hr policies
-
ఐటీ కంపెనీలకు కార్మిక శాఖ మంత్రి కీలక సూచనలు
ఉద్యోగ భద్రత, ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఐటీ కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ కీలక సూచనలు చేశారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తాజా ఇంటర్వ్యూలో ఆయన ఐటీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన బెంగళూరు సహా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ఐటీ సంస్థలకు ఇప్పటివరకూ ఉన్న మినహాయింపులు తొలగించి వాటిని తమ పరిధిలోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర కార్మిక శాఖ ఆలోచిస్తోంది. ఈ ఆలోచన ఇప్పుడు ఏ స్థితిలో ఉందని ప్రశ్నించినప్పుడు దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ-బీటీ, పరిశ్రమలతో సహా సంబంధిత మంత్రులతో మాట్లాడుతామని సంతోష్ లాడ్ బదులిచ్చారు. ఆ వైఖరి మానుకోవాలి ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వ్యవహరించే విధానాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. తమ కంపెనీలు రాత్రిపూట ఈ-మెయిల్ ఐడీలను బ్లాక్ చేయడం, తోటి ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయకుండా ఆపడం వంటివి చేస్తున్నాయని చాలా మంది ఉద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కానీ వారికి సహాయం చేసే యంత్రాంగం ప్రస్తుతం తమ వద్ద లేదన్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: Wipro Rule: విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన కంపెనీలపై అజమాయిషి చూపించడం తమ ఉద్దేశం కాదని, కార్మిక చట్టాలు ముఖ్యమని యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీ అయినంత మాత్రాన రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ వైఖరి మారాలని సూచించారు. పని వేళల గురించి.. ఐటీ కంపెనీలు గ్రాట్యుటీ, కనీస వేతనాలతో సహా అన్ని ఇతర నిబంధనలకు కట్టుబడి ఉంటున్నాయని, తమ ఆందోళన అంతా ఉద్యోగులను తొలగిస్తున్న విధానాలపై మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక పనివేళల గురించి మాట్లాడుతూ ఉద్యోగులకు కొన్నిసార్లు ఎక్కువ పని ఉంటుంది.. కొన్నిసార్లు తక్కువ పని ఉంటుంది. దీనిపై పెద్దగా అభ్యంతరం లేదని, ఉద్యోగుల సామాజిక భద్రతపైనే తాము దృష్టి పెట్టినట్లు మంత్రి సంతోష్ లాడ్ వివరించారు. -
వాటి కోసం వాట్సప్ వాడొద్దు!
ఉద్యోగం చేస్తున్నపుడు సెలవు పెట్టాలన్నా, రాజీనామా చేయాలన్నా, లేదా మీ కింద పనిచేసే ఉద్యోగులకు పని అప్పగించాలన్నా.. ఇలాంటి పనులకు వాట్సప్ వాడొద్దని పెద్ద కంపెనీల హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. అసలు ఆఫీసు కమ్యూనికేషన్ కోసం వాట్సప్ వాడొద్దని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులు దాదాపు వంద కోట్ల మంది ఉండగా, భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది ఉన్నారు. ఇందులో పంపే సమాచారం పూర్తి ఎన్క్రిప్టెడ్ పద్ధతిలో ఉంటుంది. అయినా పెద్ద కంపెనీలు మాత్రం దీన్ని వద్దనే అంటున్నాయి. ఎవరైనా ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు.. సంస్థకు చెందిన సమాచారం వాళ్ల ఫోన్లలో ఉండిపోతుందని, దాన్ని వాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే ఫోన్ పోయినా కూడా దాంట్లో సమాచారం దుర్వినియోగం అవుతుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అనే కన్సల్టెన్సీకి చెందిన రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. పైపెచ్చు.. ఉద్యోగులకు కూడా ఇది ఇబ్బందిగానే ఉంటుందని, ముఖ్యంగా సెలవులో ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల గ్రూపులో మేనేజర్ల నుంచి సమాచారం వచ్చి పడుతుందని, ఇది వాళ్లకు కష్టంగా ఉంటుందని అంటున్నారు. అధికారిక సమాచారం కోసం కంపెనీ ఈమెయిల్ వాడటమే మేలని, వాట్సప్ కేవలం వ్యక్తిగత సందేశాలకే పరిమితం కావాలని జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ విప్లవ్ బెనర్జీ చెప్పారు. అయితే.. కంపెనీ విధానాలకు సంబంధించిన చిన్న చిన్న వీడియోలు పంపుకోడానికి మాత్రం వాట్సప్ ఉపయోగించుకోవచ్చని అన్నారు. చాలావరకు కంపెనీలు మాత్రం వాట్సప్ అధికారిక కమ్యూనికేషన్‌కు పనికిరాదనే అంటున్నాయి. అది కంపెనీ సెర్వర్‌కు అనుసంధానం కాదు కాబట్టి, దానికంటే ఈమెయిళ్లే నయమని చెబుతున్నాయి. పైగా దానివల్ల ఉద్యోగులకు సమయం వృథా అవుతుందని, ఒకళ్లు ఒకటి చెబితే మరొకళ్లు ఇంకోటి చెబుతూ గ్రూప్ చాటింగ్‌లా అధికారిక కమ్యూనికేషన్‌ను కూడా చేసేస్తారని హీరో సైకిల్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే.. జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం ఇది మంచి అవకాశమని ఆమ్వే ఇండియా హెచ్ఆర్ హెడ్ శంతను దాస్ అన్నారు.