కాగజ్‌నగర్ : రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాన్ని అరుదైన వ్యాధి చిన్నభిన్నం చేస్తోంది. శస్త్రచికిత్స చేయించుకోవడానికి మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నా సఫలం కావట్లేదు. వారు చెప్పిన.. వీరు చెప్పిన ఆస్పత్రులన్నీ తిరిగితే చేతిలో ఉన్నకాడికి ఖర్చయిందని.. ఖర్చులకు ఇప్పటి వరకు ఆస్తిపాస్తులమ్మి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు బాధిత కుటుంబం వాపోయింది. వాంకిడి మండలానికి చెందిన నరేందర్ రామలక్ష్మి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం బెజ్జూర్ మండలానికి చేరుకొని జీవనం సాగిస్తున్నారు. భర్త నరేందర్ మోటర్ వైండింగ్ మెకానిక్‌గా, రామలక్ష్మి ఇందిరాక్రాంతి పథకంలో అకౌంటెంట్ విధులు నిర్వర్తిస్తూ వస్తున్న కొద్దిపాటి మొత్తంతో అన్యోన్యంగా జీవించేవారు.
ఎవరి కళ్లు పడ్డాయో కానీ మూడేళ్ల క్రితం రామలక్షికి కంటి సమస్యతో మొదలైన ఆరోగ్య సమస్య కొత్తరకం వ్యాధికి దారితీసింది. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా కానీ నయం కాకపోవడంతో చివరకు హైదరాబాద్ వైద్యులు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. రెండేళ్ల క్రితం చికిత్స నిమిత్తం రూ.18 లక్షలు ఖర్చవుతుందని తెలపడంతో పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అప్పటి నుంచి తన భార్యకు శస్త్రచికిత్స చేయించి కాపాడుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నా సఫలం కావడం లేదని నరేందర్ కన్నీటి పర్యంతమయ్యాడు.
నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి
నా భార్య రామలక్ష్మికి ప్రాణభిక్ష పెట్టమని నరేందర్ వేడుకుంటున్నాడు. నరేందర్ మాట్లాడుతూ... మూడేళ్లుగా నా భార్య రామలక్ష్మి ఆరోగ్య సమస్యతో బాధపడుతుందని, తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోని ఆస్పత్రులకు కూడా తీసుకెళ్లానని పేర్కొన్నాడు. రెండేళ్ల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని సీఎంసీ ఆస్పత్రి వర్గాలు వ్యాధి గుర్తించి రూ.18 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. చిన్ననాటి మిత్రులు చందాల రూపంలో రూ.3 లక్షలు పోగు చేసి అందించారని, విషయం తెలుసుకున్న అప్పటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, లక్ష్మి స్పందించి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం చేశారని పేర్కొన్నాడు.
రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆరోగ్య సమస్యను వివరించిగా.. వైద్య చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ ముందస్తుగా ల క్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించే ఆర్థిక ప రిస్థితి లేక అచేతనంగా ఇంట్లోనే ఉన్నట్లు వాపోయాడు. తన భార్య పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోందని, నా భార్యకు శస్త్ర చికిత్స చేయించి బ తి కించుకోవాలని ఉందని అన్నాడు. ప్రభుత్వం, స్పందించి వైద్యం అందించి కాపాడాలని వేడుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment