telangana workers union
-
అవగాహన లోపంతోనే..
రాసం శ్రీధర్, నిర్మల్ :గల్ఫ్ దేశాల్లో వివిధ ప్రమాదాల్లో తెలంగాణ కార్మికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి దాదాపు 200 శవపేటికలు శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుతున్నాయని అంచనా. చాలామంది అక్కడి చట్టాలు, నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో మృతిచెందుతుండగా, మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ♦ మనదేశంలో రోడ్లపై ఎడమవైపు ప్రయాణిస్తాం.అదే గల్ఫ్ దేశాల్లో రోడ్డుకు కుడిపక్కన వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినా ఒక్కోసారి మనవాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదానికి గురవుతున్నారు. ♦ మన దేశంలో ఏ రోడ్డుపైనైనా(కొన్ని మినహా) అన్ని రకాల వాహనాలు వెళ్లొచ్చు. కానీ, సౌదీ వంటి గల్ఫ్ దేశాలలో రోడ్లను బట్టి వాహనాలను అనుమతిస్తారు. ఇటీవల మంచిర్యాల జిల్లావాసులు ప్రమాదానికి గురైన రోడ్డుపై బైక్‌లను నడపడం నిషేధం. ♦ రోడ్డు క్రాసింగ్‌ల వద్ద అవగాహన లేకపోవడమూ ప్రాణాలు తీస్తోంది. ♦ సీటు బెల్టు పెట్టుకోకున్నా.. హెల్మెట్ ధరించకున్నా.. ఆ దేశాల్లో కఠిన శిక్షలు ఉంటాయి. ♦ పని ప్రదేశాల్లోనూ హెల్మెట్లు వాడకపోవడం, రసాయనాలకు సంబంధించిన పనుల్లో షూ, మాస్కులు ధరించకపోవడం ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ♦ రోజంతా 40–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేసి, తర్వాత 20–25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఏసీ గదుల్లోకి రావడం కూడా మనవాళ్లపై ప్రభావం చూపుతోంది. చాలా మంది ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసాలతో అనారోగ్యం బాడినపడి కన్నుమూస్తున్నారు. ♦ ఉపాధి కోసం వెళ్లినవారిలో కొందరు అక్కడ ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ‘దియా’ ఉన్నా.. గల్ఫ్ దేశాల్లో చట్టాలు, నిబంధనలపై కనీస అవగాహన లేకపోతే మనిషితో పాటు ఆర్థికసాయం కూడా కోల్పోవాల్సి వస్తుంది. సౌదీలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఇస్లామిక్ షరియా ప్రకారం వారు ‘దియా’ (బ్లడ్ మనీ) చెల్లిస్తారు. ఇది లక్ష నుంచి 2లక్షల సౌదీ రియాళ్ల వరకు ఉంటుంది. మన కరెన్సీ ప్రకారం రూ.18లక్షల నుంచి రూ.36లక్షల వరకు ఇస్తారు. కానీ, ఈదియాను పొందాలంటే ఓ నిబంధన ఉంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తప్పులేదని నిరూపించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా, మద్యం సేవించి నడిపినా, రెడ్ సిగ్నల్ క్రాస్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, వాహనం ఫిట్నెస్ లేకున్నా.. దియా వర్తించదు. అక్కడి చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండి, సదరు వ్యక్తి తప్పులేకపోతేనే బ్లడ్‌మనీ ప్రమాదస్థాయిని బట్టి చెల్లిస్తారు. సౌదీలో మనిషిని బట్టి.. రోడ్డు ప్రమాదాలతో పాటు అన్ని రకాల ప్రమాదాలకు దియా అందిస్తారు. అయితే, సౌదీ అరేబియా దేశంలో మనిషిని బట్టి పరిహారం చెల్లింపులు ఉంటాయి. మృతుడు ముస్లిం పురుషుడైతే 100శాతం పరిహారం అందుతుంది. ముస్లిం మహిళకు అందులో 50శాతం, క్రిస్టియన్ పురుషుడైతే 50శాతం, క్రిస్టియన్ మహిళ ఉంటే అందులో సగం పరిహారం చెల్లిస్తారు. ఇక ముస్లిం, క్రిస్టియన్లుకాని వారందరికీ కేవ లం 6.6శాతం మాత్రమే పరిహారం అందిస్తారు. ఈ లెక్కన ముస్లిం పురుషుడికి రూ.లక్ష వస్తే, క్రైస్తవ పురుషుడికి రూ.50వేలు.. మిగతా వర్గాలకు చెందిన పురుషుడికి రూ.6,600 మాత్రమే వస్తాయి. అన్ని వర్గాల మహిళలకు అందులో సగమే చెల్లిస్తారు. బీమా చేసుకోవడం ఉత్తమం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు కనీస పరిహారం కూడా పొందలేని బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గల్ఫ్‌కు వెళ్లేవారిలో చాలామంది జీవిత బీమా కూడా చేయించుకోవడం లేదు. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చెల్లిస్తే రూ.లక్ష విలువైన జీవిత బీమా వర్తించే పాలసీలనూ తీసుకోవడం లేదు. ఇక.. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రవాసీ భారతీయ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రమాద బీమా రూ.10లక్షలు ఉంటుంది. ఇది కొత్తగా వెళ్లే వారికి మాత్రమే వర్తిసుంది. అందులో పదోతరగతి కంటే తక్కువ చదివిన వారికి అంటే.. అక్షరాస్యత పరంగా వెనుకబడిన వారికి వర్తిస్తుంది. ఇందులో రూ.275 చెల్లిస్తే రెండేళ్లు, రూ.375 చెల్లిస్తే మూడేళ్లు కవరేజీ ఉంటుంది. ఈ చెల్లింపులపైన జీఎస్టీ 18శాతం వసూలు చేస్తుండటం గమనార్హం. ఇది కాకుండా ఎల్ఐసీ, ఇతర బీమా కంపెనీలలో జీవిత, ప్రమాద బీమాలు చేయించుకోవడం ఉత్తమం. -
ఎస్పీఎం ఎన్నికలు ప్రశాంతం
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం)లో బుధవారం నిర్వహించిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హెచ్ఎంఎస్ తెలంగాణ వర్కర్స్ యూనియన్ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి విజయం సాధించారు. మొత్తం 1,639 ఓట్లకు 1,600 ఓట్లు పోలయ్యా యి. ఇందులో తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నం. ఇ.2863) అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డికి 630 ఓట్లు రాగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దుతుతో బరిలో నిలిచిన ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్(ఇ.1425) అభ్యర్థి ఐఎన్టీయూసీ జాతీయ నాయకుడు సంజీవరెడ్డికి 421 ఓట్లు వచ్చాయి. నాయిని నర్సింహారెడ్డి 209 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు కార్మికశాఖ ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ దండపాణి ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా సాయంత్రం 6 గంటకు కౌంటింగ్ నిర్వహించారు. పోటాపోటీగా ప్రచారం ఉదయం 6 గంటల నుంచే మిల్లు ఆవరణలో ఆయా యూనియన్ల నాయకులు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. మిల్లు వచ్చే కార్మికులకు తమకే ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గీయులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు, బీఎంఎస్ అభ్యర్థి భట్టాచార్య వర్గీయులు సాయంత్రం వరకు పోటాపోటీ నినాదాలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత సాయంత్రం 4 గంటల అనంతరం మిల్లు నుంచి బ్యాలెట్ బాక్సులను ఎస్పీఎం హెచ్ఆర్డీ హాల్‌కు తరలించారు. ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభించగా హాల్లోకి మీడియాను అనుమతించలేదు. గతంలో నిర్వహించిన ప్రతీ ఎన్నికల కౌంటింగ్ తమ సమక్షంలో జరిగేవని, ప్రస్తుతం మీడియాను అనుమతించకపోవడంలో ఆంతర్యమేంటని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీసీఎల్ దండపానిని నిలదీయగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ సురేశ్‌బాబు జోక్యంతో చివరకు కేవలం ఫొటోలు తీసుకోవడానికి అనుమతించారు. యూనియన్లవారీగా పోలైన ఓట్లు 1,639 ఓట్లకు 1,600 ఓట్లు(98 శాతం) పోలయ్యాయి. ఇందులో ఎస్పీఎం తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నెం. ఇ.2863) అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డికి 630 ఓట్లు, ఎస్పీఎం నేషనల్ వర్కర్స్ అసోసియేషన్(ఇ.1425) అభ్యర్థి ఐఎన్టీయూసీ జాతీయ నాయకుడు సంజీవరెడ్డికి 421, బీఎంఎస్ అనుబంధ ఎస్పీఎం వర్కర్స్ యూనియన్ అభ్యర్థి కల్లోల భట్టాచార్యకు 306, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు మద్దతుతో బరిలో నిలిచిన తెలుగునాడు కార్మికపరిషత్ అభ్యర్థి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు 180, సీఐటీయూ మజ్దూర్ యూనియన్ అభ్యర్థి సాయిబాబుకు 33, ఐఎన్టీయూసీ ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.966) అభ్యర్థి విజయలక్ష్మి 18, ఎస్పీఎం ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.2381)కు 04, తెలంగాణ ఎస్పీఎం కార్మిక పరిషత్ (ఇ.734) 02 ఓట్లు, ఎస్పీఎం ఎంప్లాయీస్ సంఘ్ (ఇ.1028) 0, చెల్లని ఓట్లు 6 పోలయ్యాయి. విజయోత్సవ ర్యాలీ నాయిని నర్సింహారెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడంతో టీఆర్ఎస్ వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలంగాణ వర్కర్స్ యూనియన్(రి.నెం. ఇ.2863) ప్రధాన కార్యదర్శి ఈర్ల విశ్వేశ్వర్రావు హెచ్ఆర్డీ హాల్ నుంచి బయటకు వెళ్లి విజయం సాధించిన విషయాన్ని కార్యకర్తలకు తెలుపగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ కార్యాలయం వరకు బాణాసంచా పేల్చుతూ రంగులు చల్లుకుంటూ ర్యాలీ నిర్వహించగా నాయిని నర్సింహారెడ్డితోపాటూ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈర్ల విశ్వేశ్వర్రావు, ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, నాయకులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, సురేశ్‌యాదవ్, విజయ్‌యాదవ్, దోణి శ్రీశైలం, అశోక్, మాచర్ల శ్రీనివాస్, గజ్జి వాసుదేవ్, లెండుగురె శ్యాంరావు, కోయవాగు సర్పంచ్ మల్లేశ్ పాల్గొన్నారు. భారీ బందోబస్తు ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో మిల్లు ఆవరణలో భారీ బందోబస్తు నిర్వహించారు. కాగజ్‌నగర్ టౌన్ సీఐ రవికుమార్, రూరల్ సీఐ రహెమాన్, వాంకిడి సీఐ తిరుపతి, రూరల్ ఎస్సై తిరుపతి, ఈజ్గాం ఎస్సై సురేందర్, సిర్పూర్(టి) ఎస్సై శ్యాంసుందర్, బెజ్జూర్ ఎస్సై తారాచంద్తోపాటూ ప్రొబీషనరీ ఎస్సైలు మోహన్‌బాబు, ప్రభాకర్, పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.