ఉద్యోగ భద్రత, ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఐటీ కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ కీలక సూచనలు చేశారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తాజా ఇంటర్వ్యూలో ఆయన ఐటీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు.
ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన బెంగళూరు సహా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ఐటీ సంస్థలకు ఇప్పటివరకూ ఉన్న మినహాయింపులు తొలగించి వాటిని తమ పరిధిలోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర కార్మిక శాఖ ఆలోచిస్తోంది. ఈ ఆలోచన ఇప్పుడు ఏ స్థితిలో ఉందని ప్రశ్నించినప్పుడు దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ-బీటీ, పరిశ్రమలతో సహా సంబంధిత మంత్రులతో మాట్లాడుతామని సంతోష్ లాడ్ బదులిచ్చారు.
ఆ వైఖరి మానుకోవాలి
ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వ్యవహరించే విధానాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. తమ కంపెనీలు రాత్రిపూట ఈ-మెయిల్ ఐడీలను బ్లాక్ చేయడం, తోటి ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయకుండా ఆపడం వంటివి చేస్తున్నాయని చాలా మంది ఉద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కానీ వారికి సహాయం చేసే యంత్రాంగం ప్రస్తుతం తమ వద్ద లేదన్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Wipro Rule: విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన
కంపెనీలపై అజమాయిషి చూపించడం తమ ఉద్దేశం కాదని, కార్మిక చట్టాలు ముఖ్యమని యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీ అయినంత మాత్రాన రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ వైఖరి మారాలని సూచించారు.
పని వేళల గురించి..
ఐటీ కంపెనీలు గ్రాట్యుటీ, కనీస వేతనాలతో సహా అన్ని ఇతర నిబంధనలకు కట్టుబడి ఉంటున్నాయని, తమ ఆందోళన అంతా ఉద్యోగులను తొలగిస్తున్న విధానాలపై మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక పనివేళల గురించి మాట్లాడుతూ ఉద్యోగులకు కొన్నిసార్లు ఎక్కువ పని ఉంటుంది.. కొన్నిసార్లు తక్కువ పని ఉంటుంది. దీనిపై పెద్దగా అభ్యంతరం లేదని, ఉద్యోగుల సామాజిక భద్రతపైనే తాము దృష్టి పెట్టినట్లు మంత్రి సంతోష్ లాడ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment