ఉపాధి కరువై.. బతుకు బరువై.. | 17 workers commit suicide | Sakshi
Sakshi News home page

ఉపాధి కరువై.. బతుకు బరువై..

Published Tue, Sep 27 2016 11:46 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

ఉపాధి కరువై.. బతుకు బరువై..

ఉపాధి కరువై.. బతుకు బరువై..

- రెండేళ్లయినా పునరుద్ధరణకు నోచుకోని సిర్పూర్ పేపర్ మిల్లు
- ఆవేదనతో తనువు చాలించిన 17 మంది కార్మికులు
- దీనావస్థలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు
- పొట్టచేతబట్టుకుని వలస వెళ్లిన కొందరు కార్మికులు
- పట్టించుకోని సర్కారు.. పునరుద్ధరిస్తామన్న హామీ నీటి పాలు

 
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: వీరిద్దరే కాదు.. సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడడంతో రోడ్డునపడిన దాదాపు ఐదు వేల మంది కార్మికులు, ఉద్యోగుల దుస్థితి ఇది. ఘనచరిత్ర కలిగిన సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) మూతపడి మంగళవారంతో సరిగ్గా రెండేళ్లు గడుస్తోంది. ఈ మిల్లులో ఉత్పత్తి తిరిగి ప్రారంభమవుతుందని, తమకు ఉపాధి లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్మికులకు మాత్రం నిరాశే మిగులుతోంది. మిల్లు నడిచినన్ని రోజులు కూడుగుడ్డకు లోటు లేకుండా బతికిన కార్మిక కుటుంబాలు.. ఇప్పుడు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి దీనావస్థలో ఉన్నాయి. కుటుంబ పోషణ భారమై కష్టాల్లో కూరుకుపోయాయి.

ఈ ఆవేదనతోనే రెండేళ్లలో 17 మంది ఎస్పీఎం కార్మికులు తనువు చాలించారు. వేతనాలు రాక, అప్పులు పుట్టక కుటుంబాన్ని పోషించే మార్గం లేక.. ఉరి వేసుకుని, కిరోసిన్ పోసుకుని నలుగురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక వేతనాలు లేకపోవడంతో కార్మికులకు ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్ చెల్లింపు కూడా నిలిచిపోయింది. దీంతో అనారోగ్యాలకు చికిత్స చేయించుకోలేక మరో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మిల్లు ప్రారంభమవుతుందని, తిరిగి ఉపాధి లభిస్తుందని పెట్టుకున్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లడంతో ఏడుగురు కార్మికులు గుండెపోటుతో మరణించారు. కొన్ని కార్మిక కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వలస బాట పట్టగా.. మరి కొం దరు కార్మికులు భవన నిర్మాణ కూలీలుగా మారా రు. ఉద్యోగులు పలు ప్రైవేటు సంస్థల్లో గుమస్తాలుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్నారు. మరికొందరు స్థానికంగా పనులు లభించక మంచిర్యాల, చంద్రాపూర్, హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు వలస వెళ్లిపోయారు.

ఆధునీకరణ పేరిట..
యాజమాన్యం మిల్లు ఆధునీకరణ పేరిట బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో సుమారు రూ.420 కోట్ల రుణాలకు సంబంధించి 2016 మార్చి 4న ఐడీబీఐ, కెనరా, ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బీఐ తదితర బ్యాంకులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాయి. అయినా స్పందించకపోవడంతో.. బహిరంగ నోటీసులు జారీ చేసి మిల్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మిల్లును టేకోవర్ చేసేందుకు కాగితపు ఉత్పత్తి రంగంలో ఉన్న జేకే ఇండస్ట్రీస్, ఐటీసీ వంటి సంస్థల ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. తాజాగా చెక్‌రిపబ్లిక్ దేశానికి చెందిన పెప్సిల్ అనే కంపెనీ సిర్పూర్ మిల్లును టేకోవర్ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. దీంతో కార్మికుల్లో కొంత ఆశలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి సిర్పూర్ పేపర్‌మిల్లు కార్మికులను ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు హామీలిచ్చారు. మిల్లులో ఉత్పత్తి తిరిగి ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ రెండేళ్లు గడిచినా.. ఆ దిశగా ఒక్క అడుగుకూడా ముందుకు
 పడలేదు.
 
రోడ్డున పడ్డ 5 వేల మంది..
ఎస్పీఎంలో సుమారు 1,250 మంది పర్మినెంట్ కార్మికులు, 500 మంది కార్యాలయ ఉద్యోగులు, మరో 1,600 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. మిల్లు నడిచినన్ని రోజులు వీరితో పాటు పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించేది. ఎస్పీఎం యాజమాన్యం 2014 సెప్టెంబర్ 27న షట్‌డౌన్ పేరిట మిల్లులో కాగితం ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పటి నుంచి ఉద్యోగులు, పర్మినెం ట్ కార్మికులకు వేతనాలు నిలిచిపోయా యి. వారు ప్రతిరోజు విధులకు హాజరవుతున్నప్పటికీ పనులు లేక ఇంటి ముఖం పడుతున్నారు. వారి పరిస్థితి దయనీయంగా మారింది.


సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుడిగా పనిచేసే ఎం.శంకర్... మిల్లు మూతపడడంతో స్థానిక ఓ ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా చేరారు. మిల్లు నడిచేటప్పుడు దర్జాగా గడిపిన ఈయన.. ఇప్పుడు నెలకు వస్తున్న రూ.2,500 జీతం ఎటూ సరిపోక.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు..

 
బజ్జీల బండి నడుపుకునే వెంకటేశ్. సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మికుడిగా పనిచేసేవారు. మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఉపాధి కోల్పోయారు. మిల్లు ప్రారంభమవుతుందని రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కాగజ్‌నగర్‌లోని రాజీవ్ చౌక్‌లో బజ్జీల బండి పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement