ఒక్కమాట.. వెలుగు రేఖ | 9 Promises in YSR Congress Manifesto | Sakshi
Sakshi News home page

ఒక్కమాట.. వెలుగు రేఖ

Published Tue, Nov 7 2017 7:18 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

9 Promises in YSR Congress Manifesto - Sakshi

‘ఉద్యోగ విరమణ తర్వాత పెన్షనర్లు ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక సమస్యలు లేకుండా జీవించడానికి పెన్షన్‌ స్కీమ్‌ను ప్రభుత్వం అందుబాటులోని వనరులతో ఏర్పాటు చేయాలి’. సుప్రీంకోర్టు 1982లో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇచ్చిన తీర్పు ఇది. అయితే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గిన ప్రభుత్వాలు పాత పింఛన్‌ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని 2013లో (సీపీఎస్‌) అమలులోకి తెచ్చింది. 2014 సెప్టెంబర్‌ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి ఈ స్కీమ్‌ పరిధిలోకి వస్తారు. ఈ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించ లేదు. ఈ క్రమంలో తాను అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు పాత పింఛన్‌ విధానం అమలులోకి తెస్తానని హామీ ఇచ్చారు. సీపీఎస్‌ స్కీమ్‌ రద్దవుతే జిల్లాలో దాదాపు 12 వేల మంది లబ్ధిపొందుతారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా హామీ ప్రకటించడంతో పలు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.         

కడప ఎడ్యుకేషన్‌/బద్వేల :

ఆర్థిక భరోసా ఉన్నట్టే
సీపీఎస్‌ స్కీమ్‌ రద్దు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంద ని చెప్పడం అవాస్తవం. సీపీఎస్‌ రద్దవుతే లక్షల మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా కలుగుతుంది. జగన్‌ నిర్ణయాన్ని ఎంతో మంది స్వాగతిస్తున్నారు.
మడితాటి నరసింహా రెడ్డి, హెచ్‌ఎం, రాయచోటి

ఉపాధ్యాయులు అండగా ఉంటారు
సీపీఎస్‌ రద్దుపై హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉపాధ్యాయులు అండగా ఉంటారు. కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నా అధికారంలో ఉన్న వారిలో ఒక్కరూ కూడా స్పందించలేదు. ఇప్పటికే ఎంతో మంది నష్టపోయారు. సీపీఎస్‌ రద్దుకు సహకరిస్తే వారికి రుణపడి ఉంటాం.
భాస్కర్, ఉపాధ్యాయుడు, రాయచోటి

చారిత్రాత్మకంగా నిలుస్తోంది
సీపీఎస్‌ రద్దుపై జగన్‌ ఇచ్చిన హామీ అమలు అయితే చరిత్రలో నిలిచిపోతోంది. ఉద్యోగుల కష్టాలు చూసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు.
- రాజగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, బి.కోడూరు మండలం


ఆశలకు ఊపిరి పోశారు
పాత పింఛను విధానాన్ని ప్రవేశపెడతామని వైఎస్‌ జగన్‌ చెప్పిన ఒక్క మాటతో లక్షలాది ఉద్యోగుల ఆశలకు ఊపిరి పోశారు. ఎన్నో ఏళ్లుగా సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానం ప్రవేశపెట్టాలని నాయకులను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నా పట్టించుకోలేదు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌ హామీ ఇవ్వడం అభినందనీయం.
 - సుజానేంద్ర, జూనియర్‌ అసిస్టెంట్, కలసపాడు

పదవ రత్నంగా ప్రకటించాలి
ఇప్పటికే వైఎస్‌ జగన్‌ నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పిన హామీని పదవ రత్నంగా పేర్కొనవచ్చు. సీపీఎస్‌ రద్దు చేస్తే రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపడమే.   
 – లెక్కల జమాల్‌రెడ్డి, పీఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

భరోసా కల్పించారు
సీపీఎస్‌ స్కీమ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో వైఎస్‌ జగన్‌ భరోసా కల్పించేలా సానుకూల నిర్ణయంపై హామీ ఇవ్వడం హర్షనీయం. ఈ విషయంపై మిగతా పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి.
 – మల్లు. రఘనాథరెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

జగన్‌పై నమ్మకం ఉంది
అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను జగన్‌ రద్దు చేస్తారనే నమ్మకం ఉంది. అన్ని వర్గాల మేలు కోరే నాయకుడు కష్టాలు తెలుసుకుని స్పందిస్తారు. ఆ మేరకే జగన్‌ కూడా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు.   
– జనార్దన్‌రెడ్డి, ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ జిల్లా అధ్యక్షుడు

చంద్రబాబు చొరవ చూపలేదు
అధికారంలో ఉండటంతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీపీఎస్‌ రద్దుకు చొరవ   చూపలేదు. ఇటీవల తిరుపతిలో జరిగిన సమావేశంలో విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే కేంద్రం పరిధిలో ఉందని చెప్పి తప్పించుకున్నారు. జగన్‌ ప్రకటనను ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు.
 – పీవీ రమణరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement