరేళ్లు గడిచినందున మరో రెండున్నరేళ్లలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు, పసిపిల్లలకు పౌష్టికాహారం, మహిళలకు భద్రత, ప్రజారోగ్యం.. తదితర సదుపాయాల కల్పన కోసమైతేనే తనను కలవాలని నేతలకు చెప్పాలని గవర్నర్‌కు సూచించారు. నేటి తరానికి మార్గదర్శి ఆస్కీ డైరెక్టర్ పద్మనాభయ్య మాట్లాడుతూ.. మోహనరసింహన్ కందా రాసిన పుస్తకం నేటి తరం బ్యూరోక్రాట్లకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. చేపట్టిన బాధ్యతలను బరువుగా కాకుండా క్రీడాస్ఫూర్తితో నిర్వహించడం ఎలాగో మోహనరసింహన్ కందాను చూసి నేర్చుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మోహనరసింహన్ కందా పనిచేసినప్పటి నాయకుల, అధికారుల పాత్రలు, రోజువారీ జీవితంలో సామాన్యులతో జరిగిన సంఘటనల సమాహారమే ‘ట్రెక్కింగ్ ఓవర్ పెబ్బెల్స్’ అని వివరించారు. లైఫ్ త్రూ ఎ హైదరాబాదీస్ లుకింగ్ గ్లాస్ ట్యాగ్లైనరసింహన్ తో మోహనరసింహన్ కందా రాసిన ఈ పుస్తకాన్ని కోల్‌కతాకు చెందిన సంపత్ పబ్లికేషన్ ప్రచురించింది. కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
ఎదుటివాడి మాట వింటాడు!
సందర్భం పీవీగారి దగ్గరకు వెళ్లి, ‘‘మా మనుమడు రాజకీయాలలో, అదీ కమ్యూనిస్టు రాజకీయాలలో పడి తిరుగుతున్నాడండి. మీరైనా కాస్త చెప్పండి!’’ అంది. ‘‘కమ్యూనిస్టు అయినా, కాంగ్రెసయినా మీ వాడిలాంటి చదువుకున్నవాళ్లు రాజకీయాలలోకి రావాలమ్మా! మీరేమీ బాధపడకండి!’’ అంటూ ఆయన ఓదార్చారు. సీతారాం జాతీయ రాజకీయాలలో పేరు తెచ్చుకుంటూ, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు సీపీఎంకి జనరల్ సెక్రటరీ అయ్యాడు. అమ్మ, సుందరయ్యగారు, పీవీ బతికి ఉంటే ఎంత సంతోషించేవారో! సీతారాం మా అమ్మ దగ్గరే పెరిగాడు. మా బావ ఏచూరి సోమయాజులుగారు ఆటోమొ బైల్ ఇంజనీరింగ్ చదివి, ఏపీ ఎస్ఆర్టీసీలోను, కేంద్ర ప్రభు త్వంలోను ఉన్నతోద్యోగాలు చే శారు. యునెటైడ్ నేషన్స్ తర ఫున ఉగాండా, భూటాన్లలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆవిర్భావానికి కారకులు. ఆయనకు తర చుగా బదిలీలు అవుతూండటం వల్ల మా మేనల్లుడు సీతారాం, వాడి తమ్ముడు మా అమ్మ దగ్గరే పెరిగారు. అమ్మ దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారికి కుడిభుజం. 1997లో తను చ నిపోయే వరకు ఆంధ్ర మహిళా సభకు ఫౌండర్ ట్రస్టీగా కొనసాగారు. కొంతకాలం ఆంధ్ర యువతీ మం డలి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆవిడతో పరిచయం ఉన్న వాళ్లంతా ఆవిడ డైనమిజంను ఇప్పటికీ గుర్తు పెట్టు కుంటారు. అమ్మ పెంపకం ప్రభావమో ఏమో, సీతారాం ఉన్నతోద్యోగాల కోసం ఆశ పడకుండా సేవాభావంతో ప్రజాజీవితంలోకి వెళ్లాడు. వాళ్లమ్మ- అంటే మా అక్క కల్పకం ఎంఏ చదివింది. భరతనాట్యంలో నిష్ణాతు రాలు. అమ్మలాగే సంఘసేవకురాలు. మహిళా ఉద్య మంలో పాలు పంచుకుంది. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమైన పదవులలో పనిచేస్తోంది. 80 ఏళ్లు దాటినా ఇప్పటికీ సాంఘిక కార్యకలాపాలలో చురుగ్గా ఉంటుంది. సీతారాం చదువుకునే రోజులలో కమ్యూనిస్ట్ సంస్థ లలో చురుకుగా తిరుగుతున్నప్పుడు ప్రముఖ కమ్యూ నిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారి వద్దకు మా అమ్మ వెళ్లి, ‘‘ఏమండీ! మీకు మా మనుమడు తప్ప వేరెవరూ దొరకలేదా?’’ అని అడిగింది. ఆయన చాలా గడుసుగా ‘‘మీ మనుమడిలాంటి చాకులాంటి కుర్రాణ్ణి ఎవరినైనా అప్పగించి, వాణ్ణి తీసుకుపోండమ్మా!’’ అని జవాబిచ్చారు. మనుమణ్ణి మెచ్చుకున్నందుకు సంతోషిం చాలో, తన మాట విననందుకు బాధపడాలో తెలియ లేదావిడకు. తర్వాత పీవీ నరసింహారావు గారి దగ్గరకు వెళ్లి, ‘‘మా మనుమడు రాజకీయాలలో, అదీ కమ్యూ నిస్టు రాజకీయాలలో పడి తిరుగుతున్నాడండి. మీరైనా కాస్త చెప్పండి!’’ అంది. ‘‘కమ్యూనిస్టు అయినా, కాంగ్రె సయినా మీ వాడిలాంటి చదువుకున్నవాళ్లు రాజకీయా లలోకి రావాలమ్మా! మీరేమీ బాధపడకండి!’’ అంటూ ఆయన ఓదార్చారు. సీతారాం జాతీయ రాజకీయాలలో పేరు తెచ్చుకుంటూ, రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు సీపీ ఎంకి జనరల్ సెక్రటరీ అయ్యాడు. అమ్మ, సుందరయ్య గారు, పీవీ బతికి ఉంటే ఎంత సంతోషించేవారో! సీతారాం లాంటి మృదు స్వభావి కమ్యూనిస్టు పార్టీలో చేరతాడని మేం అనుకోలేదు. ఆల్ సెయింట్ హైస్కూల్లో చదువుతున్న మా మేనల్లుళ్లలో ఒకడు ఎవరో అబ్బాయిని ఇటుక పెట్టి కొట్టాడని ఫిర్యాదు వచ్చింది. వెళ్లి చూస్తే సీతారాం తమ్ముడు శంకర్! ఎందుకురా కొట్టేవ్? అంటే, ‘వాడు అన్నయ్యను రాయి పెట్టి కొట్టా డ’న్నాడు. దెబ్బ తిన్న సీతారాం ఊరుకున్నాడు, శంకర్ తిరగబడ్డాడు. అలాంటి సీతారాం ఢిల్లీలో సెయింట్ స్టీఫె న్సులో ఎకనమిక్స్ బీఏ ఆనర్స్ చేస్తుండగా, వామపక్ష భావాల వైపు మొగ్గాడు. ఎంఏ చదివాక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నానంటూ ఇం ట్లో చెప్పి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో నాయ కుడైపోయాడు. మా నాన్నగారు కంగారుపడ్డారు. ‘బుద్ధి’ గరపమని నా దగ్గరకు పంపించారు-నాతోబాటు కలసి పెరిగాడు కనుక! ఒక నెల తర్వాత నేను నాన్నకు చెప్పా ను- ‘‘నాన్నా వాడిమాటేమిటో గానీ, వీడు కొన్నిరోజు లు నా దగ్గర ఉంటే నేనూ కలెక్టరు ఉద్యోగం మానేసి కమ్యూనిస్టు కార్యకర్తనవుతానేమో చూసుకో!’’ అని. సీతారాం దగ్గర ఆ చాకచక్యం ఉంది. విపరీతంగా పుస్త కాలు చదువుతాడు. ఫిక్షన్ కూడా. ఏ విషయాన్నయినా క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. గుర్తు పెట్టుకుంటాడు. ప్రాచీన భారత చరిత్ర దగ్గర్నుంచి, అన్నీ కంఠోపాఠం. వాదించేటప్పుడు ఎదుటివారి పాయింట్ శ్రద్ధగా విం టాడు, ఆ కోణంలోంచి కూడా ఆలోచిస్తాడు. చివరకు తను అనుకున్నది దృఢంగా, నొప్పించకుండా చెప్తాడు. భగవంతుడు చక్కటి రూపం ఇచ్చాడు. మంచి కంఠం ఇచ్చాడు. పెదాలపై చిరునవ్వు ఇచ్చాడు. సెన్సాఫ్ హ్యూ మర్ ఇచ్చాడు. ఇంకొకరిని కష్టపెట్టడం ఇష్టపడకపోవ డం ఇచ్చాడు. అందువలన తనకు శత్రువులు లేరు. విభేదించేవారు కూడా గౌరవించే ప్రవర్తన తనది. నేచెప్పినది విని నాన్నగారు, ‘సరే, వాడి మానాన వాణ్ణి వదిలేయ్’ అన్నారు. కానీ ప్రభుత్వం వదలలేదు. ఎమర్జెన్సీ విధించగానే వాడి కోసం వెతికింది. వాడు అజ్ఞాతవాసం