కాగజ్‌నగర్‌టౌన్ : కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం(సిర్పూర్ పేపర్‌మిల్లు) తెరిపించాలనే డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఓ వైపు కార్మికుల రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. కార్మికులకు సంఘీభావంగా అంగన్‌వాడీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
మిల్లులో తక్షణమే ప్రారంభించి ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్పీఎం కార్మికులు మంగళవారం రోడ్డెక్కారు. కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ముందు నుంచి నాయకులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు భారీ సంఖ్యలో పాదయాత్రగా ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. మిల్లును ప్రారంభించే వరకు ఆందోళనలు, శాంతియుత పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండు గంటలపాటు కొనసాగిన రాస్తారోకో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. పట్టణ సీఐ జలగం నారాయణరావు, ఎస్సై అబ్దుల్‌మజీద్‌లు రాస్తారోకో విరమింపజేశారు.
విద్యార్థుల ర్యాలీ
ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు మేరకు పట్టణంలో కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఏబీవీపీ నాయకుడు అన్నం నాగార్జున, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కుబిడె రాకేష్, ఎన్నం ఆశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. పేపర్‌మిల్లు ఎదుట దీక్షా శిబిరానికి చేరుకుని కార్మికులకు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ నాయకులు ముంజం ఆనంద్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు మార్కెట్‌లో భారీ ర్యాలీ నిర్వహించి, కార్మికులకు మద్దతు పలికారు. ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెండో రోజుకు రిలే దీక్షలు
మిల్లు తెరిపించాలని, కార్మికులకు నెల నెల వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు మిల్లు ఎదుట చేపట్టిన రిలేదీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. దీక్షలో కార్మికులు వేముల వెంకటేష్, వికాస్‌నాయక్, ఎన్,రాజయ్య, అంబాల అంజయ్య, బస్వచార్యులు, శ్రీనివాసన్, కొరగంటి చంద్రయ్య, బి.సుభాష్, చంద్రశేఖర్, కోట శంకర్ కూర్చున్నారు. కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి నాయకులు ఈర్ల విశ్వేశ్వర్‌రావు, కూశన రాజన్న, షబ్బీర్ అహ్మద్(ఛోటా), మురళీ, అంబాల ఓదేలు, ముంజం శ్రీనివాస్, వెంకటేష్, కార్మికులు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన ఎస్పీఎం కార్మికులు
Published Wed, Dec 24 2014 3:08 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
Advertisement
Advertisement