సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా మని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించడంపై తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) ఉత్తమ్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి లోని ఆర్టీసీ కల్యాణమండపంలో అభినందనసభ నిర్వహించింది.
ఉత్తమ్ మాట్లాడుతూ జాతకాలు, మూఢనమ్మకాలతో ప్రజాధనం వృథా చేయడం కేసీ ఆర్‌కు అలవాటైందని విమర్శించారు. కాన్వాయ్‌లో రంగుల సాకుతో కార్లు మారుస్తూ, వ్యక్తిగత ప్రయాణాల కోసం చార్టెడ్ విమానాల్లో తిరుగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమంతో గద్దెనెక్కిన కేసీఆర్, ఇప్పుడు ఆర్టీసీని మూసేస్తానంటూ అహంకారాన్ని చాటుకుంటున్నారన్నారు.
ఇంధనధరలకు, ఆర్టీసీ నష్టాలకు సంబంధమేంటని ప్రశ్నించారు. రూ.వందల కోట్లతో కేసీఆర్ కట్టుకున్న ఇంటి(ప్రగతిభవన్)ని జనరల్ హాస్పిటల్‌గా మారుస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబసభ్యులకూ పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కొత్త బస్సులు, ఉద్యోగ భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి సమస్యలను తీరుస్తామన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని, టీఆర్‌ఎస్ పీడ విరగడ కావా లంటే ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలన్నారు.
కేసీఆర్‌కు ఏమీ పట్టడం లేదు: ఆర్.కృష్ణయ్య
కార్మికుల పోరాటాల ఫలితంగా సీఎం అయిన కేసీఆర్.. వారి సమస్యలను గాలికొదిలేశారని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. పుట్టెడు కష్టాలతో ఆర్టీసీ కార్మికులు బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ అభద్రత, చాలీచాలని వేతనం, పనిఒత్తిడితో సతమతమవుతున్న కార్మికులను సీఎం పట్టించుకోకపోవడం దారుణమని కృష్ణయ్య అన్నారు.
మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన ఇంట్లో ఐదుగురికి పదవిలిచ్చి ఎవరేమనుకుంటే నాకేంటి.. అనేవిధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ పాపం పండే ముందస్తుకు వెళ్లారు. ఇప్పుడు అతని పాలనను అంతమొందించకపోతే, భావితరాలూ ఇబ్బందులు పడతాయి’అని అన్నారు.
టీజేఎంయూ రాష్ట్ర అధ్య క్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ మాట్లాడుతూ కార్మికుల సమ్మెతో సీఎం పీఠమెక్కిన కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీని మూసేస్తానని, ముక్కలు చేస్తానని బెదిరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ్‌ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, మిత్రపక్షాల పొత్తు.. టీఆర్‌ఎస్‌కు విపత్తు : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కుదుర్చుకుంటున్న పొత్తులతో అధికార పార్టీ నేతలు కలవరపడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం తథ్యమని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు ఈ గెలుపును కానుకగా ఇస్తామని చెప్పారు. 4 రోజుల మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మాజీ ఎంపీ వీహెచ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్న ఇందిర విజయరథాన్ని ఉత్తమ్ ప్రారంభించారు.
గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం విజయరథంపై నుంచి ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా వీహెచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను, కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఇంటింటికీ తీసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు. వీహెచ్ మాట్లాడుతూ ఇందిర, రాజీవ్‌ల నాయకత్వంలో పనిచేసిన అనుభవంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అందుకే సీఎం సొంత నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment