శాపాలవుతున్న ‘వరాలు’ | Every blessing in the curse | Sakshi
Sakshi News home page

శాపాలవుతున్న ‘వరాలు’

Published Wed, Oct 15 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

శాపాలవుతున్న ‘వరాలు’

శాపాలవుతున్న ‘వరాలు’

విశాలమైన సముద్రతీరం వలన రవాణా సౌకర్యాలు, ఇతరత్రా ప్రయోజనాలు ఉంటాయి. అక్కడే ఉప్పెన, సునామీ, తుపానుల ఆపదా ఉంది. అంటే ప్రతి వరంలోనూ శాపం నిక్షిప్తమై ఉంది. శాపాలు ఇచ్చే దేవుళ్లు విమోచనా మార్గాలూ చెబుతారు. ముందు జాగ్రత్తలే ఈ విపత్తులకు శాపవిమోచనాలు!
 
శనివారం విరుచుకుపడిన హుదూద్ పెనుతు పాను ఉత్తరాంధ్ర తీరప్రాంతాలను కుదిపేసింది. కానీ దశాబ్దం కింది పరి స్థితులతో పోల్చి చూస్తే ఈ స్థాయి తుపాను కలగజేసిన నష్టం తక్కువనే చెప్పాలి. శాస్త్ర పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ సంస్థ అనే రెండు అంశాలు ఈ మా ర్పు తెచ్చాయి. వరదలను, తుపాన్లను, భారీ వర్షాలను, భూకంపాలను, సునామీలను మనం అరికట్ట లేం. వాటి వలన జరిగే నష్టాన్ని భరించడం తప్ప మనం ఏం చేయగలం అనుకునేవారు. మనం ప్రకృ తి శక్తులను ఎదిరించలేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుని ఆపదను ఎదుర్కోవడానికి సిద్ధపడితే ప్రాణనష్టం, ధననష్టం నివారించవచ్చు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం పురోగమించడంతో ఈ తుపాను విషయంలో ఎక్కడ, ఎప్పుడు తాకుతుం దో కచ్చితంగా వారం రోజుల ముందే చెప్పగలిగా రు. దాంతో యంత్రాంగం సమాయత్తం కాగలిగిం ది. ముఖ్యంగా ప్రాణనష్టాన్ని చాలా వరకు నిరోధించగలిగింది. ఈ అంశం హుదూద్ విషయంలో ప్రస్తుతం రుజువైంది. అయితే ఇలాంటి ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ మాత్రం పరిమితం కావు.

ప్రమాదాల నివారణే ప్రయోజనం

నేను ఎన్‌డీఎంఏలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉండగా మా బృందం విధివిధానాలను రూపొందించినప్పు డు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ప్రమాదం జరగగానే ఫ్యాక్టరీ మూసేయాలని ఆం దోళన జరిగితే ఆ మేరకు పారిశ్రామిక ప్రగతి కుం టుపడుతుంది. గ్యాస్ పైప్ బద్దలు కాగానే కోనసీమలో ఓఎన్‌జీసీ, గెయిల్ కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. అంటే అక్కడు న్న గ్యాస్ నిక్షేపాల ఉనికి వలస ఒనగూడే లాభాలు వదులుకోవడానికి సిద్ధపడినట్టే కదా! ఇదే విధంగా రేపు వరదల వలన కలిగే నష్టాన్ని నివారించలేకపోతే నదులున్న ప్రయోజనాన్ని పొందలేరు.

వరద వేలాది, లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఇళ్లు, ఆస్తులు, పశుసంపద పోగొట్టుకునే వారిని చూస్తాం కాబట్టి వ్యక్తిగతంగా జరిగే నష్టమే మన మనసులో నాటుకుంటుంది. కానీ వరదలు ప్రభుత్వ ఆర్థిక స్థితిని కూడా కుదిపేస్తాయని చాలా మంది గ్రహించారు. 2009-10 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీ విషయంలో 5.04 శాతం పెరుగుదల సాధిస్తుందని అప్పట్లో అంచనా. కానీ 2009లో వచ్చిన వరదల కారణంగా 2010లో వచ్చిన తుపాను కారణంగా కలిగిన నష్టం రూ.13,630 కోట్లు. ఇది రాష్ట్ర జీడీపీలో 5.14 శాతం. సమాజ అభివృద్ధిని ఒక్క తుపాను తుడిచిపెట్టేస్తోంది.

ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం

ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం తుపానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు దేశ అభివృద్ధి సూచిక (జీడీపీ)లను తగ్గించి వేస్తాయి. అది దేశాన్ని బట్టి 2 నుంచి 12 శాతం వరకు ఉంటుంది. విపత్తు ప్రభావం తగ్గించడానికై ఒక రూపాయి ఖర్చు పెడితే దాని వలన 7 రూపాయలు ఆదా అవుతాయి. వ్యాధి విషయంలో టీకాలు వేయించుకుని రాకుండా చూసుకోవడం, వచ్చాక ఔషధాలు తీసుకోవడం, రోగం నెమ్మదించాక మళ్లీ త్వరగా కోలుకునేందుకు టానిక్కులు తీసుకోవడం ఎలా అయితే చే స్తామో విపత్తుల విషయంలో కూడా మనం అలాం టి విధానాలు పాటించాలి. దీన్నే సూక్ష్మంగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లేక విపత్తు నిర్వహణ అనవచ్చు.
 
కర్మను వదిలి క్రియలోకి దిగాం

గతంలో ప్రకృతి సిద్ధమైన విపత్తులు సంభవించినప్పుడు మన కర్మను నిందించుకుంటూ మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉండేవారం. దేశ ఆర్థిక వ్యవస్థపై, జన జీవితాలపై ఇది కలిగిస్తున్న దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం, 1999 ఆగస్టులో శ్రీ జె.సి.పంత్ అధ్యక్షతన హైపవర్ కమిటీని నియమిం చింది. ఆ తర్వాత 2001 ఫిబ్రవరిలో గుజరాత్ భూకంపం తర్వాత ప్రధాన మంత్రి చైర్మన్‌గా అఖిల భారత జాతీయ కమిటీ ఏర్పాటైంది. 2004లో సునా మీ కలిగించిన బీభత్సం తర్వాత జాతి అంతా జాగృ తమైంది. ఆస్తి, ప్రాణనష్టాలను సాధ్యమైనంత వర కు నివారించడానికి ప్రభుత్వం నడుం కట్టింది. 2005 డిసెంబర్‌లో విపత్తు నివారణ (డీఎం) చట్టం పాస్ చేయడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అని ఏర్పరచి విధివిధానాలను ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన నన్ను ఆ అథారిటీలో సభ్యుడిగా తీసుకున్నారు. మా సంస్థకు స్వయాన చైర్మన్‌గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్‌గా జనరల్ విజ్ ఉండేవారు. అప్పటిదాకా విపత్తు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనేదే ముఖ్యంగా ఉండేది. ఎన్‌డీఎంఏ ఆవిర్భావంతో వివిధ శాఖల మధ్య సమన్వయంతో కూడిన విధానానికి మరల్చడం జరిగింది.
 
సహాయక దళాలు


ఎన్‌డీఎంఏ కృషి ఫలితంగా సాటిలేని మేటి సామర్థ్యంతో ‘జాతీయ విపత్తు సహాయకదళం’ (ఎన్‌డీఆర్‌ఎఫ్ - నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్) ఆవిర్భవించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు 2008 కోసీ వరదల్లో, 2009 ఆంధ్ర, కర్ణాటక వరదల్ల్లో గణనీయమైన పాత్ర పోషించి అందరి మన్ననలు పొందా యి. దేశం నలుమూలలా ఎన్‌డీఆర్‌ఎఫ్ స్థావరాలు ఏర్పరచారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు అనుబంధంగా రాష్ట్ర స్థాయిలో ఎన్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్)లు కొన్ని రాష్ట్రాలలో ప్రారంభించబడ్డాయి. ఏయే బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలో వర్క్‌షాపు లు నిర్వహించి స్పష్టంగా నిర్ధారించడం జరిగింది.

భారతదేశంలో తుపానులు

మన ఉమ్మడి రాష్ర్టం వరకూ చూసుకున్నా 2009 వరదలు, 2010 లైలా తుపాను భారీ నష్టాన్ని కలి గించాయి. ఈ రెండింటి కారణంగా మొత్తం రూ.13,630 కోట్ల నష్టం వాటిల్లింది. లైలా వచ్చిన సంవత్సరంలో కలిగించిన నష్టం కారణంగా మన రాష్ట్రం అభివృద్ధి రేటు (గ్రోత్ రేటు)లో 2 శాతం తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆ మధ్య వచ్చిన పైలీన్ తుపాను భారతదేశపు తూర్పు కోస్తా అతలాకుతలం చేసింది. ఆస్తినష్టం భారీగా జరిగినా మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నా యి. ఒడిశాలో 36 మంది చనిపోగా ఆ్రంధప్రదేశ్‌లో ఒక్కరే మరణించారు. దీనికి కారణం జాతీయ విపత్తు నిర్వాహక బృందాలు, సహాయకదళాలు, తుపాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండటమే!

ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు ప్రకృతి లేదా మానవుడు కలిగించే ఉత్పాతాలను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా తర్ఫీదు పొంది ఉన్నాయి. ఐఎండీ (భారత వాతావరణ శాఖ) నుంచి ప్రమాద సూచనలు రాగానే అవి రంగంలోకి దిగుతాయి. ఈ సూచనలు ఎంత ముందుగా అందితే ఈ దళాల సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంది. పైలీన్ విషయంలో తగిన సమయం ఉండడం వలన ఎన్‌డీఆర్‌ఎఫ్ వారు అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు.

రాష్ట్ర దళాల ఏర్పాటు అత్యవసరం

రాష్ట్రంలోని తూర్పు కోస్తా ప్రాంతంలో ఫైలిన్‌ను ఎదుర్కోవడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ చేసిన ప్రయత్నం, దాని విజయం చూసిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారిని అభినందించడంతో బాటు, రాష్ట్ర స్థాయిలో ఎన్‌డీఆర్‌ఎఫ్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తొలి దశలో వెయ్యి మందితో దళం ఏర్పడుతుందని, వారికి మంగళగిరిలో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ చేత తర్ఫీదు ఇప్పించబోతున్నామని చెప్పారు. హుదూద్ ఉదంతంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు ఎలా పనిచేస్తున్నాయో కళ్లకు కట్టినట్లు కనబడుతోంది కాబట్టి రాష్ట్రస్థాయిలో ఇలాంటి దళాల ఆవశ్యకత గురించి నొక్కి చెప్పనక్కరలేదు. 1993-2002 మ ద్య జరిగిన విపత్తుల వలన సంభవించిన మరణాలకంటే 2003-12 మధ్య కాలంలో సంభవించిన మరణాలు దాదాపు సగం. కానీ ఈ విజయం అతి స్వల్పమనే చెప్పాలి. కొన్ని ఆఫ్రికన్ దేశాలు కూడా మనకంటే ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయి. రాబోయే తుపానులు ఎలా ఉంటాయో తెలియవు. ఏ స్థాయి తుపాను వచ్చినా దాని నుంచి కాపాడుకోవడానికి మనం రెడీగా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో సహాయక దళాలు ఏర్పాటు చేయడంతో మన బాధ్యత తీరిపోదు. సరైన తర్ఫీదు, ఆర్థిక సహా యం, స్థానికులకు అవగాహన కల్పించడం, పునరావాస కల్పన వంటి అనేక కార్యక్రమాలను పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. ఇలాంటి చర్యలను చిత్తశుద్ధితో అమలుచేసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలను తలచుకుని మనం బెదరనక్కరలేదు. ఈ దిశగా ముందుకు సాగేందుకు హుదూద్ తుపాను ప్రభుత్వంలో కదలిక తెస్తుందని ఆశిద్దాం.

 (వ్యాసకర్త ఏపీ పూర్వ ప్రభుత్వ కార్యదర్శి,  ఎన్‌డీఎంఏ సభ్యుడు)
 
 డా॥  మోహన్ కందా

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement