సాక్షి, బాసర(ఆదిలాబాద్): కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. హాస్టల్ మెస్‌లో భోజనం విషయంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. దీంతో, విద్యార్థుల ఆందోళనలు తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సైతం సృష్టించాయి. గవర్నర్ తమిళిసై సహా పలువురు రాజకీయ నేతలు సైతం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి.. విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్.. సోమవారం బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ ఆరా తీశారు. విద్యార్థులతో సమావేశమై.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమలోనే వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం మీ పోరాటం నాకు నచ్చింది.
రాజకీయాలకు తావు లేకుండా ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా పోరాటం చేసి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మెస్ సరిగా లేదన్న విషయం ఇప్పటికే గుర్తించాము. ప్రతీరోజు మంచి ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటాము. విద్యార్థులకు త్వరలోనే ల్యాప్‌టాప్‌లు ఇస్తాము. హాస్టల్‌లో ఉండే కష్టాలు నాకు కూడా తెలుసు. మెస్‌ల్లోనూ, బాత్‌రూమ్‌లోనూ ఉండే ఇబ్బందులు నాకూ తెలుసు. నేను కూడా హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. ఇక్కడున్న సమస్యలు తెలుసుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మరో రెండు నెలల తర్వాత మళ్లీ ట్రిపుల్ ఐటీకి వస్తాను. ట్రిపుల్ ఐటీలో వసతులను మరింత అభివృద్ధి చేసాము’ అంటూ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment