
సోదరుడితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనప్ప
సాక్షి, ఆదిలాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ బెయిల్‌పై విడుదలయ్యారు. కుమురంభీమ్ జిల్లాలోని కాగజ్‌నగర్ రేంజ్ పరిధి కాగజ్‌నగర్ మండలం కొత్తసార్సాలలో అటవీశాఖ అధికారులపై దాడి చేసిన కేసులో ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అటవీప్రాంతంలో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేయడానికి జూన్ 30న వెళ్లిన సిబ్బందితో పాటు ఎఫ్‌ఆర్‌వో అనితపై కాగజ్‌నగర్ జెడ్పీ వైస్‌చైర్మన్ కోనేరు కృష్ణతోపాటు ఆయన అనుచరులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అటవీశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించారు. కృష్ణతోపాటు మరో 38 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేరోజు కృష్ణ జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కోనేరు కృష్ణతోపాటు దాడికి పాల్పడిన ఆయన అనుచరులను ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
నాలుగోసారికి బెయిల్ మంజూరు..
అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడిన కేసులో కృష్ణ, ఆయన అనుచరులు బెయిల్ కోసం నాలుగుసార్లు కోర్టును ఆశ్రయించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు రెండుసార్లు బెయిల్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించగా మొదటిసారి కోర్టు తిరస్కరించింది. రెండురోజులు క్రితం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు అయిన 38 మందిలో దశలవారీగా 22 మందికి బెయిల్ మంజూరైంది. మిగిలిన 16 మంది గురువారం ఆదిలాబాద్ జైలునుంచి బయటకు వచ్చారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కృష్ణ ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనానికి చేరుకుని తన సోదరుడు కోనేరు కోనప్ప, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్‌ఎస్ నాయకులను కలిశారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పూలమాలలు వేసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment