Sirpur Paper Mill
-
సిర్పూర్ పేపర్‌మిల్లులో ఘోర ప్రమాదం
-
సిర్పూర్ పేపర్‌మిల్లులో ప్రమాదం
కొమురం భీం (ఆసిఫాబాద్): జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నూతన బాయిలర్ నిర్మాణ కోసం పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో మట్టి పెళ్లలు కుప్పకులాయి. ఒక్కసారిగా మట్టిపెళ్లలు పడటంతో కూలీలు ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా.. గాయపడ్డ నలుగురు కూలీలను చికిత్స కోసం మంచిర్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం, పోలీసుల సాయంతో కూలీలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో స్పామ్ కార్మికులు అంతా సురక్షితంగా ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కూలీలు బాయిలర్ నిర్మాణ పనులకు వచ్చిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాగజ్‌నగర్‌లో 144 సెక్షన్
సాక్షి, కాగజ్‌నగర్(ఆదిలాబాద్) : కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌లో మిల్లు యాజమన్యం, లారీ అసోసియేషన్ మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. మిల్లులోని ఉత్పత్తిని వందశాతం తమతోనే లోడింగ్ చేయించాలని లారీ అసోసియేషన్ పట్టుబడడంతో అంత సాధ్యం కాదని 33 శాతం మాత్రమే స్థానిక లారీల ద్వారా సరుకులు ఎగుమతి, దిగుమతి చేస్తామని భీష్మించారు. దీంతో రోజురోజుకు ఇద్దరి మ«ధ్య వివాదం ముదురుతోంది. ఈ నెల 17న లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అదేరోజు లారీ డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇన్చార్జి డీఎస్పీ సత్యనారాయణ రంగంలోకి దిగి సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. విషయాన్ని ఎస్పీ మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్పీ, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఇరువురిని పిలిచి చర్చలు జరిపారు. అయిన చర్చలు సఫలం కాకపోవడంతో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదివారం రెండు లారీలు కాగజ్‌నగర్ చేరుకోవడంతో లారీ డ్రైవర్లను లారీ అసోసియేషన్ సభ్యులు సముదాయించారు. అంతలోనే పట్టణ సీఐ కిరణ్ డ్రైవర్లను తమవెంట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగా వివాదం ముదిరింది. లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇదే క్రమంలో అక్కడే రోడ్డుపై ఉన్న లారీకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ముదురుతున్న వివాదం... ఇరువురి పట్టింపు కారణంగానే కాగజ్‌నగర్‌లో వివాదం ముదురుతోంది. స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని లారీ అసోసియేషన్ పట్టుబడడంతో, అంతసాధ్యం కాదని పేపర్ మిల్లు యాజమాన్యం ససేమీరా అంటోంది. దీంతో 11 రోజులుగా వివాదం ముదురుతోంది. ఈ వివాదం ఆత్మహత్యాయత్నం వరకు దారితీసింది. అంతే కాకుండా గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై ఉన్న లారీకి నిప్పంటించడం కూడా జరిగింది. ఇరువురు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే ఇంత జరిగేది కాదని పలువురి వాదన. తమ పొట్టపై కొట్టొద్దని లారీ అసోసియేషన్ విన్నవించినా యాజమాన్యం పట్టించుకోవడంలేదనే ఆరోపనలున్నాయి. యాజమాన్యం స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదంటున్నారు. ప్రజాప్రయోజనాల దృశ్యా యాజమాన్యం దిగివచ్చి స్థానికులకు పాధాన్యం కల్పిస్తే స్థానిక లారీ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లారీ అసోసియేషన్ సభ్యుల అరెస్ట్ కాగజ్‌నగర్ పట్టణంలో కొద్ది రోజులుగా లారీ అసోసియేషన్, మిల్లు యాజమాన్యం మధ్య కొనసాగుతున్న వివాదంలో ఏడుగురిపై కేసు నమోదు చేసి ఆసిఫాబాద్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కిరణ్ తెలిపారు. జిల్లాలో 30 యాక్టు అమలులో ఉన్న నేపథ్యంలో శనివారం లారీ అసోసియేషన్ సభ్యులను రెచ్చగొట్టి పబ్లిక్ రోడ్డుపై గందరగోళం చేస్తూ పోలీసుల విధులకు భంగం కలిగించిన వెన్న కిషోర్, మహ్మద్ తాజ్, మాచర్ల శంకర్(ధోబి శంకర్), యూసుఫ్‌ఖాన్, ఖాజా ఫసియొద్దీన్, తాహేర్ హుస్సేన్, మాచర్ల శ్రీనివాస్‌లను రిమాండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకుడి అరెస్ట్ లారీ అసోసియేషన్ సభ్యుల ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్న నేపధ్యంలో లారీ అసోసియేషన్‌కు మద్దతుగా రావి శ్రీనివాస్ పెట్రోల్ పంపులోని కార్యాలయానికి వెళ్లారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు పేపర్ మిల్లు యాజమాన్యం, లారీ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా కాగజ్‌నగర్ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన గందరగోళం దృశ్యా పోలీసులు ఆదివారం పట్టణంలోని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద, లారీ అసోసియేషన్ కార్యాలయం ఎదుట పోలీసులు మోహరించారు. -
కొద్దిరోజుల్లో వేలాది కార్మిక కుటుంబాల్లో వెలుగులు
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాలికి బలపం కట్టుకొని నిరంతరం మిల్లు పునరుద్ధరణ కోసం పాటుపడ్డారు. ఆయన కృషి ఊరికే పోకుండా మిల్లు తెరుచుకొని కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే చెప్పారు.. సిర్పూర్ పేపర్ మిల్లును త్వరగా తెరిపించేలా మీరంతా అదే పనిలో ఉండాలని మాకు ఆదేశించారు. పునరుద్ధరణకు ముందుకు వచ్చిన జేకే కంపెనీకి కోట్ల రూపాయల రాయితీలు కల్పించి మిల్లు తెరిపిస్తున్నాం. జేకే పేపర్ మిల్లు రూ.30వేల కోట్ల వ్యాపారం చేస్తుంది. చాలా పెద్ద పరిశ్రమ. కాంట్రాక్టు కార్మికులకు సైతం న్యాయం చేకూరుతుంది. సాక్షి, ఆసిఫాబాద్ : వేలాది కార్మిక కుటుంబాల్లో వెలుగులు నిండే సమయం వచ్చిందని, మరికొద్ది రోజుల్లో ఎస్పీఎంలో సైరన్ మోగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామరావు అన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) పునరుద్ధరణతో కాగజ్‌నగర్‌కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్‌రావు, కోవ లక్ష్మిలతో కలిసి ఎస్పీఎం పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట కార్మికులతో ఆత్మీసభ ఏర్పాటు చేశారు. మిల్లులో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎస్పీఎం గ్రౌండ్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. స్వాతిముత్యం సినిమాలో హీరో కమల్‌హాసన్ తనకు ఉద్యోగం కావాలని వెంటపడినట్లు సిర్పూర్ పేపర్ మిల్లు తిరిగి తెరిపించేందుకు కొనేరు కోనప్ప అలా తన వెంట పడ్డారని చెప్పారు. కాలికి బలపం కట్టుకుని తిరిగి మొత్తానికి మిల్లు ప్రారంభించేలా చేశారన్నారు. మిల్లు పునరుద్ధరణ కోసం కోల్‌కతా, ముంబయి, ఢిల్లీకి పలుమార్లు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. జేకే పేపర్స్ కంపెనీ ముందుకు రావడంతో మిల్లు తిరిగి ప్రారంభమవుతోందని చెప్పారు. మిల్లు మూతపడి కార్మికుల కుటుంబాలు మూడేళ్లుగా నానా కష్టాలు పడుతున్నాయని అన్నారు. సాధ్యమైనంత తొందరగా మిల్లులో కాగితం ఉత్పత్తి ప్రారంభించాలని జేకే కంపెనీ ప్రతినిధులను కేటీఆర్ కోరారు. మిల్లులో పని చేసే కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాలు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేవాపూర్ ఓసీసీ విస్తరణతో ఉద్యోగాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్‌లోని ఓరియెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో మరో రూ.2వేల కోట్ల పెట్టుబడులతో యాజమాన్యం విస్తరిస్తోందని తెలిపారు. తద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని, అవి స్థానికులకే అందేలా చూస్తామని అన్నారు. సీసీఐ పునరుద్ధరణకు కృషి ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఇండియా)ను కూడా తిరిగి ప్రారంభించేందుకు మంత్రి జోగు రామన్నతో కలసి ఢిల్లీ వెళ్లామని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి అనంత్గీథేను కలిసి సీసీఐ పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు అన్ని రకాల ప్రొత్సాహకాలు ఇస్తోందన్నారు. కాగజ్‌నగర్‌కు రూ.25 కోట్లు.. బ్రిడ్జీలకు రూ.17 కోట్లు కాగజ్‌నగర్ పట్టణ అభివృద్ధి కోసం మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్తాన్నాని హామీ ఇచ్చారు. సిర్పూర్లో బ్రిడ్జిల కోసం రూ.17 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం కుమురం భీం జిల్లాలో 106 గిరిజన గూడేలు కొత్త గ్రామ పంచాయతీలుగా మారాయని, 55 తండాల్లో కూడా నేటినుంచి కొత్త పాలన ప్రారంభమైందని పేర్కొన్నారు. పండుగలా కనిపిస్తోంది : ఐకే రెడ్డి పేపర్ మిల్లు పునరుద్ధరణ పనులు చూస్తుంటే ఓ పండగ వాతావరణం కనిపిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సిర్పూర్‌కు మంచి రోజుల వచ్చాయన్నారు. మంత్రి కేటీఆర్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. గురువారం ఒక్క రోజే 480 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం సిర్పూర్లో 300 కిలోమీటర్ల రోడ్ మైలేజ్‌లో మరో 90 కిలోమీటర్లు మిగిలి ఉందని, వీటి పనులు కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు ద్వారా త్వరలో సాగు నీరందిస్తామన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలో 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఒక్క చెక్కూ వాపస్ చేయ్యలే : జోగు రామన్న దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్రస్తుతం సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ శుభపరిణామం అన్నారు. రైతుబంధు పథకంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఒక్క చెక్కు కూడా వాపస్ చేయలేదని ఎద్దేవా చేశారు. పోడు భూములపై గిరిజనులు ఆందోళన పడొద్దన్నారు. 2014 జూన్ 2కంటే ముందు పోడు సాగు చేస్తున్న వారికి సైతం పెట్టుబడి సాయం, రైతుబీమా కల్పిస్తామన్నారు. మిల్లు మూతపడినప్పుడు అనేక పార్టీలు వచ్చాయని, ఇప్పుడు ఆ పార్టీలు ఎక్కడ పోయాయని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షాన పని చేస్తోందని ఎంపీ గెడెం నగేశ్ అన్నారు. పూర్వ ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయండి : కోనప్ప మూతపడిన సర్‌సిల్క్ మిల్లు స్థానంలో మరో కొత్త పరిశ్రమ ఏదైనా ఏర్పాటు చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంత్రి కేటీఆర్‌ను కోరారు. సర్‌సిల్క్‌కు సంబంధించి 70 ఎకరాల భూమి వృథాగా ఉందని గుర్తు చేశారు. కొత్త పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. అంతేకాక కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు నిధులు ఇవ్వాలని కోరగా కేటీఆర్ అంగీకారం తెలిపారన్నారు. సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో ఏడు బ్రిడ్జిలు మంజూరు చేయాలన్నారు. బాబాసాగర్, సిర్పూర్, బంగళాపల్లి, సిద్దాపూర్, సైదాపూర్, రుద్రపూర్ నుంచి ఏటిగూడెం, దేవాజిగూడ వద్ద బ్రిడ్జిలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాగజ్‌నగర్ ప్రాంతంలో కొత్తగా ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిగ్రీ కళాశాల అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మంత్రులు పర్యటనలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్ సింగనేవార్, జిల్లా అ«టవీ శాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్‌నాయక్, కాగజ్‌నగర్ ఆర్డీవో రమేశ్‌బాబు, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డీఎస్పీలు సాంబయ్య, సత్యనారాయణ, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎస్పీఎం కార్మికులు పాల్గొన్నారు. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం మంత్రి కేటీఆర్ రాకను పురస్కరించుకుని టీఆర్ఎస్ శ్రేణల్లో ఉత్సాహం ఉరకలేసింది. కేటీఆర్ హెలిక్యాప్టర్ నుంచి దిగిన నుంచి మొదలు ఆయన తిరిగి వెళ్లేంత వరకు కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. బైక్ ర్యాలీలు, డప్పు వాయిద్యాలు, తదితర కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. మరోవైపు పేపర్ మిల్లు పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో కార్మికుల కుటుంబాలు ఉత్సాహంగా సభకు రావడం కనిపించింది. -
ఇక సిరుల సిర్పూర్
సాక్షి, ఆసిఫాబాద్: రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇందుకు అవసరమైతే ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. గురువారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న తదితరులతో కలసి కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత మిల్లులో జేకే కంపెనీ ప్రతినిధులతో కలసి పూజలు చేసి మిల్లు కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఎస్పీఎం గ్రౌండ్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘మూడున్నరేళ్లుగా మూతపడిన కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. మిల్లు పునరుద్ధరణ కోసం అనేక సార్లు బ్యాంకర్లతో చర్చలు జరిపాం. కేసులు ఇతర అన్ని అడ్డంకులు తొలగించేందుకు ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తదితర చోట్ల చర్చలు జరిపాం. ఎమ్మెల్యే కోనప్ప కాలికి బలపం కట్టుకుని తిరిగి మిల్లు ప్రారంభించేలా చేశారు. ఇందులో ఆయనదే ప్రధాన పాత్ర’’అని పేర్కొన్నారు. 60 చిన్న పరిశ్రమలను ఆదుకున్నాం వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపే పేపర్ మిల్లు ప్రారంభం కానుండటంతో కాగజ్‌నగర్‌కు పూర్వ వైభవం వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌లోని బిల్ట్ (ఏపీ రేయాన్ ప్యాక్టరీ), నల్లగొండ జిల్లాలోని భీమా సిమెంట్ ఫ్యాక్టరీ, రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ (ఎఫ్‌సీఐ)ల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని వివరించారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లోని ఓరియెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో మరో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని సీసీఐని కూడా తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 60 సూక్ష్మ పరిశ్రమలను ఆదుకున్నట్టు గుర్తు చేశారు. పెట్టుబడిదారులకు ఎర్రతివాచీలు పరచడమంటే స్థానిక యువతకు ఉపాధి కల్పించడమేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని కేటీఆర్ చెప్పారు. ఎందుకు గద్దె దించాలె? ‘‘ఓ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను గద్దె దింపేవరకు నిద్రపోను అని పదేపదే అంటున్నారు. ఎందుకు గద్దె దింపాలే? దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ çపథకాలు అమలు చేసినందుకా’’అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఆడబిడ్డల మేనమామగా పెళ్లి కానుక రూ.లక్ష నూట పదహార్లు ఇస్తున్నందుకా? కార్మిక పక్షపాతిగా ఉన్నందుకా? రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేల సాయం ఇస్తున్నందుకా? ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుకా? గర్భిణులకు కేసీఆర్ కిట్ల ద్వారా రూ.12 వేలు ఇస్తున్నందుకా? పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నందుకా? ప్రతి గురుకులాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నందుకా? రూ.200 పెన్షన్ వెయ్యికి పెంచినందుకా? ఎందుకు కేసీఆర్‌ను గద్దె దించాలె?’’అని అన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో, టీడీపీకి అమరావతిలో, బీజేపీకి నాగ్‌పూర్‌లో అధిష్టానాలు ఉంటే.. టీఆర్ఎస్కు కాగజ్‌నగర్ లాంటి గల్లీలో ఉంటుందన్నారు. గడ్డాలు పెంచుకుంటే, తొడలు, మెడలు కోసుకుంటే ముఖ్యమంత్రులు కాలేరని, ప్రజల మనసులు గెలుచుకోవాలని హితవు పలికారు. ఈ మధ్య ఏ టీవీలో చూసినా కాంగ్రెస్ వాళ్ల మాటలు వింటుంటే కక్కొస్తోందని, ఆఖరికి తమ ఇంట్లోని చిన్నపిల్లల్ని కూడా తిడుతున్నారని అన్నారు. -
‘సిర్పూర్’పై మళ్లీ ఆశలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రఖ్యాత కాగితపు తయారీ పరిశ్రమ, దశాబ్దాల చరిత్రగల ‘ద సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్’ పునరుద్ధరణపై ఆశలు చిగురిస్తున్నాయి. మూడున్నరేళ్లుగా మూతబడి ఉన్న ఈ పరిశ్రమ తిరిగి తెరుచుకునే దిశగా అడుగులు పడ్డాయి. ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) చేపట్టిన దివాలా వ్యాపార పరిష్కార ప్రక్రియ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసల్యూషన్ ప్రాసెస్–సీఐఆర్‌పీ) ఓ కొలిక్కి వచ్చింది. 80 ఏళ్ల చరిత్రగల ఈ కంపెనీని సొంతం (టేకోవర్) చేసుకుని పునరుద్ధరించేందుకు 8 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ట్రిబ్యునల్ నియమించిన రిసల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) కె.రామ్ రతన్ ఈ కంపెనీ పునరుద్ధరణ కోసం గతేడాది డిసెంబర్ 11న ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)కు ఆహ్వానించగా జేకే పేపర్ మిల్స్, వెస్ట్‌కోస్ట్ పేపర్ మిల్స్ (కోల్‌కతా), రిద్ధి సిద్ధి పేపర్ మిల్స్ (అహ్మదాబాద్), పాప్సెల్ (జర్మనీ), సెంచురీ పేపర్, ఐటీసీ పేపర్ మిల్స్, కోహినూర్ గ్రూప్ తదితర 8 కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. అయితే డిసెంబర్ 22తో ముగిసిన ఆసక్తి వ్యక్తీకరణ గడువును ఈ నెల 5 వరకు పొడిగించారు. 180 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గతేడాది నవంబర్ 20న ట్రిబ్యునల్ ఆదేశించగా మే నెలతో ఈ గడువు ముగియనుంది. ఆసక్తి వ్యక్తీకరణకు ముందుకొచ్చిన 8 కంపెనీల్లో నిబంధనల ప్రకారం అధిక అర్హతలుగల కంపెనీకి గడువులోగా సిర్పూర్ పేపర్ మిల్లును ట్రిబ్యునల్ అప్పగించనుంది. అన్నీ సవ్యంగా జరిగి మరో 6–8 నెలల్లో పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయితే పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయి. మిల్లును ముంచిన అప్పులు.. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1936లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సిర్పూర్ పేపర్ మిల్లు దేశంలోనే అత్యంత పురాతన పేపర్ మిల్లుగా ఖ్యాతిగాంచింది. 1950లో బిర్లా కుటుంబం ఈ మిల్లును టేకోవర్ చేసుకోగా అనంతర కాలంలో ఇది పొద్దార్ గ్రూప్ చేతికి వెళ్లింది. అయితే మిల్లు అవసరాల కోసం యాజమాన్యం 2007లో వివిధ బ్యాంకుల నుంచి రూ. వందల కోట్ల రుణాలు తీసుకొని చెల్లించలేకపోయింది. 2014 నాటికి ఈ రుణాలు వడ్డీలతో కలుపుకుని రూ. 425 కోట్లకు పెరిగిపోయాయి. పరిశ్రమ నిర్వహణకు చేసిన మరో రూ. 150 కోట్ల అప్పులు దీనికి జత కావడంతో మొత్తం రుణాలు రూ.600 కోట్లకు ఎగబాకాయి. ఈ సమయంలో మరమ్మతుల పేరుతో యాజమాన్యం 2014 సెప్టెంబర్ 27 నుంచి రెండు నెలల కోసం మిల్లును షట్‌డౌన్ చేసింది. ఈ కాలంలో విధులకు హాజరైనా కార్మికులకు జీతాలు చెల్లించలేకపోయింది. అలాగే మరమ్మతుల తర్వాత మిల్లును పునఃప్రారంభించకుండా చేతులెత్తేసింది. దీంతో 1,350 మంది రెగ్యూలర్ కార్మికులు, 400 మంది ఉద్యోగులతోపాటు మరో 1,200 తాత్కాలిక కార్మికులు, వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు... సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. మిల్లు పునరుద్ధరణ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 8 సార్లు పిలిచినా మిల్లు యజమాని ఆర్కే పొద్దార్ స్పందించలేదు. దీంతో ఐడీబీఐ బ్యాంకు నేతృత్వంలో ఏర్పడిన బ్యాంకుల కన్సార్షియం మిల్లును స్వాధీనం చేసుకొని వేలం నిర్వహించింది. మిల్లులోని యంత్రాలకు కాలం చెల్లడం, మిల్లు విలువతో పోల్చితే అప్పులే ఎక్కువగా ఉండటంతో వేలానికి స్పందన లభించలేదు. ఇదే కారణంతో తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సైతం పారిశ్రామికవర్గాల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఈ క్రమంలో మిల్లును పునఃప్రారంభించేందుకు ముందుకొస్తే రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ కింద అందించే అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలతోపాటు మెగా పరిశ్రమలకు అందించే ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బ్యాంకులకు యాజమాన్యం బకాయిపడిన రుణాలపై మారటోరియం విధించడంతోపాటు విద్యుత బిల్లుల బకాయిల భారాన్ని భరిస్తామని హామీ ఇచ్చింది. కాగితపు వ్యాపారంలో ఉన్న ఐటీసీ, రిద్దిసిద్ది, పాప్సెల్ తదితర కంపెనీలతో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె. తారకరామారావు స్వయంగా చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఐటీసీ, పాప్సెల్ యాజమాన్యాలు సిర్పూర్ మిల్లును సందర్శించి పరిస్థితులను అంచనా వేశాయి. మరోవైపు పొద్దార్ గ్రూప్ విజ్ఞప్తి మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ఈ మిల్లుకు సంబంధించిన దివాలా వ్యాపార పరిష్కార ప్రక్రియను చేపట్టింది. -
పీఎఫ్ కౌంటర్‌పై ఐడీబీఐ అభ్యంతరం
► క్రెడిట్ సొసైటీకి తాళం వేసిన అధికారులు ► డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎస్పీఎం కార్మికులు ► డీఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం కాగజ్‌నగర్: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు సంబంధించిన భవిష్య నిధి (పీఎఫ్) డబ్బులు చెల్లించేందుకు మిల్లులో ఏర్పాటు చేసిన పీఎఫ్ కౌంటర్ నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ కౌంటర్ నిర్వహణపై ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అధికారులు అభ్యంతరం తెలపడంతో ఈ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. కార్మికులకు సంబంధించిన పీఎఫ్ దరఖాస్తులు స్వీకరించేందుకు స్టాఫ్ గేట్ పక్కన గల క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో పీఎఫ్ కౌంటర్ ఏర్పాటు చేసి ఎస్పీఎం డీజీఎం రమేశ్‌రావు ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తుండగా శుక్రవారం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఐడీబీఐ అధికారుల ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది ఉదయం 9 గంటలకు క్రెడిట్ సొసైటీ కార్యాలయానికి తాళం వేయడంతో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. తాము పీఎఫ్ కోసం శాంతియుతంగా దరఖాస్తు చేసుకుంటే పీఎఫ్ కౌంటర్‌కు తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కార్మికులు దీనిపై ఎస్పీఎం డిప్యూటీ జనరల్ మేనేజర్ రమేశ్రావుకు సమాచారం అందించారు. దీంతో రమేశ్‌రావు అక్కడికి చేరుకొని సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కార్మికులు సైతం అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రమేశ్‌రావు కార్మికులతో వెళ్లి స్థానిక డీఎస్పీ హబీబ్ఖాన్కు విషయాన్ని వివరించారు. పీఎఫ్ కార్యాలయాన్ని శాంతియుంగా కొనసాగిస్తున్నా ఐడీబీఐ అధికారులు తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో డీఎస్పీ ఐడీబీఐ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఎస్పీఎం కార్మికులకు సంబంధించిన పీఎఫ్ దరఖాస్తులు క్రెడిట్ సొసైటీ కేంద్రంగా స్వీకరిస్తే బ్యాంక్ అధికారులకు ఎటువంటి నష్టం జరగదని, ఈ విషయంలో సహకరించాలని సూచించారు. డీఎస్పీ జోక్యంతో సొసైటీకి వేసిన తాళాన్ని సిబ్బంది తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా రమేశ్‌రావు మాట్లాడుతూ పీఎఫ్ దరఖాస్తులు స్వీకరించడానికి మాత్రమే క్రెడిట్ సొసైటీని వినియోగిస్తున్నామని, ఇందులో అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం 11గంటలకు క్రెడిట్ సొసైటీ తాళం తీయడంతో కార్మికులు తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు. శుక్రవారం 70 మంది కార్మికులు పీఎఫ్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు రమేశ్‌రావు తెలిపారు. -
సిర్పూర్ పేపర్ మిల్లులో అగ్నిప్రమాదం
ఆసిఫాబాద్: జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా పూర్తి ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. -
కుట్రతోనే ‘సిర్పూర్’ మిల్లు మూత
♦ ఇది అదనపు రాయితీలు పొందే రహస్య ఎజెండా: కేటీఆర్ ♦ పునరుద్ధరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వివరణ ♦ ‘ఉదయ్’తో నేరుగా రాష్ట్రానికి వచ్చేదేమీ లేదు: జగదీశ్‌రెడ్డి ♦ మితిమీరిన వేగంపై 25 వేల కేసులు: మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: సిర్పూర్ పేపర్ మిల్లు మూత పడటం వెనుక యాజమాన్య కుట్ర దాగున్నట్లుగా భావిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అదనపు రాయితీలు పొందే రహస్య ఎజెండా యాజమాన్యానికి ఉన్నట్లు అనిపిస్తోందని తెలిపారు. శనివారం శాసనసభలో సిర్పూర్ పేపర్ మిల్లుపై కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, టీఆర్ఎస్ సభ్యుడు దుర్గం చిన్నయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే మిల్లు మూతపడే పరిస్థితిలో ఉందని, ఏర్పాటు తర్వాత మూడు నెలలకే మూసేశారని కేటీఆర్ తెలిపారు. దీనిపై యాజమాన్యంతో అనేకమార్లు చర్చించామని, అయితే వారి కోరికలు అనంతంగా ఉన్నాయని, భవిష్యత్ ప్రణాళిక సరిగా లేదని చెప్పారు. పదేళ్ల కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని కోరినా మిల్లు యాజమాన్యం నుంచి స్పందన లేదని వెల్లడించారు. మిల్లు మూతపడే సమాచారం రాగానే పవర్ సబ్సిడీ కింద రూ.5 కోట్లు ఇచ్చామని, తర్వాతి ఏడాదిలో మరో రూ.2.19 కోట్ల సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. మిల్లును తిరిగే తెరిపించే దిశలో ఐటీసీ, జేకే పేపర్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపామని చెప్పారు. రామగుండం ఎఫ్‌సీఐ, ఆదిలాబాద్‌లోని సీసీఐ, వరంగల్‌లోని బిల్ట్ సంస్థలు మూతపడితే తెరిపించామని, సిర్పూర్ మిల్లును తెరిపించే ప్రయత్నం చేస్తామన్నారు. మిల్లు తెరిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేస్తున్న కృషినిసభ్యులు కొనియాడారు. రవాణా శాఖలో అంతా ఆన్లైన్ రవాణా శాఖలో అన్ని అనుమతుల జారీని ఆన్లైన్ చేస్తున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆన్లైన్లో వాహన కాలుష్య ధ్రువీకరణ జారీకి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2008లో ప్రారంభించిన ఆన్లైన్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నేడు 57 సేవలకు విస్తరించిందని, ఇప్పటిరవకు 6.41 లక్షల లర్నింగ్, 6.13 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, 10.59 లక్షల రిజిస్ట్రేషన్లు, 2.48 లక్షల ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందించామని వివరించారు. వేగ నియంత్రణకు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, మితిమీరిన వేగానికి సంబంధించి ఆర్టీఏ అధికారులు 25 వేల కేసులు నమోదు చేశారని వెల్లడించారు. టీఆర్ఎస్ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, జలగం వెంకట్రావు, కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాలకు వేగ నియంత్రణ తప్పనిసరి చేశామని చెప్పారు. మరోవైపు పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులను పెంచాలని టీఆర్ఎస్ సభ్యులు గొంగిడి సునీత, ఏనుగు రవీందర్‌రెడ్డి కోరారు. దీనికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, సభ్యుల వినతిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఉదయ్’తో ప్రత్యేక ప్రయోజనం లేదు కేంద్రం తెచ్చిన ఉదయ్ పథకంతో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ‘కొన్ని రాష్ట్రాల్లో డిస్కమ్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. దీంతో ఉదయ్ పథకంలో చేరిన రాష్ట్రాలకు కేంద్రం బాండ్లు అందజేసింది. మార్కెట్లో పెట్టిన గంటలోపే తెలంగాణ బాండ్ల విక్రయాలు జరిగాయి’ అని వెల్లడించారు. సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, వేముల వీరేశం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తంగా రూ.1,350 కోట్ల సాయం అందగా, అందులో రూ.810 కోట్లు గ్రాంట్ల రూపంలోనే అందినట్లు చెప్పారు. ఉదయ్ పథకంలో చేరినందున 20 శాతం గ్రాంటు ఇవ్వాలని కోరినా కేంద్రం సాధ్యం కాదని చెప్పిందన్నారు. -
ఉపాధి కరువై.. బతుకు బరువై..
- రెండేళ్లయినా పునరుద్ధరణకు నోచుకోని సిర్పూర్ పేపర్ మిల్లు - ఆవేదనతో తనువు చాలించిన 17 మంది కార్మికులు - దీనావస్థలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు - పొట్టచేతబట్టుకుని వలస వెళ్లిన కొందరు కార్మికులు - పట్టించుకోని సర్కారు.. పునరుద్ధరిస్తామన్న హామీ నీటి పాలు సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: వీరిద్దరే కాదు.. సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడడంతో రోడ్డునపడిన దాదాపు ఐదు వేల మంది కార్మికులు, ఉద్యోగుల దుస్థితి ఇది. ఘనచరిత్ర కలిగిన సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) మూతపడి మంగళవారంతో సరిగ్గా రెండేళ్లు గడుస్తోంది. ఈ మిల్లులో ఉత్పత్తి తిరిగి ప్రారంభమవుతుందని, తమకు ఉపాధి లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్మికులకు మాత్రం నిరాశే మిగులుతోంది. మిల్లు నడిచినన్ని రోజులు కూడుగుడ్డకు లోటు లేకుండా బతికిన కార్మిక కుటుంబాలు.. ఇప్పుడు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి దీనావస్థలో ఉన్నాయి. కుటుంబ పోషణ భారమై కష్టాల్లో కూరుకుపోయాయి. ఈ ఆవేదనతోనే రెండేళ్లలో 17 మంది ఎస్పీఎం కార్మికులు తనువు చాలించారు. వేతనాలు రాక, అప్పులు పుట్టక కుటుంబాన్ని పోషించే మార్గం లేక.. ఉరి వేసుకుని, కిరోసిన్ పోసుకుని నలుగురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక వేతనాలు లేకపోవడంతో కార్మికులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లింపు కూడా నిలిచిపోయింది. దీంతో అనారోగ్యాలకు చికిత్స చేయించుకోలేక మరో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మిల్లు ప్రారంభమవుతుందని, తిరిగి ఉపాధి లభిస్తుందని పెట్టుకున్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లడంతో ఏడుగురు కార్మికులు గుండెపోటుతో మరణించారు. కొన్ని కార్మిక కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వలస బాట పట్టగా.. మరి కొం దరు కార్మికులు భవన నిర్మాణ కూలీలుగా మారా రు. ఉద్యోగులు పలు ప్రైవేటు సంస్థల్లో గుమస్తాలుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. మరికొందరు స్థానికంగా పనులు లభించక మంచిర్యాల, చంద్రాపూర్, హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు వలస వెళ్లిపోయారు. ఆధునీకరణ పేరిట.. యాజమాన్యం మిల్లు ఆధునీకరణ పేరిట బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో సుమారు రూ.420 కోట్ల రుణాలకు సంబంధించి 2016 మార్చి 4న ఐడీబీఐ, కెనరా, ఆంధ్రా బ్యాంక్, ఎస్బీఐ తదితర బ్యాంకులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాయి. అయినా స్పందించకపోవడంతో.. బహిరంగ నోటీసులు జారీ చేసి మిల్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మిల్లును టేకోవర్ చేసేందుకు కాగితపు ఉత్పత్తి రంగంలో ఉన్న జేకే ఇండస్ట్రీస్, ఐటీసీ వంటి సంస్థల ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. తాజాగా చెక్‌రిపబ్లిక్ దేశానికి చెందిన పెప్సిల్ అనే కంపెనీ సిర్పూర్ మిల్లును టేకోవర్ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. దీంతో కార్మికుల్లో కొంత ఆశలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి సిర్పూర్ పేపర్‌మిల్లు కార్మికులను ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు హామీలిచ్చారు. మిల్లులో ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ రెండేళ్లు గడిచినా.. ఆ దిశగా ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. రోడ్డున పడ్డ 5 వేల మంది.. ఎస్పీఎంలో సుమారు 1,250 మంది పర్మినెంట్ కార్మికులు, 500 మంది కార్యాలయ ఉద్యోగులు, మరో 1,600 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. మిల్లు నడిచినన్ని రోజులు వీరితో పాటు పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించేది. ఎస్పీఎం యాజమాన్యం 2014 సెప్టెంబర్ 27న షట్‌డౌన్ పేరిట మిల్లులో కాగితం ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పటి నుంచి ఉద్యోగులు, పర్మినెం ట్ కార్మికులకు వేతనాలు నిలిచిపోయా యి. వారు ప్రతిరోజు విధులకు హాజరవుతున్నప్పటికీ పనులు లేక ఇంటి ముఖం పడుతున్నారు. వారి పరిస్థితి దయనీయంగా మారింది. సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుడిగా పనిచేసే ఎం.శంకర్... మిల్లు మూతపడడంతో స్థానిక ఓ ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా చేరారు. మిల్లు నడిచేటప్పుడు దర్జాగా గడిపిన ఈయన.. ఇప్పుడు నెలకు వస్తున్న రూ.2,500 జీతం ఎటూ సరిపోక.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.. బజ్జీల బండి నడుపుకునే వెంకటేశ్. సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుడిగా పనిచేసేవారు. మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఉపాధి కోల్పోయారు. మిల్లు ప్రారంభమవుతుందని రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కాగజ్‌నగర్‌లోని రాజీవ్ చౌక్‌లో బజ్జీల బండి పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. -
సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలి
అఖిలపక్ష నేతల డిమాండ్ హైదరాబాద్: మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని, 10 నెలల వేతన బకాయిలు ఇప్పిం చాలని, కార్మికులకు శాశ్వత ఉద్యోగభద్రత కల్పిం చాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వాయిదా తీర్మానమిచ్చి సభను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. సిర్పూరు పేపర్ మిల్లును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిర్పూరు పేపర్ మిల్లు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపా ర్కు వద్ద కుటంబసభ్యులతో కలసి కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 4 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ మిల్లు తెలంగాణ ఏర్పడిన కొద్దిమాసాలకే మూతపడడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సిర్పూరు పేపర్ మిల్లు యూనియన్ నాయకుడైన కార్మిక, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెంటనే సీఎంతో మాట్లాడి మిల్లును తెరిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడమేనా అని ప్రశ్నించారు. మిల్లును తెరిపించడానికి కేంద్ర సహాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీపీఎం నేత వెంకటేష్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్, సీపీఐ నేత గుండా మల్లేశ్, టీడీపీ నేత రమేష్ రాథోడ్, మాజీమంత్రి బోడ జనార్దన్, ఐఎఫ్టీయూ నాయకులు ఎస్ఎల్ పద్మ, సిర్పూరు పేపరు మిల్లు సంరక్షణ సమితి కన్వీనర్ శ్రీనివాసు పాల్గొన్నారు. -
ఇందిరాపార్క్ వద్ద పేపర్ మిల్లు కార్మికులు ధర్నా
ఆదిలాబాద్ : మూసివేసిన సిర్పుర్ పేపర్ మిల్లు వెంటనే తెరిపించాలని ఆ సంస్థ కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 11 నెలలుగా మూసివేసిన పేపర్ మిల్లు తిరిగి తెరిపించాలని కోరుతూ మిల్లు కార్మికులు ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ధర్నాతో ఇందిరాపార్క్ పరిసర ప్రాంతం జనంతో కిటకిటలాడుతుంది. పేపర్ మిల్లు కార్మికుల చేపట్టిన ఈ ధర్నాకు వామపక్షాలు, తెలుగుదేశం, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి. -
'సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపిస్తాం'
ఆదిలాబాద్(బెజ్జూరు): మూతపడిన సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును తెరిపించి కార్మికులను ఆదుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన మంగళవారం బెజ్జూరులో కొత్త పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... త్వరలో యాజమాన్యంతో మాట్లాడి సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లును త్వరలో తెరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు. -
ఉద్యోగాలు వచ్చుడు కాదు... ఊడుతున్నాయి
కాగజ్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, కొత్త ఉద్యోగాలు వచ్చుడు కాదు.. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయని టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం(సిర్పూర్ పేపర్ మిల్లు) కార్మికులకు మద్దతుగా నిర్వహించిన మహాధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానికంగా విలేకరులతో సమావేశమయ్యారు. నిజాం నవాబు స్థాపించిన ఎస్పీఎం మూతపడడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు అంటూ ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పిన కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయని అన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 27 నుంచి సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోయి, మూతబడే స్థాయికి చేరుకోగా.. ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాలేదని అన్నారు. మిల్లు గుర్తింపు కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా సాక్షాత్తు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యుల బాధలు, ఆకలి కేకలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్మిక సమస్యలపై కళ్లు మూసుకుందని ధ్వజమెత్తారు. ఎస్పీఎం సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు. మిల్లు మూతపడిందనే మనస్తాపంతో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. -
ఎస్పీఎం కార్మికుల పిల్లల ఫీజు చెల్లించిన ఎమ్మెల్యే
కాగజ్‌నగర్ టౌన్ : సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడిపోవడంతో పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న కార్మికుల పిల్లల ఫీజులు తామే చెల్లిస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇచ్చిన మాట నెరవేర్చారు. పలువురు దాతలు, మంత్రి జోగు రామన్నతోపాటు తన సొంత డబ్బులతో పిల్లల వార్షిక ఫీజులు చెల్లించారు. గత నెల 28న ఉప ముఖ్యమంత్రి శ్రీహరి చేతుల మీదుగా ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు రూ.14లక్షలు ఫీజు అందజేశారు. తాజాగా శుక్రవారం ద్వారకానగర్‌లోని సరస్వతీ శిశుమందిర్‌లో వివిధ పాఠశాలల కరస్పాండెంట్లకు రూ.7 లక్షలు ఫీజు చెల్లించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ యూజ మాన్యం మొండి వైఖరి వల్ల మిల్లులు ఉత్పత్తి నిలిచిపోయిందని, దీంతో కార్మికులు జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పిల్లల చదువు ఆగకుండా తాము బాధ్యత తీసుకుని ఫీజులు చెల్లించామని వెల్లడించా రు. ఫీజులు చెల్లించడానికి తన జీతంతోపాటు దాతలు వెంకటరాంరెడ్డి(హైదరాబాద్), పవన్‌రెడ్డి, రవీందర్రావు, నర్సింగోజు సత్యనారాయణ(కాగజ్‌నగర్) సహకరించారని తెలిపారు. ఫీజుల కోసం ఇప్పటికే రూ.21లక్షలు చెల్లించామని, త్వరలో మిగితా రూ.7లక్షలు ఇతర పాఠశాలల నిర్వాహకులకు అందజేస్తామని హామీనిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ సీపీ విద్యావతి, పట్టణ సీఐ జలగం నారాయణరావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ దామోదర్‌రావు, ఎంఈవో భిక్షపతి, కౌన్సిలర్లు నియాజుద్దీన్ బాబా, బొద్దున విద్యావతి, నాయకులు జాకీర్ షరీఫ్, దినేష్ అసోపా, సీపీ రాజ్‌కుమార్, పెద్దపల్లి కిషన్‌రావు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ఎస్పీఎం కార్మికులు
కాగజ్‌నగర్‌టౌన్ : కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం(సిర్పూర్ పేపర్‌మిల్లు) తెరిపించాలనే డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఓ వైపు కార్మికుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. కార్మికులకు సంఘీభావంగా అంగన్వాడీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. మిల్లులో తక్షణమే ప్రారంభించి ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్పీఎం కార్మికులు మంగళవారం రోడ్డెక్కారు. కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ముందు నుంచి నాయకులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు భారీ సంఖ్యలో పాదయాత్రగా ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. మిల్లును ప్రారంభించే వరకు ఆందోళనలు, శాంతియుత పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండు గంటలపాటు కొనసాగిన రాస్తారోకో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. పట్టణ సీఐ జలగం నారాయణరావు, ఎస్సై అబ్దుల్‌మజీద్‌లు రాస్తారోకో విరమింపజేశారు. విద్యార్థుల ర్యాలీ ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు పట్టణంలో కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఏబీవీపీ నాయకుడు అన్నం నాగార్జున, ఎస్ఎఫ్ఐ నాయకులు కుబిడె రాకేష్, ఎన్నం ఆశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పేపర్‌మిల్లు ఎదుట దీక్షా శిబిరానికి చేరుకుని కార్మికులకు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మార్కెట్లో భారీ ర్యాలీ నిర్వహించి, కార్మికులకు మద్దతు పలికారు. ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో రోజుకు రిలే దీక్షలు మిల్లు తెరిపించాలని, కార్మికులకు నెల నెల వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు మిల్లు ఎదుట చేపట్టిన రిలేదీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. దీక్షలో కార్మికులు వేముల వెంకటేష్, వికాస్‌నాయక్, ఎన్,రాజయ్య, అంబాల అంజయ్య, బస్వచార్యులు, శ్రీనివాసన్, కొరగంటి చంద్రయ్య, బి.సుభాష్, చంద్రశేఖర్, కోట శంకర్ కూర్చున్నారు. కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి నాయకులు ఈర్ల విశ్వేశ్వర్రావు, కూశన రాజన్న, షబ్బీర్ అహ్మద్(ఛోటా), మురళీ, అంబాల ఓదేలు, ముంజం శ్రీనివాస్, వెంకటేష్, కార్మికులు పాల్గొన్నారు. -
పేపర్‌మిల్లును ప్రభుత్వమే నడపాలి
కాగజ్‌నగర్ టౌన్ : కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లును ప్రభుత్వమే నడపాలని, ఉత్పత్తి ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష మాజీ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. రోజురోజుకు మిల్లు సమస్య జటిలమవుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టిం చుకోకపోవడాన్ని నిరసిస్తూ ఎస్పీఎం కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మిల్లు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. గుండా మల్లేశ్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పని దొరకక, తద్వారా వేతనాలు రాక 1600 మంది కాంట్రాక్టు కార్మికులు అర్ధాకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం మౌనం వహించద ని ఆరోపించారు. మరోవైపు యాజ మాన్యం ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నిలిపివేసి, మిల్లును మూతబడే దశకు తీసుకువస్తోందని, అయినా ముఖ్యమంత్రి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని, పట్టణం మొత్తంలో వ్యాపారాలు పడిపోయాయన్నారు. కార్మికుల పక్షాన ఢిల్లీ దాకా పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఈర్ల విశ్వేశ్వర్రావు, ముర ళి, షబ్బీర్ అహ్మద్ (చోటా), ముంజం శ్రీనివాస్, వెంకటేశ్, అంబాల ఓదేలు, వేణు, వొల్లాల సుభాష్, రాజ్‌గోపాల్, భూమయ్య, హఫిజ్‌ఖాన్, అన్నం రాజయ్యతో పాటు కార్మికులు పాల్గొన్నారు. మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో పట్టణ సీఐ జలగం నారాయణరావు, ఎస్పై అబ్దుల్‌మజీద్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మిల్లును పునరుద్ధరించండి ఆదిలాబాద్ అర్బన్ : సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేసి దాదాపు నాలుగు నెలలు గడుస్తుందని, వెంటనే పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు కలెక్టర్ ఎం.జగన్మోహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పరిశ్రమలో సుమారు పర్మినెంట్ కార్మికులు 1500 మంది, కాంట్రాక్టు కార్మికులు 600 మంది, స్టాఫ్ 600 మంది పని చేస్తున్నారన్నారు. గత నాలుగు నెలలుగా పరిశ్రమ ఉత్పత్తి నిలిపివేయడంతో కాంట్రాక్టు కార్మికులు వీధిన పడ్డారన్నారు. డిసెంబర్ నుంచి పర్మినెంట్ కార్మికులకు సైతం వేతనాలు నిలిపివేశారని, దీంతో ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న ఏకైక పేపర్ పరిశ్రమ మూతపడకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మల్లేశ్, పోశెట్టి, స్వామి, మయూరిఖాన్ ఉన్నారు. -
కొనసాగుతున్న కార్మికుల ఆందోళన
కాగజ్‌నగర్‌టౌన్ : కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళలు కొనసాగుతూనే ఉన్నాయి. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచి 46 రోజులు గడుస్తున్నా యాజమాన్యం గానీ, ప్రభుత్వంగానీ స్పందించకపోవడం, డ్యూటీలు లభించకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. బుధవారం పట్టణంలో భిక్షాటన చేసిన కార్మికులు, గురువారం మిల్లు ప్రధాన ద్వారం వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో అందులో పని చేసే 1600 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారని, విధులు దొరకక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకుండా కాంట్రాక్టు కార్మికులకు విధుల నుంచి దూరం చేయడం విడ్డూరమన్నారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు సిర్పూర్ పేపర్ మిల్లు ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) నాయకులు సంపూర్ణ మద్దతు పలికారు. సంఘం నాయకులు అంబాల ఓదెలు వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని కార్మికుల పక్షాన ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. పేపర్ మిల్లు పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తీసుకునేందుకు అధికార గుర్తింపు సంఘం నాయకులు ముందుకు రావాలన్నారు. గుర్తింపు సంఘం నాయకుల వైఫల్యంవల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సంఘం 6 మన్ కమిటీ నాయకులు గొలెం వెంకటేశ్, యాకబ్, అంజయ్య, ఎస్కే నవాబ్, ఎమ్మాజీ సంతోష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీఎం ఎన్నికలు ప్రశాంతం
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం)లో బుధవారం నిర్వహించిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హెచ్ఎంఎస్ తెలంగాణ వర్కర్స్ యూనియన్ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి విజయం సాధించారు. మొత్తం 1,639 ఓట్లకు 1,600 ఓట్లు పోలయ్యా యి. ఇందులో తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నం. ఇ.2863) అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డికి 630 ఓట్లు రాగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దుతుతో బరిలో నిలిచిన ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్(ఇ.1425) అభ్యర్థి ఐఎన్టీయూసీ జాతీయ నాయకుడు సంజీవరెడ్డికి 421 ఓట్లు వచ్చాయి. నాయిని నర్సింహారెడ్డి 209 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు కార్మికశాఖ ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ దండపాణి ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా సాయంత్రం 6 గంటకు కౌంటింగ్ నిర్వహించారు. పోటాపోటీగా ప్రచారం ఉదయం 6 గంటల నుంచే మిల్లు ఆవరణలో ఆయా యూనియన్ల నాయకులు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. మిల్లు వచ్చే కార్మికులకు తమకే ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గీయులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు, బీఎంఎస్ అభ్యర్థి భట్టాచార్య వర్గీయులు సాయంత్రం వరకు పోటాపోటీ నినాదాలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత సాయంత్రం 4 గంటల అనంతరం మిల్లు నుంచి బ్యాలెట్ బాక్సులను ఎస్పీఎం హెచ్ఆర్డీ హాల్‌కు తరలించారు. ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభించగా హాల్లోకి మీడియాను అనుమతించలేదు. గతంలో నిర్వహించిన ప్రతీ ఎన్నికల కౌంటింగ్ తమ సమక్షంలో జరిగేవని, ప్రస్తుతం మీడియాను అనుమతించకపోవడంలో ఆంతర్యమేంటని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీసీఎల్ దండపానిని నిలదీయగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ సురేశ్‌బాబు జోక్యంతో చివరకు కేవలం ఫొటోలు తీసుకోవడానికి అనుమతించారు. యూనియన్లవారీగా పోలైన ఓట్లు 1,639 ఓట్లకు 1,600 ఓట్లు(98 శాతం) పోలయ్యాయి. ఇందులో ఎస్పీఎం తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నెం. ఇ.2863) అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డికి 630 ఓట్లు, ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్(ఇ.1425) అభ్యర్థి ఐఎన్టీయూసీ జాతీయ నాయకుడు సంజీవరెడ్డికి 421, బీఎంఎస్ అనుబంధ ఎస్పీఎం వర్కర్స్ యూనియన్ అభ్యర్థి కల్లోల భట్టాచార్యకు 306, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు మద్దతుతో బరిలో నిలిచిన తెలుగునాడు కార్మికపరిషత్ అభ్యర్థి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు 180, సీఐటీయూ మజ్దూర్ యూనియన్ అభ్యర్థి సాయిబాబుకు 33, ఐఎన్టీయూసీ ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.966) అభ్యర్థి విజయలక్ష్మి 18, ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.2381)కు 04, తెలంగాణ ఎస్పీఎం కార్మిక పరిషత్ (ఇ.734) 02 ఓట్లు, ఎస్పీఎం ఎంప్లాయీస్ సంఘ్ (ఇ.1028) 0, చెల్లని ఓట్లు 6 పోలయ్యాయి. విజయోత్సవ ర్యాలీ నాయిని నర్సింహారెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడంతో టీఆర్ఎస్ వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నెం. ఇ.2863) ప్రధాన కార్యదర్శి ఈర్ల విశ్వేశ్వర్రావు హెచ్ఆర్డీ హాల్ నుంచి బయటకు వెళ్లి విజయం సాధించిన విషయాన్ని కార్యకర్తలకు తెలుపగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ కార్యాలయం వరకు బాణాసంచా పేల్చుతూ రంగులు చల్లుకుంటూ ర్యాలీ నిర్వహించగా నాయిని నర్సింహారెడ్డితోపాటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈర్ల విశ్వేశ్వర్రావు, ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, నాయకులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, సురేశ్‌యాదవ్, విజయ్‌యాదవ్, దోణి శ్రీశైలం, అశోక్, మాచర్ల శ్రీనివాస్, గజ్జి వాసుదేవ్, లెండుగురె శ్యాంరావు, కోయవాగు సర్పంచ్ మల్లేశ్ పాల్గొన్నారు. భారీ బందోబస్తు ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో మిల్లు ఆవరణలో భారీ బందోబస్తు నిర్వహించారు. కాగజ్‌నగర్ టౌన్ సీఐ రవికుమార్, రూరల్ సీఐ రహెమాన్, వాంకిడి సీఐ తిరుపతి, రూరల్ ఎస్సై తిరుపతి, ఈజ్గాం ఎస్సై సురేందర్, సిర్పూర్(టి) ఎస్సై శ్యాంసుందర్, బెజ్జూర్ ఎస్సై తారాచంద్తోపాటూ ప్రొబీషనరీ ఎస్సైలు మోహన్‌బాబు, ప్రభాకర్, పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.