బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు, గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టిన లారీ
సాక్షి, కాగజ్‌నగర్(ఆదిలాబాద్) : కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌లో మిల్లు యాజమన్యం, లారీ అసోసియేషన్ మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. మిల్లులోని ఉత్పత్తిని వందశాతం తమతోనే లోడింగ్ చేయించాలని లారీ అసోసియేషన్ పట్టుబడడంతో అంత సాధ్యం కాదని 33 శాతం మాత్రమే స్థానిక లారీల ద్వారా సరుకులు ఎగుమతి, దిగుమతి చేస్తామని భీష్మించారు. దీంతో రోజురోజుకు ఇద్దరి మ«ధ్య వివాదం ముదురుతోంది. ఈ నెల 17న లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అదేరోజు లారీ డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇన్‌చార్జి డీఎస్పీ సత్యనారాయణ రంగంలోకి దిగి సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.
విషయాన్ని ఎస్పీ మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్పీ, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఇరువురిని పిలిచి చర్చలు జరిపారు. అయిన చర్చలు సఫలం కాకపోవడంతో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆదివారం రెండు లారీలు కాగజ్‌నగర్ చేరుకోవడంతో లారీ డ్రైవర్లను లారీ అసోసియేషన్ సభ్యులు సముదాయించారు. అంతలోనే పట్టణ సీఐ కిరణ్ డ్రైవర్లను తమవెంట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగా వివాదం ముదిరింది. లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇదే క్రమంలో అక్కడే రోడ్డుపై ఉన్న లారీకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.
ముదురుతున్న వివాదం...
ఇరువురి పట్టింపు కారణంగానే కాగజ్‌నగర్‌లో వివాదం ముదురుతోంది. స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని లారీ అసోసియేషన్ పట్టుబడడంతో, అంతసాధ్యం కాదని పేపర్ మిల్లు యాజమాన్యం ససేమీరా అంటోంది. దీంతో 11 రోజులుగా వివాదం ముదురుతోంది. ఈ వివాదం ఆత్మహత్యాయత్నం వరకు దారితీసింది. అంతే కాకుండా గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై ఉన్న లారీకి నిప్పంటించడం కూడా జరిగింది. ఇరువురు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే ఇంత జరిగేది కాదని పలువురి వాదన. తమ పొట్టపై కొట్టొద్దని లారీ అసోసియేషన్ విన్నవించినా యాజమాన్యం పట్టించుకోవడంలేదనే ఆరోపనలున్నాయి. యాజమాన్యం స్థానికులకు ప్రాధాన్యం కల్పిస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదంటున్నారు. ప్రజాప్రయోజనాల దృశ్యా యాజమాన్యం దిగివచ్చి స్థానికులకు పాధాన్యం కల్పిస్తే స్థానిక లారీ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
లారీ అసోసియేషన్ సభ్యుల అరెస్ట్
కాగజ్‌నగర్ పట్టణంలో కొద్ది రోజులుగా లారీ అసోసియేషన్, మిల్లు యాజమాన్యం మధ్య కొనసాగుతున్న వివాదంలో ఏడుగురిపై కేసు నమోదు చేసి ఆసిఫాబాద్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కిరణ్ తెలిపారు. జిల్లాలో 30 యాక్టు అమలులో ఉన్న నేపథ్యంలో శనివారం లారీ అసోసియేషన్ సభ్యులను రెచ్చగొట్టి పబ్లిక్ రోడ్డుపై గందరగోళం చేస్తూ పోలీసుల విధులకు భంగం కలిగించిన వెన్న కిషోర్, మహ్మద్ తాజ్, మాచర్ల శంకర్(ధోబి శంకర్), యూసుఫ్‌ఖాన్, ఖాజా ఫసియొద్దీన్, తాహేర్ హుస్సేన్, మాచర్ల శ్రీనివాస్‌లను రిమాండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
బీజేపీ నాయకుడి అరెస్ట్
లారీ అసోసియేషన్ సభ్యుల ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్న నేపధ్యంలో లారీ అసోసియేషన్‌కు మద్దతుగా రావి శ్రీనివాస్ పెట్రోల్ పంపులోని కార్యాలయానికి వెళ్లారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
భారీ బందోబస్తు
పేపర్ మిల్లు యాజమాన్యం, లారీ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా కాగజ్‌నగర్ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన గందరగోళం దృశ్యా పోలీసులు ఆదివారం పట్టణంలోని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద, లారీ అసోసియేషన్ కార్యాలయం ఎదుట పోలీసులు మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment