వాటి కోసం వాట్సప్ వాడొద్దు! | Whatsapp should not be used for official communication | Sakshi
Sakshi News home page

వాటి కోసం వాట్సప్ వాడొద్దు!

Published Thu, Aug 11 2016 9:30 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

వాటి కోసం వాట్సప్ వాడొద్దు!

వాటి కోసం వాట్సప్ వాడొద్దు!

ఉద్యోగం చేస్తున్నపుడు సెలవు పెట్టాలన్నా, రాజీనామా చేయాలన్నా, లేదా మీ కింద పనిచేసే ఉద్యోగులకు పని అప్పగించాలన్నా.. ఇలాంటి పనులకు వాట్సప్ వాడొద్దని పెద్ద కంపెనీల హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. అసలు ఆఫీసు కమ్యూనికేషన్ కోసం వాట్సప్ వాడొద్దని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ వినియోగదారులు దాదాపు వంద కోట్ల మంది ఉండగా, భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది ఉన్నారు. ఇందులో పంపే సమాచారం పూర్తి ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో ఉంటుంది. అయినా పెద్ద కంపెనీలు మాత్రం దీన్ని వద్దనే అంటున్నాయి. ఎవరైనా ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు.. సంస్థకు చెందిన సమాచారం వాళ్ల ఫోన్లలో ఉండిపోతుందని, దాన్ని వాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలాగే ఫోన్ పోయినా కూడా దాంట్లో సమాచారం దుర్వినియోగం అవుతుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అనే కన్సల్టెన్సీకి చెందిన రితుపర్ణ చక్రవర్తి తెలిపారు.

పైపెచ్చు.. ఉద్యోగులకు కూడా ఇది ఇబ్బందిగానే ఉంటుందని, ముఖ్యంగా సెలవులో ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల గ్రూపులో మేనేజర్ల నుంచి సమాచారం వచ్చి పడుతుందని, ఇది వాళ్లకు కష్టంగా ఉంటుందని అంటున్నారు. అధికారిక సమాచారం కోసం కంపెనీ ఈమెయిల్ వాడటమే మేలని, వాట్సప్ కేవలం వ్యక్తిగత సందేశాలకే పరిమితం కావాలని జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ విప్లవ్ బెనర్జీ చెప్పారు. అయితే.. కంపెనీ విధానాలకు సంబంధించిన చిన్న చిన్న వీడియోలు పంపుకోడానికి మాత్రం వాట్సప్ ఉపయోగించుకోవచ్చని అన్నారు.

చాలావరకు కంపెనీలు మాత్రం వాట్సప్ అధికారిక కమ్యూనికేషన్‌కు పనికిరాదనే అంటున్నాయి. అది కంపెనీ సెర్వర్‌కు అనుసంధానం కాదు కాబట్టి, దానికంటే ఈమెయిళ్లే నయమని చెబుతున్నాయి. పైగా దానివల్ల ఉద్యోగులకు సమయం వృథా అవుతుందని, ఒకళ్లు ఒకటి చెబితే మరొకళ్లు ఇంకోటి చెబుతూ గ్రూప్ చాటింగ్‌లా అధికారిక కమ్యూనికేషన్‌ను కూడా చేసేస్తారని హీరో సైకిల్స్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే.. జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం ఇది మంచి అవకాశమని ఆమ్వే ఇండియా హెచ్ఆర్ హెడ్ శంతను దాస్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement