సాక్షి, ఆసిఫాబాద్: రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇందుకు అవసరమైతే ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. గురువారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న తదితరులతో కలసి కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం) పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత మిల్లులో జేకే కంపెనీ ప్రతినిధులతో కలసి పూజలు చేసి మిల్లు కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అనంతరం ఎస్పీఎం గ్రౌండ్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘మూడున్నరేళ్లుగా మూతపడిన కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. మిల్లు పునరుద్ధరణ కోసం అనేక సార్లు బ్యాంకర్లతో చర్చలు జరిపాం. కేసులు ఇతర అన్ని అడ్డంకులు తొలగించేందుకు ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తదితర చోట్ల చర్చలు జరిపాం. ఎమ్మెల్యే కోనప్ప కాలికి బలపం కట్టుకుని తిరిగి మిల్లు ప్రారంభించేలా చేశారు. ఇందులో ఆయనదే ప్రధాన పాత్ర’’అని పేర్కొన్నారు.
60 చిన్న పరిశ్రమలను ఆదుకున్నాం
వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపే పేపర్ మిల్లు ప్రారంభం కానుండటంతో కాగజ్‌నగర్‌కు పూర్వ వైభవం వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌లోని బిల్ట్ (ఏపీ రేయాన్ ప్యాక్టరీ), నల్లగొండ జిల్లాలోని భీమా సిమెంట్ ఫ్యాక్టరీ, రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ (ఎఫ్‌సీఐ)ల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని వివరించారు.
మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లోని ఓరియెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో మరో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని సీసీఐని కూడా తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
ఈ సెంటర్ ద్వారా ఇప్పటివరకు 60 సూక్ష్మ పరిశ్రమలను ఆదుకున్నట్టు గుర్తు చేశారు. పెట్టుబడిదారులకు ఎర్రతివాచీలు పరచడమంటే స్థానిక యువతకు ఉపాధి కల్పించడమేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని కేటీఆర్ చెప్పారు.
ఎందుకు
గద్దె దించాలె?
‘‘ఓ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను గద్దె దింపేవరకు నిద్రపోను అని పదేపదే అంటున్నారు. ఎందుకు గద్దె దింపాలే? దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ çపథకాలు అమలు చేసినందుకా’’అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘‘ఆడబిడ్డల మేనమామగా పెళ్లి కానుక రూ.లక్ష నూట పదహార్లు ఇస్తున్నందుకా? కార్మిక పక్షపాతిగా ఉన్నందుకా? రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేల సాయం ఇస్తున్నందుకా? ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుకా? గర్భిణులకు కేసీఆర్ కిట్ల ద్వారా రూ.12 వేలు ఇస్తున్నందుకా? పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తున్నందుకా? ప్రతి గురుకులాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నందుకా? రూ.200 పెన్షన్ వెయ్యికి పెంచినందుకా? ఎందుకు కేసీఆర్‌ను గద్దె దించాలె?’’అని అన్నారు.
కాంగ్రెస్ ఢిల్లీలో, టీడీపీకి అమరావతిలో, బీజేపీకి నాగ్‌పూర్‌లో అధిష్టానాలు ఉంటే.. టీఆర్‌ఎస్‌కు కాగజ్‌నగర్ లాంటి గల్లీలో ఉంటుందన్నారు. గడ్డాలు పెంచుకుంటే, తొడలు, మెడలు కోసుకుంటే ముఖ్యమంత్రులు కాలేరని, ప్రజల మనసులు గెలుచుకోవాలని హితవు పలికారు. ఈ మధ్య ఏ టీవీలో చూసినా కాంగ్రెస్ వాళ్ల మాటలు వింటుంటే కక్కొస్తోందని, ఆఖరికి తమ ఇంట్లోని చిన్నపిల్లల్ని కూడా తిడుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment