Teachers dharna
-
కడియం వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా
హత్నూర: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మహిళా టీచర్లు ఇంట్లో వంట వండుకోవడం, యూనియన్లకు డైరీలు పట్టుకుని తిరగడం తప్ప ఏమీ చేయటం లేదని కడియం మంగళవారం ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా ఉపాధ్యాయులు దౌల్తాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. తెలంగాణ తల్లి విగ్రహానికి విజ్ఞాపన పత్రం సమర్పించారు. వెంటనే కడియం శ్రీహరి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
పోలవరం ముంపు మండలాల ఉపాధ్యాయుల ధర్నా
ఖమ్మం (భద్రాచలం) : తెలంగాణ స్థానికత కలిగిన ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం ప్రదర్శిస్తోందని ముంపు మండలాల ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పోలవరం ఏడు ముంపు మండలాల్లోని ఉపాధ్యాయులు గురువారం విధులకు గైర్హాజరై మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం కాలాయాపన చేయడంతో గిరిజన విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 19వ తేదీన ఖమ్మం జిల్లా డీఈఓ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముంపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.