చేస్తూ అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం సాగించాడు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత వాళ్ల పార్టీ స్థితి మెరుగుపడింది. రాజకీయ పార్టీ లన్నాక ఆటుపోట్లు తప్పవు. తను కూడా దానితో పాటే పొంగుతూ, కుంగుతూ ఉన్నాడు. అవన్నీ వాడు స్పోర్టివ్ గానే తీసుకున్నాడు. కాలేజీలో ఉండగా టెన్నిస్ బాగా ఆడేవాడు. ఫర్కుందా ఆలీఖాన్ అనే కోచ్ ‘నువ్వు టెన్నిస్‌లో కొన సాగితే జాతీయ చాంపియన్‌వి కావడం ఖాయం’ అనే వాడు. సీతారాం ఇప్పటికీ టెన్నిస్ ఆడతాడు. ఆ రం గంలో చాంపియన్ కాలేకపోయినా గెలుపోటములు సమానంగా స్వీకరించే క్రీడాస్ఫూర్తి పోగొట్టుకోలేదు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ‘లెఫ్ట్‌హ్యాండ్ డ్రైవ్’ అనే శీర్షిక నడుపుతూ వ్యాసాలు రాస్తూ ఉంటాడు. లెఫ్ట్ సైడ్ డ్రైవిం గ్ అమెరికాలో రాంగ్ సైడేమో కానీ ఇండియాలో రైట్ సైడే. అది సక్రమమైన మార్గం, అదే అసలైన మార్గం అని నమ్మి ఆ దారినే నమ్ముకున్నాడు. మనదేశంలో వామపక్షాలు కొంతకాలం కాంగ్రెసే తర కూటాలు ఏర్పరచి, మరికొంతకాలం బీజేపీ వ్యతి రేక కూటాలు ఏర్పరిచి దేశ విధానాలను కొంతమేరకైనా ప్రభావితంచేస్తున్నాయి. వామపక్షాలలో సీపీఎంది ప్రధా న భూమిక. దానిలో సీతారాం యువతకు, నవ్య ధోరణు లకు ప్రతీకగా నిలిచాడు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యక్షంగా గానీ, కార్మిక ఉద్యమాల ద్వారా గానీ తమ ఉనికిని చాటుకుంటు న్నాయి. కొన్ని చోట్ల సొంతబలంతో అధికారంలోనో, మరికొన్ని చోట్ల ప్రజాస్వామ్యవాదులతో కలసి సంకీర్ణం లోనో ఇంకొన్ని చోట్ల ప్రతిపక్షంలోనో ఏదో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ లోకమంతా విస్తరించి ఉన్నాయి. సామ్య వాదానికి ఒకచోట నూకలు చెల్లాయనుకుంటూండగానే మరొకచోట మోసులు వేస్తోంది. సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం ప్రతిఘటన తప్పదు. అది సాధారణంగా కార్మిక, కర్షక, శ్రామిక ఉద్యమంగా రూపు దిద్దుకుంటుం ది. ఎరుపు రంగు పులుముకుంటుంది. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అది చూపే మొగ్గును బట్టి విశ్వవ్యాప్తంగా బలాబలాలు మారతాయి. ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ ఘన చరిత్ర కలది. కాలం తెచ్చిన మార్పులలో పాయలుపాయలుగా విడిపోయినా విధాన పరమైన విషయాలలో అది ప్రభుత్వం పైన, ప్రజల పైన చూపే ప్రభావాన్నీ, దాని ముఖ్య నాయకుల వ్యక్తిగత ఆలోచనా సరళి ప్రాముఖ్యతనూ విస్మరించలేం. అంద రికీ సన్నిహితునిగానే ఉంటూ, అదే సమయంలో అంద రితో సమానదూరం పాటిస్తూ క్లిష్ట పరిస్థితులలో కూడా చెక్కుచెదరని, నవ్వు చెరగని సీతారాం వంటి స్థితప్రజ్ఞు డు ప్రధాన వామపక్షమైన సీపీఎంకు జనరల్ సెక్రటరీ కావడం వలన దేశానికి కూడా ఎంతో కొంత మేలు కలు గుతుందని ఆశిద్దాం. (వ్యాసకర్త విశ్రాంత ప్రధాన కార్యదర్శి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) డా॥మోహన్ కందా -
నా క్లాక్ మారలేదు...వాక్ మారలేదు..!
అవిశ్రాంతం అరవై తర్వాత ‘బాల నటుడిగా సినిమా తెర మీద నటించిన దానికంటే ఎక్కువగా జీవితంలో నటించాను’ - ఇంత నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన వ్యక్తి మోహన్‌కందా. 1968 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఎస్ అధికారికి ఇప్పుడు 69 ఏళ్లు. సమైక్యాంధ్రప్రదేశ్‌కి చీఫ్ సెక్రటరీ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ‘ఉద్యోగ విరమణ’ తర్వాత జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం, దినచర్య వివరాలు ఆయన మాటల్లోనే... ఉద్యోగంలో ఉన్నప్పుడు- విరమణ తర్వాత, దేశంలో ఉన్నప్పుడు - విదేశాల్లో ఉన్నప్పుడు, శీతాకాలం- ఎండాకాలం అనే తేడాలేవీ నా వ్యక్తిగత దైనందిన జీవితంలో కనిపించవు. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవడం, వ్యాయామం, స్నానం, పూజ, బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే సమయాల వరకు ఎటువంటి మార్పు లేదు. అప్పట్లోలా ఆలస్యం అవుతుందేమోననే ఆందోళన లేకపోయినప్పటికీ సమయం మునుపటికంటే మించడం లేదు. నా క్లాక్ అలా సెట్ అయిపోయినట్లుంది. ఈ రోజంతా ఖాళీ అనే పరిస్థితి ఇంతవరకు నేను రానివ్వలేదు. ఇప్పుడు కూడా నాకిష్టమైన పనులతో రోజంతా తీరికలేకుండా గడుపుతున్నాను. ఉద్యోగంలో ఉన్నప్పటిలాగానే దేహాన్ని, మెదడుని ఖాళీగా ఉంచడం లేదు. ప్రయాణానికి రెలైక్కేటప్పుడే గమ్యం చేరాక రైలు దిగాలని మనకు తెలుసు. ఉద్యోగ విరమణ కూడా అలాంటిదే. రైలు దిగిన తర్వాత మనం నిర్దేశించుకున్న పనులు చక్కబెట్టుకున్నట్లే ఉద్యోగ విరమణ తరువాత చేయాలనుకున్న పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటి పని నా నిర్ణయమే... ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలో నా ప్రమేయం లేకుండానే నిర్ణయమై ఉంటాయి. వాటిని అమలు చేయడం, ఆచరణలో నేర్పరితనంతో నాకంటూ ఒక తరహా పనితీరును వ్యక్తం చేయడమే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం నేను రోజుకు ఒక గంట బ్రిడ్జి గేమ్ మీద పుస్తకాలతో గడుపుతాను. నాకిష్టమైన కాస్మాలజీ అధ్యయనంలో మునిగిపోతాను. అలాగే నాకు ఇష్టమైనవి, ఉద్యోగంలో ఉన్నప్పుడు చదవడానికి సమయం చాలక పక్కన పెట్టిన ఐన్స్టీ పరిశోధన ... ‘గాడ్స్ ఓన్ ఈక్వేషన్’ నంబర్ థియరీలో అద్భుతమైన సమీకరణం మీద రాసిన... ఫెర్మాస్ లాస్ట్ థీరమ్’ వంటి పాతిక పుస్తకాలు చదివాను. అలాగే నాకు తెలుసుకోవాలని ఉన్న ప్రతి అంశాన్నీ విస్తృతంగా తెలుసుకుంటూ, ఆ విజ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నాను. గతంలో నేను ‘ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్’ అంశం మీద సివిల్స్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాణ్ణి. ప్రతి క్లాసుకీ తగినంత విషయసేకరణకు చాలా శ్రమించి క్రోడీకరించాను. ఆ తర్వాత దానిని ఓ పుస్తకంగా తెస్తే చాలా మందికి అందుబాటులోకి వస్తుందని పుస్తకం రాశాను. సహకార వ్యవస్థ మీద ఓ పుస్తకం రాశాను. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద రాస్తున్నాను. ప్రస్తుతం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కార్యాలయానికి, వ్యవసాయరంగంలోనూ, పాలనలోనూ, విపత్తుల నిర్వహణలోనూ, అవసరమైన కార్యాచరణ మీద కొత్త ఆలోచనలను పంపిస్తున్నాను. నా జీవితంలోని కీలకమైన సంఘటనలను, ఉద్యోగ జీవితాన్ని ‘మోహన మకరందం’ పేరుతో రాశాను. రిటైరయిన తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఐదేళ్లపాటు సభ్యుడిగా చేశాను. ప్రతిదీ సాధ్యమే! మనిషి జీవితంలో ఫలానా పని అసాధ్యం అని ఏదీ ఉండదు. తప్పనిసరి అంటే చేసి తీరుతారెవరైనా. చేయకపోయినా ఫరవాలేదనుకుంటే చేయరు. నా మట్టుకు ఇంత వరకు అసాధ్యం అని వదిలేసిన పని ఒక్కటీ లేదు. ఎవరికైనా సరే ‘ఏమి’ చేయాలనే విషయంలో స్పష్టత వస్తే ‘ఎలా’ చేయాలనే ప్రణాళిక దానంతట అదే వస్తుంది. ఏం చేయాలన్నది తెలియకే చాలా మంది అయోమయంలో ఉంటారు. ముఖ్యంగా పదవీవిరమణ తర్వాత జీవితాన్ని ఎలా గడపాలంటూ ఆందోళన పడుతుంటారు. పైగా ప్రసారమాధ్యమాల్లో కూడా ‘విశ్రాంత’ అనే పదం వాడుతుంటారు. ఆ పదంతోనే చాలా మంది ఇక చేయాల్సిందేమీ లేదనే భావనలోకి వచ్చేస్తున్నారు. ఇది విశ్రాంత జీవనం కాదు, ఉద్యోగ విరమణ తర్వాత జీవితం. ఉద్యోగానికి ముందు ఆనందంగా జీవించలేదా? ఉద్యోగ విరమణ తర్వాత కూడా అంతే! తేడా అంతా ఉద్యోగానికి ముందు జీవితం నేర్చుకోవడానికి వినియోగిస్తాం, ఉద్యోగ విరమణ తర్వాత నేర్చుకున్న అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని మేళవించి చక్కటి వ్యాపకాలను నిర్దేశించుకుంటాం. నేనదే చేస్తున్నాను. ప్రణాళిక ఉండాలి! పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా ప్రతి దానికీ ఓ ప్రణాళిక పెట్టుకుంటాం. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికీ ఓ ప్రణాళిక ఉండాల్సిందే. జీవితంలో మన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో దేనిని ఎంచుకోవాలనే పరిణతి ఈ వయసుకి వచ్చి తీరాలి. ఇన్నేళ్ల అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, శక్తిని కలిపి మనం ఏం చేయగలమో దానిని ఎంచుకునే అవకాశం ఎప్పుడూ మన ముందు ఉంటుంది. దానినే పట్టుకుని ముందుకు పోవాలి తప్ప... దారీ తెన్నూ లేకుండా పోకూడదు. ఒక్కో సి.ఎం. ఒక్కో తీరు... నా సర్వీస్‌లో ఎందరో సీఎంల దగ్గర పనిచేశాను. నా పని తీరుతో వారికి ఇబ్బంది కలగనివ్వలేదు. నా చుట్టుపక్కల అందరినీ సౌకర్యంగా ఉండేటట్లు చూడడంలో సఫలమయ్యాను. అలాగే ఇంట్లో కూడా. నా భార్య ఉషకు, కానీ పిల్లలకు కానీ నా మీద పెద్ద కంప్లయింట్లు ఉండవు. నేను నిద్రపోయేటప్పుడు నా కోసం వచ్చిన ఫోన్‌కాల్స్‌కు జవాబు చెప్పాల్సి రావడాన్ని మాత్రం మా ఆవిడ దెప్పుతూ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి నుంచి తెల్లవారు జామున కాల్స్ వచ్చేవి, ఒక ముఖ్యమంత్రి నుంచి అర్ధరాత్రి వరకు కాల్స్ వస్తూ ఉండేవి. నన్ను నిద్రలేపకుండా వాటిని బదులు చెప్పడం కోసం తన నిద్ర పాడయ్యేదని ఉష ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది. ఉద్యోగ జీవితంలో నన్ను ఆదేశించే పై అధికారులు, అమాత్యులను నొప్పించకుండా నేను నొచ్చుకోకుండా మెలిగాను. వృత్తిపరమైన ఆదేశాలను ఎంత నిబద్ధతతో అమలు చేశానో, వ్యక్తిగత ఆదేశాలను అంతే సున్నితంగా తోసివేస్తూ వెన్ను వంచకుండా నా వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నాను. ‘నేను’ అంటే మోహన్ కందా అని మర్చిపోకుండా జీవించాను, జీవిస్తున్నాను. -
శాపాలవుతున్న ‘వరాలు’
విశాలమైన సముద్రతీరం వలన రవాణా సౌకర్యాలు, ఇతరత్రా ప్రయోజనాలు ఉంటాయి. అక్కడే ఉప్పెన, సునామీ, తుపానుల ఆపదా ఉంది. అంటే ప్రతి వరంలోనూ శాపం నిక్షిప్తమై ఉంది. శాపాలు ఇచ్చే దేవుళ్లు విమోచనా మార్గాలూ చెబుతారు. ముందు జాగ్రత్తలే ఈ విపత్తులకు శాపవిమోచనాలు! శనివారం విరుచుకుపడిన హుదూద్ పెనుతు పాను ఉత్తరాంధ్ర తీరప్రాంతాలను కుదిపేసింది. కానీ దశాబ్దం కింది పరి స్థితులతో పోల్చి చూస్తే ఈ స్థాయి తుపాను కలగజేసిన నష్టం తక్కువనే చెప్పాలి. శాస్త్ర పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ సంస్థ అనే రెండు అంశాలు ఈ మా ర్పు తెచ్చాయి. వరదలను, తుపాన్లను, భారీ వర్షాలను, భూకంపాలను, సునామీలను మనం అరికట్ట లేం. వాటి వలన జరిగే నష్టాన్ని భరించడం తప్ప మనం ఏం చేయగలం అనుకునేవారు. మనం ప్రకృ తి శక్తులను ఎదిరించలేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుని ఆపదను ఎదుర్కోవడానికి సిద్ధపడితే ప్రాణనష్టం, ధననష్టం నివారించవచ్చు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం పురోగమించడంతో ఈ తుపాను విషయంలో ఎక్కడ, ఎప్పుడు తాకుతుం దో కచ్చితంగా వారం రోజుల ముందే చెప్పగలిగా రు. దాంతో యంత్రాంగం సమాయత్తం కాగలిగిం ది. ముఖ్యంగా ప్రాణనష్టాన్ని చాలా వరకు నిరోధించగలిగింది. ఈ అంశం హుదూద్ విషయంలో ప్రస్తుతం రుజువైంది. అయితే ఇలాంటి ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ మాత్రం పరిమితం కావు. ప్రమాదాల నివారణే ప్రయోజనం నేను ఎన్‌డీఎంఏలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉండగా మా బృందం విధివిధానాలను రూపొందించినప్పు డు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ప్రమాదం జరగగానే ఫ్యాక్టరీ మూసేయాలని ఆం దోళన జరిగితే ఆ మేరకు పారిశ్రామిక ప్రగతి కుం టుపడుతుంది. గ్యాస్ పైప్ బద్దలు కాగానే కోనసీమలో ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. అంటే అక్కడు న్న గ్యాస్ నిక్షేపాల ఉనికి వలస ఒనగూడే లాభాలు వదులుకోవడానికి సిద్ధపడినట్టే కదా! ఇదే విధంగా రేపు వరదల వలన కలిగే నష్టాన్ని నివారించలేకపోతే నదులున్న ప్రయోజనాన్ని పొందలేరు. వరద వేలాది, లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఇళ్లు, ఆస్తులు, పశుసంపద పోగొట్టుకునే వారిని చూస్తాం కాబట్టి వ్యక్తిగతంగా జరిగే నష్టమే మన మనసులో నాటుకుంటుంది. కానీ వరదలు ప్రభుత్వ ఆర్థిక స్థితిని కూడా కుదిపేస్తాయని చాలా మంది గ్రహించారు. 2009-10 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీ విషయంలో 5.04 శాతం పెరుగుదల సాధిస్తుందని అప్పట్లో అంచనా. కానీ 2009లో వచ్చిన వరదల కారణంగా 2010లో వచ్చిన తుపాను కారణంగా కలిగిన నష్టం రూ.13,630 కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీలో 5.14 శాతం. సమాజ అభివృద్ధిని ఒక్క తుపాను తుడిచిపెట్టేస్తోంది. ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు దేశ అభివృద్ధి సూచిక (జీడీపీ)లను తగ్గించి వేస్తాయి. అది దేశాన్ని బట్టి 2 నుంచి 12 శాతం వరకు ఉంటుంది. విపత్తు ప్రభావం తగ్గించడానికై ఒక రూపాయి ఖర్చు పెడితే దాని వలన 7 రూపాయలు ఆదా అవుతాయి. వ్యాధి విషయంలో టీకాలు వేయించుకుని రాకుండా చూసుకోవడం, వచ్చాక ఔషధాలు తీసుకోవడం, రోగం నెమ్మదించాక మళ్లీ త్వరగా కోలుకునేందుకు టానిక్కులు తీసుకోవడం ఎలా అయితే చే స్తామో విపత్తుల విషయంలో కూడా మనం అలాం టి విధానాలు పాటించాలి. దీన్నే సూక్ష్మంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ లేక విపత్తు నిర్వహణ అనవచ్చు. కర్మను వదిలి క్రియలోకి దిగాం గతంలో ప్రకృతి సిద్ధమైన విపత్తులు సంభవించినప్పుడు మన కర్మను నిందించుకుంటూ మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉండేవారం. దేశ ఆర్థిక వ్యవస్థపై, జన జీవితాలపై ఇది కలిగిస్తున్న దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం, 1999 ఆగస్టులో శ్రీ జె.సి.పంత్ అధ్యక్షతన హైపవర్ కమిటీని నియమిం చింది. ఆ తర్వాత 2001 ఫిబ్రవరిలో గుజరాత్ భూకంపం తర్వాత ప్రధాన మంత్రి చైర్మన్‌గా అఖిల భారత జాతీయ కమిటీ ఏర్పాటైంది. 2004లో సునా మీ కలిగించిన బీభత్సం తర్వాత జాతి అంతా జాగృ తమైంది. ఆస్తి, ప్రాణనష్టాలను సాధ్యమైనంత వర కు నివారించడానికి ప్రభుత్వం నడుం కట్టింది. 2005 డిసెంబర్లో విపత్తు నివారణ (డీఎం) చట్టం పాస్ చేయడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఏర్పరచి విధివిధానాలను ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన నన్ను ఆ అథారిటీలో సభ్యుడిగా తీసుకున్నారు. మా సంస్థకు స్వయాన చైర్మన్‌గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్‌గా జనరల్ విజ్ ఉండేవారు. అప్పటిదాకా విపత్తు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనేదే ముఖ్యంగా ఉండేది. ఎన్డీఎంఏ ఆవిర్భావంతో వివిధ శాఖల మధ్య సమన్వయంతో కూడిన విధానానికి మరల్చడం జరిగింది. సహాయక దళాలు ఎన్డీఎంఏ కృషి ఫలితంగా సాటిలేని మేటి సామర్థ్యంతో ‘జాతీయ విపత్తు సహాయకదళం’ (ఎన్డీఆర్ఎఫ్ - నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్) ఆవిర్భవించింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు 2008 కోసీ వరదల్లో, 2009 ఆంధ్ర, కర్ణాటక వరదల్ల్లో గణనీయమైన పాత్ర పోషించి అందరి మన్ననలు పొందా యి. దేశం నలుమూలలా ఎన్డీఆర్ఎఫ్ స్థావరాలు ఏర్పరచారు. ఎన్డీఆర్ఎఫ్కు అనుబంధంగా రాష్ట్ర స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్)లు కొన్ని రాష్ట్రాలలో ప్రారంభించబడ్డాయి. ఏయే బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలో వర్క్‌షాపు లు నిర్వహించి స్పష్టంగా నిర్ధారించడం జరిగింది. భారతదేశంలో తుపానులు మన ఉమ్మడి రాష్ర్టం వరకూ చూసుకున్నా 2009 వరదలు, 2010 లైలా తుపాను భారీ నష్టాన్ని కలి గించాయి. ఈ రెండింటి కారణంగా మొత్తం రూ.13,630 కోట్ల నష్టం వాటిల్లింది. లైలా వచ్చిన సంవత్సరంలో కలిగించిన నష్టం కారణంగా మన రాష్ట్రం అభివృద్ధి రేటు (గ్రోత్ రేటు)లో 2 శాతం తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆ మధ్య వచ్చిన పైలీన్ తుపాను భారతదేశపు తూర్పు కోస్తా అతలాకుతలం చేసింది. ఆస్తినష్టం భారీగా జరిగినా మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నా యి. ఒడిశాలో 36 మంది చనిపోగా ఆ్రంధప్రదేశ్లో ఒక్కరే మరణించారు. దీనికి కారణం జాతీయ విపత్తు నిర్వాహక బృందాలు, సహాయకదళాలు, తుపాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండటమే! ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్రకృతి లేదా మానవుడు కలిగించే ఉత్పాతాలను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా తర్ఫీదు పొంది ఉన్నాయి. ఐఎండీ (భారత వాతావరణ శాఖ) నుంచి ప్రమాద సూచనలు రాగానే అవి రంగంలోకి దిగుతాయి. ఈ సూచనలు ఎంత ముందుగా అందితే ఈ దళాల సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంది. పైలీన్ విషయంలో తగిన సమయం ఉండడం వలన ఎన్డీఆర్ఎఫ్ వారు అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. రాష్ట్ర దళాల ఏర్పాటు అత్యవసరం రాష్ట్రంలోని తూర్పు కోస్తా ప్రాంతంలో ఫైలిన్‌ను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ చేసిన ప్రయత్నం, దాని విజయం చూసిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారిని అభినందించడంతో బాటు, రాష్ట్ర స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తొలి దశలో వెయ్యి మందితో దళం ఏర్పడుతుందని, వారికి మంగళగిరిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ చేత తర్ఫీదు ఇప్పించబోతున్నామని చెప్పారు. హుదూద్ ఉదంతంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఎలా పనిచేస్తున్నాయో కళ్లకు కట్టినట్లు కనబడుతోంది కాబట్టి రాష్ట్రస్థాయిలో ఇలాంటి దళాల ఆవశ్యకత గురించి నొక్కి చెప్పనక్కరలేదు. 1993-2002 మ ద్య జరిగిన విపత్తుల వలన సంభవించిన మరణాలకంటే 2003-12 మధ్య కాలంలో సంభవించిన మరణాలు దాదాపు సగం. కానీ ఈ విజయం అతి స్వల్పమనే చెప్పాలి. కొన్ని ఆఫ్రికన్ దేశాలు కూడా మనకంటే ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయి. రాబోయే తుపానులు ఎలా ఉంటాయో తెలియవు. ఏ స్థాయి తుపాను వచ్చినా దాని నుంచి కాపాడుకోవడానికి మనం రెడీగా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో సహాయక దళాలు ఏర్పాటు చేయడంతో మన బాధ్యత తీరిపోదు. సరైన తర్ఫీదు, ఆర్థిక సహా యం, స్థానికులకు అవగాహన కల్పించడం, పునరావాస కల్పన వంటి అనేక కార్యక్రమాలను పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి చర్యలను చిత్తశుద్ధితో అమలుచేసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలను తలచుకుని మనం బెదరనక్కరలేదు. ఈ దిశగా ముందుకు సాగేందుకు హుదూద్ తుపాను ప్రభుత్వంలో కదలిక తెస్తుందని ఆశిద్దాం. (వ్యాసకర్త ఏపీ పూర్వ ప్రభుత్వ కార్యదర్శి, ఎన్డీఎంఏ సభ్యుడు) డా॥ మోహన్ కందా