కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం)లో బుధవారం నిర్వహించిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హెచ్‌ఎంఎస్ తెలంగాణ వర్కర్స్ యూనియన్ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి విజయం సాధించారు. మొత్తం 1,639 ఓట్లకు 1,600 ఓట్లు పోలయ్యా యి. ఇందులో తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నం. ఇ.2863) అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డికి 630 ఓట్లు రాగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దుతుతో బరిలో నిలిచిన ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్(ఇ.1425) అభ్యర్థి ఐఎన్‌టీయూసీ జాతీయ నాయకుడు సంజీవరెడ్డికి 421 ఓట్లు వచ్చాయి. నాయిని నర్సింహారెడ్డి 209 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు కార్మికశాఖ ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ దండపాణి ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా సాయంత్రం 6 గంటకు కౌంటింగ్ నిర్వహించారు.
పోటాపోటీగా ప్రచారం
ఉదయం 6 గంటల నుంచే మిల్లు ఆవరణలో ఆయా యూనియన్ల నాయకులు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. మిల్లు వచ్చే కార్మికులకు తమకే ఓటు వేయాలని కోరారు. టీఆర్‌ఎస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గీయులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు, బీఎంఎస్ అభ్యర్థి భట్టాచార్య వర్గీయులు సాయంత్రం వరకు పోటాపోటీ నినాదాలు చేశారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
సాయంత్రం 4 గంటల అనంతరం మిల్లు నుంచి బ్యాలెట్ బాక్సులను ఎస్పీఎం హెచ్‌ఆర్‌డీ హాల్‌కు తరలించారు. ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభించగా హాల్‌లోకి మీడియాను అనుమతించలేదు. గతంలో నిర్వహించిన ప్రతీ ఎన్నికల కౌంటింగ్ తమ సమక్షంలో జరిగేవని, ప్రస్తుతం మీడియాను అనుమతించకపోవడంలో ఆంతర్యమేంటని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీసీఎల్ దండపానిని నిలదీయగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ సురేశ్‌బాబు జోక్యంతో చివరకు కేవలం ఫొటోలు తీసుకోవడానికి అనుమతించారు.
యూనియన్లవారీగా పోలైన ఓట్లు
1,639 ఓట్లకు 1,600 ఓట్లు(98 శాతం) పోలయ్యాయి. ఇందులో ఎస్పీఎం తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నెం. ఇ.2863) అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డికి 630 ఓట్లు, ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్(ఇ.1425) అభ్యర్థి ఐఎన్‌టీయూసీ జాతీయ నాయకుడు సంజీవరెడ్డికి 421, బీఎంఎస్ అనుబంధ ఎస్పీఎం వర్కర్స్ యూనియన్ అభ్యర్థి కల్లోల భట్టాచార్యకు 306, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు మద్దతుతో బరిలో నిలిచిన తెలుగునాడు కార్మికపరిషత్ అభ్యర్థి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు 180, సీఐటీయూ మజ్దూర్ యూనియన్ అభ్యర్థి సాయిబాబుకు 33, ఐఎన్‌టీయూసీ ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.966) అభ్యర్థి విజయలక్ష్మి 18, ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.2381)కు 04, తెలంగాణ ఎస్పీఎం కార్మిక పరిషత్ (ఇ.734) 02 ఓట్లు, ఎస్పీఎం ఎంప్లాయీస్ సంఘ్ (ఇ.1028) 0, చెల్లని ఓట్లు 6 పోలయ్యాయి.
విజయోత్సవ ర్యాలీ
నాయిని నర్సింహారెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నెం. ఇ.2863) ప్రధాన కార్యదర్శి ఈర్ల విశ్వేశ్వర్‌రావు హెచ్‌ఆర్‌డీ హాల్ నుంచి బయటకు వెళ్లి విజయం సాధించిన విషయాన్ని కార్యకర్తలకు తెలుపగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ కార్యాలయం వరకు బాణాసంచా పేల్చుతూ రంగులు చల్లుకుంటూ ర్యాలీ నిర్వహించగా నాయిని నర్సింహారెడ్డితోపాటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈర్ల విశ్వేశ్వర్‌రావు, ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, నాయకులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, సురేశ్‌యాదవ్, విజయ్‌యాదవ్, దోణి శ్రీశైలం, అశోక్, మాచర్ల శ్రీనివాస్, గజ్జి వాసుదేవ్, లెండుగురె శ్యాంరావు, కోయవాగు సర్పంచ్ మల్లేశ్ పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో మిల్లు ఆవరణలో భారీ బందోబస్తు నిర్వహించారు. కాగజ్‌నగర్ టౌన్ సీఐ రవికుమార్, రూరల్ సీఐ రహెమాన్, వాంకిడి సీఐ తిరుపతి, రూరల్ ఎస్సై తిరుపతి, ఈజ్‌గాం ఎస్సై సురేందర్, సిర్పూర్(టి) ఎస్సై శ్యాంసుందర్, బెజ్జూర్ ఎస్సై తారాచంద్‌తోపాటూ ప్రొబీషనరీ ఎస్సైలు మోహన్‌బాబు, ప్రభాకర్, పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
ఎస్పీఎం ఎన్నికలు ప్రశాంతం
Published Thu, Dec 12 2013 3:46 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement