కొద్దిరోజుల్లో వేలాది కార్మిక కుటుంబాల్లో వెలుగులు | Sirpur Paper Mill Will Soon Begin | Sakshi
Sakshi News home page

కొద్దిరోజుల్లో వేలాది కార్మిక కుటుంబాల్లో వెలుగులు

Published Fri, Aug 3 2018 1:45 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Sirpur Paper Mill Will Soon Begin - Sakshi

మంత్రులు కేటీఆర్, రామన్న, ఐకే రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాలికి బలపం కట్టుకొని నిరంతరం మిల్లు పునరుద్ధరణ కోసం పాటుపడ్డారు. ఆయన కృషి ఊరికే పోకుండా మిల్లు తెరుచుకొని కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకటే చెప్పారు.. సిర్పూర్‌ పేపర్‌ మిల్లును త్వరగా తెరిపించేలా మీరంతా అదే పనిలో ఉండాలని మాకు ఆదేశించారు.

పునరుద్ధరణకు ముందుకు వచ్చిన జేకే కంపెనీకి కోట్ల రూపాయల రాయితీలు కల్పించి మిల్లు తెరిపిస్తున్నాం. జేకే పేపర్‌ మిల్లు రూ.30వేల కోట్ల వ్యాపారం చేస్తుంది. చాలా పెద్ద పరిశ్రమ. కాంట్రాక్టు కార్మికులకు సైతం న్యాయం చేకూరుతుంది.

సాక్షి, ఆసిఫాబాద్‌ : వేలాది కార్మిక కుటుంబాల్లో వెలుగులు నిండే సమయం వచ్చిందని, మరికొద్ది రోజుల్లో ఎస్పీఎంలో సైరన్‌ మోగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారకరామరావు అన్నారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లు (ఎస్పీఎం) పునరుద్ధరణతో కాగజ్‌నగర్‌కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువారం ఆయన మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఆదిలాబాద్‌ ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్‌రావు, కోవ లక్ష్మిలతో కలిసి ఎస్పీఎం పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొదట కార్మికులతో ఆత్మీసభ ఏర్పాటు చేశారు. మిల్లులో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎస్పీఎం గ్రౌండ్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. స్వాతిముత్యం సినిమాలో హీరో కమల్‌హాసన్‌ తనకు ఉద్యోగం కావాలని వెంటపడినట్లు సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తిరిగి తెరిపించేందుకు కొనేరు కోనప్ప అలా తన వెంట పడ్డారని చెప్పారు. కాలికి బలపం కట్టుకుని తిరిగి మొత్తానికి మిల్లు ప్రారంభించేలా చేశారన్నారు.

మిల్లు పునరుద్ధరణ కోసం కోల్‌కతా, ముంబయి, ఢిల్లీకి పలుమార్లు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. జేకే పేపర్స్‌ కంపెనీ ముందుకు రావడంతో మిల్లు తిరిగి ప్రారంభమవుతోందని చెప్పారు. మిల్లు మూతపడి కార్మికుల కుటుంబాలు మూడేళ్లుగా నానా కష్టాలు పడుతున్నాయని అన్నారు. సాధ్యమైనంత తొందరగా మిల్లులో కాగితం ఉత్పత్తి ప్రారంభించాలని జేకే కంపెనీ ప్రతినిధులను కేటీఆర్‌ కోరారు. మిల్లులో పని చేసే కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాలు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దేవాపూర్‌ ఓసీసీ విస్తరణతో ఉద్యోగాలు 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్‌లోని ఓరియెంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో మరో రూ.2వేల కోట్ల పెట్టుబడులతో యాజమాన్యం విస్తరిస్తోందని తెలిపారు. తద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని, అవి స్థానికులకే అందేలా చూస్తామని అన్నారు. 

సీసీఐ పునరుద్ధరణకు కృషి

ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా)ను కూడా తిరిగి ప్రారంభించేందుకు మంత్రి జోగు రామన్నతో కలసి ఢిల్లీ వెళ్లామని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి అనంత్‌గీథేను కలిసి సీసీఐ పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు అన్ని రకాల ప్రొత్సాహకాలు ఇస్తోందన్నారు.

కాగజ్‌నగర్‌కు రూ.25 కోట్లు..  బ్రిడ్జీలకు రూ.17 కోట్లు 

కాగజ్‌నగర్‌ పట్టణ అభివృద్ధి కోసం మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. సిర్పూర్‌ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్తాన్నాని హామీ ఇచ్చారు. సిర్పూర్‌లో బ్రిడ్జిల కోసం రూ.17 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం కుమురం భీం జిల్లాలో 106 గిరిజన గూడేలు కొత్త గ్రామ పంచాయతీలుగా మారాయని, 55 తండాల్లో కూడా నేటినుంచి కొత్త పాలన ప్రారంభమైందని పేర్కొన్నారు.

పండుగలా కనిపిస్తోంది : ఐకే రెడ్డి

పేపర్‌ మిల్లు పునరుద్ధరణ పనులు చూస్తుంటే ఓ పండగ వాతావరణం కనిపిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సిర్పూర్‌కు మంచి రోజుల వచ్చాయన్నారు. మంత్రి కేటీఆర్‌ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. గురువారం ఒక్క రోజే 480 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు.

ప్రస్తుతం సిర్పూర్‌లో 300 కిలోమీటర్ల రోడ్‌ మైలేజ్‌లో మరో 90 కిలోమీటర్లు మిగిలి ఉందని, వీటి పనులు కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు ద్వారా త్వరలో సాగు నీరందిస్తామన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలో 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. 

ఒక్క చెక్కూ వాపస్‌ చేయ్యలే : జోగు రామన్న

దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ప్రస్తుతం సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణ శుభపరిణామం అన్నారు. రైతుబంధు పథకంపై విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు ఒక్క చెక్కు కూడా వాపస్‌ చేయలేదని ఎద్దేవా చేశారు. పోడు భూములపై గిరిజనులు ఆందోళన పడొద్దన్నారు.

2014 జూన్‌ 2కంటే ముందు పోడు సాగు చేస్తున్న వారికి సైతం పెట్టుబడి సాయం, రైతుబీమా కల్పిస్తామన్నారు. మిల్లు మూతపడినప్పుడు అనేక పార్టీలు వచ్చాయని, ఇప్పుడు ఆ పార్టీలు ఎక్కడ పోయాయని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల పక్షాన పని చేస్తోందని ఎంపీ గెడెం నగేశ్‌ అన్నారు. పూర్వ ఆదిలాబాద్‌ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయండి : కోనప్ప

మూతపడిన సర్‌సిల్క్‌ మిల్లు స్థానంలో మరో కొత్త పరిశ్రమ ఏదైనా ఏర్పాటు చేయాలని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంత్రి కేటీఆర్‌ను కోరారు. సర్‌సిల్క్‌కు సంబంధించి 70 ఎకరాల భూమి వృథాగా ఉందని గుర్తు చేశారు. కొత్త పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. అంతేకాక కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు నిధులు ఇవ్వాలని కోరగా కేటీఆర్‌ అంగీకారం తెలిపారన్నారు.

సిర్పూర్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు బ్రిడ్జిలు మంజూరు చేయాలన్నారు. బాబాసాగర్, సిర్పూర్, బంగళాపల్లి, సిద్దాపూర్, సైదాపూర్, రుద్రపూర్‌ నుంచి ఏటిగూడెం, దేవాజిగూడ వద్ద బ్రిడ్జిలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాగజ్‌నగర్‌ ప్రాంతంలో కొత్తగా ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కోరారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిగ్రీ కళాశాల అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  మంత్రులు పర్యటనలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్‌ సింగనేవార్, జిల్లా అ«టవీ శాఖ అధికారి లక్ష్మణ్‌ రంజిత్‌నాయక్, కాగజ్‌నగర్‌ ఆర్డీవో రమేశ్‌బాబు, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ డీఎస్పీలు సాంబయ్య, సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ఎస్పీఎం కార్మికులు పాల్గొన్నారు. 

గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం

మంత్రి కేటీఆర్‌ రాకను పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ శ్రేణల్లో ఉత్సాహం ఉరకలేసింది. కేటీఆర్‌ హెలిక్యాప్టర్‌ నుంచి దిగిన నుంచి మొదలు ఆయన తిరిగి వెళ్లేంత వరకు కార్యకర్తలు మంచి జోష్‌ మీద ఉన్నారు. బైక్‌ ర్యాలీలు, డప్పు వాయిద్యాలు, తదితర కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. మరోవైపు పేపర్‌ మిల్లు పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో కార్మికుల కుటుంబాలు ఉత్సాహంగా సభకు రావడం కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement