
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్‌ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు.
2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్‌ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్‌వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్‌ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్‌వర్త్‌లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది.